ప్రాజెక్టులు ఆగిపోతే నష్టపరిహారం చెల్లించేదెవరు?
ABN , Publish Date - Jun 09 , 2026 | 03:35 PM
స్టార్స్ తో సినిమాలు తీసేవారు భారీ తనానికే జై కొడతారు. తమ చిత్రాలు విజువల్ వండర్స్ గా నిలవడానికి ఏమైనా చేస్తారు. కొన్ని హ్యూజ్ ప్రాజెక్ట్స్ అర్ధాంతరంగా ఆగిపోయాయి.
స్టార్స్ తో సినిమాలు తీసేవారు భారీ తనానికే జై కొడతారు. తమ చిత్రాలు విజువల్ వండర్స్ గా నిలవడానికి ఏమైనా చేస్తారు. కొన్ని హ్యూజ్ ప్రాజెక్ట్స్ అర్ధాంతరంగా ఆగిపోయాయి. అద్భుతమైన సెట్స్ వేసినా షూటింగ్ కు నోచుకోనివీ ఉన్నాయి. మరి లాభనష్టాల మాటేమిటి?. బాలీవుడ్ లో ప్రస్తుతం అదే చర్చ సాగుతోంది. ఆ ముచ్చటేంటో మరి....!
45 కోట్లు ఇవ్వాల్సిందే...!
'డాన్' ఫ్రాంచైజీలో రెండు సార్లు షారుఖ్ ఖాన్ తో సాగి హిట్ పట్టేసిన డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ మూడో 'డాన్'లో రణవీర్ సింగ్ ను ఎంచుకున్నారు. అంతా బాగానే ఉంది. 'డాన్-3' కోసం భారీ సెట్స్ రూపొందించారు. రణవీర్ సింగ్ తో పాటు ఎంతోమంది నటీనటులకు సాంకేతిక నిపుణులు అడ్వాన్సులు ఇచ్చారు. మరో పదిహేను రోజుల్లో షూటింగ్ ఉందనగా రణవీర్ సింగ్ 'డాన్-3' స్క్రిప్ట్ మార్చమని ఓ మెలిక పెట్టారట. దాంతో షూటింగ్ ఆగిపోయింది. అప్పటికే అడ్వాన్సుల రూపంలో, షూటింగ్ స్పాట్స్ కు, సెట్టింగ్స్ కు నిర్మాతలు చేసిన ఖర్చుపై బాలీవుడ్ లో ఇప్పుడు చర్చ ఊపందుకుంది. 'ధురంధర్' చిత్రంతో తనకు లభించిన ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొనే రణవీర్ సింగ్ సబ్జెక్ట్ లో మార్పులు చేయమన్నట్టు తెలుస్తోంది. అయినా, కొద్ది రోజుల్లో షూటింగ్ ఉందనగా షూటింగ్ కేన్సిల్ చేయమనడంతో నిర్మాతకు ఎంతో నష్టం వాటిల్లుతోంది. ప్రీ ప్రొడక్షన్ లో తాము వెచ్చించిన 45 కోట్ల రూపాయలను చెల్లించాలని రణవీర్ సింగ్ ను డిమాండ్ చేస్తున్నారు డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ - ప్రొడ్యూసర్ రితేశ్ సిద్వానీ.
రంగంలోకి షారుఖ్...
బాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు ఎందరో 'డాన్-3' డైరెక్టర్, ప్రొడ్యూసర్ కు మద్దతుగా నిలిచారు. తన వల్ల జరిగిన నష్టానికి రణవీర్ సింగ్ పది కోట్లు చెల్లిస్తానని మేకర్స్ ను కోరారు. అయితే తాము ఎంతో నష్టపోతే నాలుగోవంతు మాత్రమే చెల్లిస్తానని చెప్పడం సబబు కాదని వారు రణవీర్ ఆఫర్ ను తిరస్కరించారు. ఈ నేపథ్యంలో 'ఫెడరేషన్ ఆఫ్ వెస్టరన్ ఇండియా సినీ ఎంప్లాయిస్' రణవీర్ సినిమాలకు సహకరించరాదని తీర్మానించారు. అయితే రణవీర్ సింగ్ టీమ్ లీగల్ నోటీస్ పంపడంతో ఈ 'నాన్-కో ఆపరేషన్' ను ఉపసంహరించుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో రణవీర్ కు రామ్ గోపాల్ వర్మ మద్దతు పలికారు. అయితే రామ్ గోపాల్ వర్మ గతంలో సినీ ఎంప్లాయిస్ కు కోటిన్నర రూపాయలు బకాయిపడ్డ అంశాన్ని ఇప్పుడు వారు లేవనెత్తారు. ఇలా ముంబైలో 'డాన్-3' కారణంగా చర్చోపచర్చలు సాగుతున్నాయి. 'డాన్' మొదటి రెండు భాగాల్లో నటించిన షారుఖ్ ఖాన్ కు హీరోయిన్ దీపికా పడుకోణె అంటే ఎంతో అభిమానం. ఆయనే ఆమెను బాలీవుడ్ కు పరిచయం చేశారు. ఈ నేపథ్యంలో దీపిక భర్త రణవీర్ సింగ్ కు, 'డాన్' మేకర్స్ కు మధ్య సయోధ్య కుదిర్చే పనిలో షారుఖ్ ఉన్నట్టు వినికిడి.
