అమితాబ్ బచ్చన్‌కు ఏమైంది? ఆరోగ్యంపై బిగ్ బీ పోస్ట్.. అభిమానుల్లో ఆందోళన
ABN , Publish Date - Oct 22 , 2026 | 08:16 AM
అమితాబ్ బచ్చన్‌కు కొన్ని రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. తాజాగా ఆయన చేసిన పోస్ట్‌తో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. మోకాలి గాయంపై కూడా చర్చ జరుగుతోంది.
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ఆరోగ్యంపై అభిమానుల్లో మరోసారి ఆందోళన మొదలైంది. తాజాగా ఆయన చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఈ చర్చకు కారణమైంది. 'నేను కోలుకోవడానికి కొన్ని రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. కాబట్టి నేను ఇక్కడ ఏమీ రాయలేక పోతున్నాను. అందుకు నన్ను క్షమించమని కోరుతున్నాను' అని అమితాబ్ పేర్కొన్నారు. అందుకే కొంతకాలం పాటు తన పోస్టులకు విరామం ఇవ్వాల్సి వస్తోందని తెలిపారు. దీంతో ఆయనకు ఏమైందనే ప్రశ్నలు అభిమానుల్లో మొదలయ్యాయి.
కొన్ని రోజుల క్రితం అమితాబ్ చేసిన పోస్టులను చూసి ఆయన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు నెట్టింట ప్రచారం జరిగింది. దీనికి తోడు ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ తాజా సీజన్ సందర్భంగా తన మోకాలికి గాయమైనట్లు ఆయన గతంలో వెల్లడించారు. ఇప్పుడు వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో, ఈ గాయానికి సంబంధించిన సమస్యే కారణమా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతం విశ్రాంతి తీసుకోవడానికి మోకాలి గాయమే కారణమని అమితాబ్ స్పష్టంగా చెప్పలేదు.
తన ఆరోగ్యం గురించి అమితాబ్ చేసిన తాజా ప్రకటనతో అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. అయితే ఆయనకు ప్రస్తుతం ఉన్న ఆరోగ్య సమస్య ఏమిటి? ఎంతకాలం విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.