శ్రీదేవి కూతురికే ఎందుకు ఇలా జరుగుతోంది..
ABN , Publish Date - Oct 03 , 2026 | 06:58 PM
అతిలోక సుందరి శ్రీదేవి తనయురాలిగా భారీ అంచనాల మధ్య సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్. తల్లికి తగ్గ వారసురాలిగా స్టార్ హీరోయిన్ హోదాను అందుకోవాలని, తన నటనా ప్రతిభతో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవాలని ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుంది.
అతిలోక సుందరి శ్రీదేవి తనయురాలిగా భారీ అంచనాల మధ్య సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్ (Janhvi Kapoor). తల్లికి తగ్గ వారసురాలిగా స్టార్ హీరోయిన్ హోదాను అందుకోవాలని, తన నటనా ప్రతిభతో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవాలని ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే, కెరీర్ ప్రారంభం నుంచి నేటి వరకు ఆమె చుట్టూ విమర్శలు, సోషల్ మీడియా ట్రోలింగ్స్ వెన్నాడుతూనే ఉన్నాయి.
అతిలోక సుందరి కూతురైనప్పటికీ నెపోటిజం ముద్ర వల్ల జాన్వీ ఏ సినిమా చేసినా విమర్శకుల దృష్టి ఆమె నటన కంటే బ్యాక్‌గ్రౌండ్‌పైనే ఎక్కువుంది. తల్లి శ్రీదేవి రేంజ్‌తో పోలుస్తూ తొలి రోజుల్లోనే ఆమెపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. ఇక ఎంతో కాలంగా ఎదురుచూసిన టాలీవుడ్ ఎంట్రీ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంతో లభించినప్పటికీ, ఆ సినిమా విడుదల సమయంలో ఆమె పాత్ర పరిధిపై నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. పెర్ఫార్మెన్స్ కంటే కేవలం గ్లామర్, గ్లామరస్ సాంగ్స్ కే పరిమితం చేశారంటూ నెటిజన్లు ఆమెపై ట్రోల్స్ చేశారు.
ఇక రామ్ చరణ్ – బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో వచ్చిన పెద్ది చిత్రంలో జాన్వీ కపూర్ పాత్రపై జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ సినిమాలో ఆమె పాత్రను ఓవర్-సెక్సువలైజ్ చేశారని, కేవలం అందాల ఆరబోత కోసమే పాత్రను రూపొందించారంటూ ఆడియన్స్, కొంతమంది నెటిజన్లు తీవ్రంగా ఆక్షేపించారు. సోషల్ మీడియాలో ఈ చర్చలు కాస్తా వివాదాస్పదంగా మారి, డీఓపీ, దర్శకులు కెమెరా యాంగిల్స్ ద్వారా నటీమణులను ఆబ్జెక్టిఫై చేస్తున్నారనే స్థాయికి చేరడం ఆమెను మళ్లీ ట్రోలింగ్ కేంద్రబిందువుగా మార్చింది.
ఆ వివాదాలు అన్నీ సద్దుమణిగాయి అనుకున్న సమయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో రూపొందించిన డీప్‌ఫేక్ అశ్లీల వీడియాలు, ఫొటోలు జాన్వీ కపూర్‌ను మరింత మానసిక వేదనకు గురిచేశాయి. ఇటీవల చుట్టమల్లే పాటకు సంబంధించిన దృశ్యాలను, ఎన్టీఆర్‌తో ఉన్న క్లిప్పులను ఏఐ ద్వారా తప్పుగా మార్చి వైరల్ చేయడంతో సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై జాన్వీ కపూర్, ఎన్టీఆర్‌లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ 'ఇది సభ్యసమాజం సిగ్గుపడేలా ఉంది' అని ఆగ్రహం వ్యక్తం చేయగా, ఇలాంటి కంటెంట్‌ను వెంటనే తొలగించాలని కేసులు కూడా పెడుతున్నారు.
అసలు జాన్వీ పైనే ఎందుకు ఇంత నెగిటివిటీ.. అంటే శ్రీదేవి కుమార్తెగా ఉన్న విపరీతమైన పాపులారిటీ, నేటి సోషల్ మీడియా కల్చర్‌లో క్లిక్‌బైట్స్/వ్యూస్ కోసం ఆమె పేరును వాడడమే దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రొఫెషనల్‌గా తను ఎంచుకుంటుంది కథాప్రాధాన్యమున్న సినిమాలైనా, కమర్షియల్ ప్రాజెక్టులైనా సరే.. నెటిజన్లు ఆమె నటనను వదిలేసి గ్లామర్, లీక్డ్ పిక్స్, ఫేక్ వీడియోలపైనే దృష్టి పెడుతున్నారు. స్టార్ డమ్ ఇచ్చే పబ్లిసిటీ ఎంత ఉందో, అంతకు రెట్టింపుగా సోషల్ మీడియా సైబర్ వేధింపులను, నెగెటివిటీని భరిస్తూ తన సినీ ప్రయాణాన్ని కొనసాగించాల్సి రావడం ఆమెకు ఒక పెద్ద సవాలుగా మారింది. మరి ఈ పరిస్థితి నుంచి అతిలోక సుందరి వారసురాలు ఎలా బయటపడుతుందో చూడాలి.