సౌత్ లోనూ అదే తీరు...
టాప్ స్టార్స్ తో భారీ చిత్రాలు ఆరంభించడం- అవి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోవడం అన్నది కొత్తేమీ కాదు. టాలీవుడ్ లోనూ చిరంజీవి హీరోగా భారీ స్థాయిలో ఆరంభమైన 'అబు- ద థీఫ్ ఆఫ్ బాగ్దాద్' కొంత షూటింగ్ జరుపుకొని ఆగిపోయింది. అలాగే బాలకృష్ణ హీరోగా భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థ భారీ స్థాయిలో ఆరంభించిన జానపద చిత్రం రెండు షెడ్యూల్స్ అయ్యాక అటకెక్కింది... కారణాలు ఏవైనా భారీ స్థాయిలో ఆరంభమై ఆగిపోతే నిర్మాతలకు ఎంతో నష్టం వాటిల్లుతుంది... ఆ నష్టపరిహారం దిశగా చర్యలు సాగాలి... కారణాలు ఏ వైనా చిరంజీవి, బాలకృష్ణ వంటి టాప్ స్టార్స్ మూవీస్ ఆగిపోవడం విచారకరం. కోలీవుడ్ లో కమల్ హాసన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా 'మరుద నాయగమ్' ఆరంభించారు... కొంత షూటింగ్ కూడా జరిపారు... ఆ తరువాత భారీ వ్యయం కారణంగా ఆ ప్రాజెక్ట్ ను ఆపేయాల్సి వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే నార్త్, సౌత్ అన్న తేడా లేకుండా అన్ని చిత్రసీమల్లోనూ కొన్ని ప్రాజెక్ట్స్ ఆగిపోయాయి.
మూలనపడ్డవి ఎన్నో...
గతంలో బాలీవుడ్ లోనూ ఎన్నో ప్రాజెక్ట్స్ భారీ స్థాయిలో ఆగిపోయాయి. కొన్ని సినిమాలు కొంత షూటింగ్ జరుపుకొని చాపచుట్టేశాయి. మరికొన్ని ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయ్యాక నిలచిపోయాయి. ప్రస్తుతం రణవీర్ సింగ్ కారణంగా 'డాన్-3' రెండో కోవకు చెందింది... ఇంతకు ముందు మున్నాభాయ్ ఫ్రాంచైజ్ లో 'మున్నా భాయ్ చలే అమెరికా' ప్లాన్ చేసి, టీజర్ కూడా షూట్ చేశారు. కొంత పార్ట్ షూటింగ్ జరిగాక ఆ మూవీ ఆగిపోయింది. అంతకు ముందు 'మున్నాభాయ్' రెండు సినిమాలుగా అలరించినా, మూడో భాగం ఆగిపోవడం వెనకాల ఈ నాటికీ పలు కారణాలు వినిపిస్తూనే ఉంటాయి. సల్మాన్ ఖాన్, అలియా భట్ తో 'ఇన్షాఅల్లా' మూవీని తెరకెక్కించేందుకు సంజయ్ లీలా భన్సాలీ ప్రయత్నించారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయ్యాక అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ అటకెక్కింది... ఆమిర్ ఖాన్ , రవీనా టాండన్ జంటగా శేఖర్ కపూర్ 'టైమ్ మిషన్' కొంత షూటింగ్ జరుపుకున్న తరువాత ఆగిపోయింది. ఇలా టాప్ స్టార్స్ చిత్రాలు ఎన్నో ముంబైలో మూలన పడ్డాయి.
సమాధానం ఏమిటి !?
అర్ధాంతరంగా ఆగిన సినిమా ప్రాజెక్ట్స్- ప్రీ ప్రొడక్షన్ పూర్తయి సెట్స్ కు వెళ్ళే సమయంలో నిలచినవి అన్ని సినిమారంగాల్లోనూ ఉన్నాయి. అయితే ఆ నష్టాన్ని ఎవరు భరించాలి అన్నదే ప్రశ్న. నిర్మాతనే సినిమా ఆపేస్తే - ఆయన ప్రాజెక్ట్ లో పనిచేసిన వారికి ఎంతో కొంత నష్టపరిహారం చెల్లించాలి. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ నే నమ్ముకొన్నవారు ఉండవచ్చు... స్టార్స్, డైరెక్టర్స్ మధ్య క్రియేటివిటీ డిఫరెన్సెస్ వచ్చి ఆగిపోతే, వారు కలసి నష్టపరిహారాన్ని భరించాలి. ఇలాంటి నియమనిబంధనలు ఏర్పాటు చేసుకోకపోతే, నష్టాల పాలయిన వారిని ఎవరు ఆదుకుంటారు?. మరి ఈ ప్రశ్నకు ఎంతమంది సినీజనం నిజాయితీగా సమాధానమిస్తారో చూడాలి.