నటనకు స్వస్తి.. వ్యాఖ్యలపై స్పందించిన విక్రాంత్ మాస్సే..
ABN , Publish Date - Feb 07 , 2026 | 12:18 PM
బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే.. ‘ట్వెల్త్ ఫెయిల్’ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయారు. అంతకుముందే ఎన్నో చిత్రాల్లో నటించినా ఈ చిత్రంలో నటన దేశవాప్తంగా ప్రేక్షకుల దృష్టి ఆయనపై పడేలా చేసింది.
బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే(Vikrant Massey).. ‘ట్వెల్త్ ఫెయిల్’ (12th Fail) సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయారు. అంతకుముందే ఎన్నో చిత్రాల్లో నటించినా ఈ చిత్రంలో నటన దేశవాప్తంగా ప్రేక్షకుల దృష్టి ఆయనపై పడేలా చేసింది. 71వ జాతీయ పురస్కారాల్లో ఉత్తమ నటుడిగా పురస్కారం వరించింది. మంచి సక్సెస్ లో ఉన్న సమయంలో రిటైర్మెంట్ (Retirement post viral) అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం 2024 చివర్లో సంచలనం సృష్టించింది. ఇకపై కుటుంబ సభ్యులకు పూర్తి సమయం కేటాయించాల్సిన సమయం వచ్చిందని, కొత్త సినిమాలను ఇక అంగీకరించడం లేదని, ‘సైన్ చేసిన చిత్రాలు పూర్తి చేసి సినిమాలకు విరామం తీసుకుంటాననీ అని విక్రాంత్ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే ఆ వ్యాఖ్యల్ని జనాలు తప్పుగా అర్థం చేసుకున్నారని తాజాగా విక్రాంత్ తెలిపారు.
‘అప్పట్లో రిటైర్‌మెంట్ అంటూ నేను చేసిన వ్యాఖ్యల్ని ప్రేక్షకులు వేరుగా అర్థం చేసుకున్నారు. నేను చెప్పాలనుకున్న విషయాన్ని అతి తక్కువ పదాలతో చెప్పడంతో అందరూ దానిని తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను విరామం తీసుకుందామనుకున్నాను. కానీ, శాశ్వతంగా నటనకు దూరం కావాలనుకోలేదు. ‘ట్వెల్త్ ఫెయిల్’ సక్సెస్, జాతీయ పురస్కారం రావడం, వ్యక్తిగత కారణాల వల్ల ఆ సమయంలో తీవ్ర ఒత్తిలో ఉన్నా. అందుకే కొన్ని రోజులు విరామం తీసుకుంటానని ప్రకటించా. ఆ మాటల్ని అందరూ నేను ఇండస్ర్టీకి శాశ్వతంగా దూరమవుతున్నానని భావించారు. సరైన కారణమేంటని ఎవరూ అడగలేదు. రోజులో 14, 16 గంటలు పని చేయడం చాలా కష్టంగా అనిపించింది. వరుస ప్రాజెక్ట్‌లతో అప్పటికే చాలా అలసిపోయా. అందుకే బ్రేక్ ఇచ్చాను. ఆ సమయంలో నేను చేసిన సినిమాలన్నీ సక్సెస్ సాధించాయి. ఏడాదికి 4 చిత్రాలకు పని చేయడం అంటే కష్టమే. అందుకే ఆ సమయంలో అలా అనిపించింది’ అని అన్నారు.