చిన్న సినిమాలపై కుట్ర జరుగుతోంది.. పీవీఆర్, ఐనాక్స్‌కు నటుడు నోటీసులు

ABN , Publish Date - Jun 21 , 2026 | 12:20 PM

తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలు ఎదుర్కొంటున్న సమస్యలపై నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ ఆవేదన వ్యక్తం చేశారు.

O Andala Rakshasi

తెలుగు సినీ పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలపై పెద్ద స్థాయిలో కుట్ర జరుగుతోందని నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ సంచలన ఆరోపణలు చేశారు. తన చిత్రం 'ఓ అందాల రాక్షసి' విడుదల, రీ-రిలీజ్ సమయంలో ఎదురైన ఇబ్బందులపై హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

తన సినిమాపై మాత్రమే కాకుండా, లో-బడ్జెట్ చిత్రాల నిర్మాతలందరికీ అన్యాయం జరుగుతోందని షెరాజ్ అన్నారు. చిన్న సినిమాలకు థియేటర్లు ఇస్తామని ముందుగా హామీ ఇచ్చి, చివరి నిమిషంలో వెనక్కి తీసుకుంటున్నారని ఆరోపించారు. థియేటర్ల కేటాయింపు వ్యవస్థలో రాజకీయాలు పనిచేస్తున్నాయని, దీనివల్ల చిన్న చిత్రాలు తీవ్రంగా నష్టపోతున్నాయని పేర్కొన్నారు.

హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో చిన్న సినిమాలకు చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే షోలు కేటాయిస్తున్నారని, అవి కూడా ప్రేక్షకులు తక్కువగా వచ్చే సమయాల్లోనే ఇస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సినిమాలు ప్రేక్షకులకు చేరకముందే విఫలమవుతున్నాయని తెలిపారు.

థియేటర్ల సమస్యతో పాటు ఆడియో హక్కులు, శాటిలైట్ రైట్స్, ఓటీటీ ప్లాట్‌ఫార్ములు, ఓవర్సీస్ మార్కెట్ వంటి అన్ని విభాగాల్లోనూ చిన్న సినిమాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని షెరాజ్ చెప్పారు. కొత్త దర్శకులు, నిర్మాతలకు అవకాశాలు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

'ఓ అందాల రాక్షసి' చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరూ మంచి స్పందన ఇచ్చారని, అలాంటి సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై పలుమార్లు ఫిల్మ్ చాంబర్‌ను ఆశ్రయించినప్పటికీ స్పందన రాలేదన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు భరత్ భూషణ్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

థియేటర్ల కేటాయింపులో జరిగిన అన్యాయంపై పీవీఆర్, ఐనాక్స్, ఏషియన్ సినిమాస్ సంస్థలకు లీగల్ నోటీసులు పంపినట్లు షెరాజ్ వెల్లడించారు. మొదటి విడుదల సమయంలో సరైన అవకాశాలు లభించి ఉంటే రీ-రిలీజ్ అవసరం వచ్చేది కాదన్నారు.

ఇతర రాష్ట్రాల్లో సినిమాలకు సబ్సిడీలు అందుతున్నాయని, తెలుగు రాష్ట్రాల్లో కూడా చిన్న చిత్రాలకు ప్రత్యేక ప్రోత్సాహక విధానాలు తీసుకురావాలని ఆయన ప్రభుత్వాలను కోరారు. ఇండస్ట్రీలో సమస్యలు ఉన్నప్పటికీ చాలామంది భయంతో మాట్లాడడం లేదని, తాను మాత్రం నిజం కోసం పోరాడుతున్నానని చెప్పారు. పరిస్థితులు మారకపోతే ఇతర భాషా చిత్ర పరిశ్రమల్లో పనిచేయాలనే ఆలోచన కూడా ఉందని షెరాజ్ మెహదీ వ్యాఖ్యానించారు.

Updated Date - Jun 21 , 2026 | 12:49 PM