సల్మాన్.. నీ ఇంట్లోని కుక్క‌ను కూడా వ‌దిలిపెట్టం! బిష్ణోయ్ గ్యాంగ్ మళ్లీ బెదిరింపులు

ABN , Publish Date - Oct 20 , 2026 | 06:33 AM

సల్మాన్ ఖాన్ ఆయన కుటుంబంపై బెదిరింపులకు పాల్పడుతూ లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన గ్యాంగ్ స్టర్ అనిల్ పండిట్ పేరిట విడుదల చేసిన ఓ ఆడియో క్లిప్ కలకలం రేపుతోంది.

Tiger Shroff firing case

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) ఆయన కుటుంబంపై బెదిరింపులకు పాల్పడుతూ లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) ముఠాకు చెందిన గ్యాంగ్ స్టర్ అనిల్ పండిట్ పేరిట విడుదల చేసిన ఓ ఆడియో క్లిప్ కలకలం రేపుతోంది. ముంబైలో మరో నటుడు టైగర్ ష్రాప్ (Tiger Shroff) కారుపై కాల్పులు జరిగిన మరుసటి రోజే వెలుగులోకి వచ్చిన ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'సల్మాన్ ఖాన్.. నా అన్న లారెన్స్ బిష్ణోయ్, బిష్ణోయ్ సమాజానికి క్షమాపణలు చెప్పు, లేదంటే నీ ఇంట్లో కుక్కను కూడా వదిలిపెట్టం. నీ కుటుంబాన్ని నాశనం చేస్తాం.. నీకు భద్రత ఉందని.. నీకేమి జరగదని అస్సలు అనుకోవద్దు..' అంటూ ఆడియోలో తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ ఆడియో నిజమైనదా.. కాదా అని తేల్చేందుకు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

కృష్ణ జింకలను వేటాడిన (1998 నాటి) కేసులో నిందితుడిగా ఉన్న సల్మాన్ పై ఇప్పటికే బిష్ణోయ్ ముఠా పలుమార్లు బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే.. తాజా పరిణామాలతో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద భద్రతను మరింత పెంచారు. బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్మెంట్స్ నివాసం వెలుపల ముంబై పోలీసులు పహారా కాస్తూ అటుగా వెళ్తున్న వాహనాల తనిఖీ చేపట్టారు. ఇటు టైగర్ ష్రాప్‌పై హత్యాయత్నం కేసులో ఓ మైనర్ సహా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్‌లోని కోటాలో పుణె-జైపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైల్లో వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను బీహార్ బెగుసరాయ్‌కు చెందిన రితిక్ అలియాస్ రోషన్, హరియాణాలోని సోనిపటకు చెందిన రేహాన్, మరో మైనర్ బాలుడున్నారని కోటా ఎస్పీ తేజస్విని తెలిపారు.

నిందితులు పుణె-జైపూర్ రైలు ఎక్కినట్లు సమాచారం రావడంతో దాదాపు 15 నిమిషాల పాటు కోటా రైల్వే స్టేషన్‌లో ఆపరేషన్ నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. కోటా నుంచి ఢిల్లీకి.. అటు నుంచి నేపాల్‌ పారిపోయేందుకు వారు ప్లాన్ చేసుకున్నారన్నారు. బిష్ణోయ్ ముఠాకు చెందిన అనిల్ పండిట్‌తో రేహాన్‌కు సంబంధాలున్నాయని.. దాడికి ముందు ఆ ముగ్గురు రూ.50 వేలు తీసుకున్నారని ప్రాథమిక విచారణలో తేలింద న్నారు. కోటా చేరుకున్న మహారాష్ట్ర పోలీసులు. నిందితులను ముంబై తరలించేందుకు ట్రాన్సిట్ రిమాండ్ కోసం మేజిస్ట్రేట్ ముందు వారిని హాజరు పరిచారు.

ఏ ఒక్కరినీ విడిచిపెట్టం: సీఎం ఫడ్నవీస్

ఇటు కాల్పుల ఘటనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సీరియస్‌గా స్పందించారు. దాడికి పాల్పడిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమన్నారు. టైగర్ ష్రాప్‌తో ఫోన్లో మాట్లాడి.. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని ఆందోళన చెందొద్దని భరోసానిచ్చారు. ఉపముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే టైగ‌ర్ ష్రాప్ ఇంటికెళ్లి పరామర్శించారు. కుటుంబా నికి పూర్తి భద్రత కల్పిస్తామన్నారు. అయితే తనను ఎందుకు టార్గెట్ చేశారో తెలియట్లేదని.. గతంలో ఎలాంటి బెదిరింపులు రాలేదని, ఎవరితోనూ శత్రుత్వం లేదని టైగర్ షాఫ్ శిండేతో చెప్పినట్లు సమాచారం. అలాగే బిష్ణోయ్ గ్యాంగ్, సల్మాన్ ఖాన్‌కు సంబంధించిన వ్యవహారాలతో ఏ సంబంధం లేదని పేర్కొనట్లు తెలిసింది.

Updated Date - Oct 20 , 2026 | 06:39 AM