‘జిందగీ నా మిలేగీ దొబారా 2’పై.. జోయా అక్తర్ కీలక అప్‌డేట్‌.. 15 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ ముగ్గురు!

ABN , Publish Date - Aug 18 , 2026 | 09:01 AM

Zindagi Na Milegi Dobara 2పై దర్శకురాలు జోయా అక్తర్ కీలక అప్‌డేట్‌ ఇచ్చారు

Zindagi Na Milegi Dobara

బాలీవుడ్‌లో కల్ట్‌ క్లాసిక్‌గా నిలిచిన సినిమాల్లో 2011లో విడుదలైన ‘జిందగీ నా మిలేగీ దొబారా’ (Zindagi Na Milegi Dobara) ఒకటి. హృతిక్‌ రోషన్ (Hrithik Roshan), ఫర్హాన్‌ అక్తర్ (Farhan Akhtar), అభయ్‌ డియోల్ (Abhay Deol) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఓ వెకేషన్‌ కోసం స్పెయిన్‌ వెళ్లిన ముగ్గురు స్నేహితులు కలిసి చేసిన ప్ర‌యాణం ఆపై వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందనేది కథ. స్నేహం, ప్రేమ, జీవితం చుట్టూ చోటు చేసుకునే మార్పులను దర్శకురాలు జోయా అక్తర్ (Zoya Akhtar) ఎంతో అందంగా, హృద్యంగా తెరకెక్కించారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ రాబోతుందనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

తాజాగా ‘జిందగీ నా మిలేగీ దొబారా 2’ గురించి జోయా అక్తర్‌ కీలక అప్‌డేట్‌ ఇచ్చారు. ప్ర‌స్తుతం ఈ సినిమా సీక్వెల్‌పై పనిచేస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. అయితే కథ విషయంలో మాత్రం ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవడం లేదని తెలిపారు. మొదటి సినిమాలోని పాత్రలను దాదాపు 15 ఏళ్ల తర్వాత తిరిగి తెరపైకి తీసుకురావాలంటే కథ చాలా బలంగా ఉండాలని జోయా తెలిపింది. ఆ పాత్రలు ఇప్పుడు ఎలా ఉంటాయి? వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి? అనే అంశాలను సహజంగా చూపించగల కథ దొరికితేనే సీక్వెల్‌ను ముందుకు తీసుకెళ్లాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

‘ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుందో, ఏం జరగదో ఇప్పుడే చెప్పలేం. ఈ పాత్రలను ఇప్పుడు కలుసుకున్నప్పుడు ఆ కథ సరైనదిగా అనిపించే స్థాయికి మనం చేరుకుంటామో లేదో చూడాలి. అలా జరిగితే చాలా బాగుంటుంది’ అని జోయా అక్తర్‌ పేర్కొంది. అయితే.. ప్ర‌స్తుతం ‘జిందగీ నా మిలేగీ దొబారా 2’పై పని జరుగుతున్నప్పటికీ.. సరైన కథ సిద్ధమైన తర్వాతే అధికారికంగా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. మొద‌టి భాగంలో న‌టించ‌న వారే ఇందులోనూ న‌టిస్తారా లేక కొత్త వారిని తీసుకు వ‌స్తారా అనేది తెలియాల్సి ఉంది. హృతిక్‌, ఫర్హాన్‌, అభయ్‌ మళ్లీ అదే పాత్రల్లో కనిపిస్తే ఈ సీక్వెల్‌ బాలీవుడ్‌లో మరోసారి భారీ అంచనాలు తెచ్చుకోవడం ఖాయమనే చెప్పాలి.

Updated Date - Aug 18 , 2026 | 09:18 AM