తెలియకుండా గర్భాశయాన్ని తొలగించారు.. సింగ‌ర్‌ ఉదిత్ నారాయణ్‌పై మొదటి భార్య ఫిర్యాదు

ABN , Publish Date - Feb 12 , 2026 | 01:33 PM

ఉదిత్ నారాయణ్‌ మొదటి భార్య రంజనా ఝా భర్తపై మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. తనకు తెలియకుండానే వైద్యపరీక్షల సమయంలో గర్భాశయాన్ని తొలగించారని ఆమె ఆరోపిస్తున్నారు.

Udit Narayan

ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్‌ (Udit Narayan) కు తెలుగులోనూ మంచి పేరుంది. ఇటీవల విడుదలైన చిరంజీవి (Chiranjeevi) 'మన శంకర వరప్రసాద్ గారు' (Mana Shankara Vara Prasad Garu) సినిమాతో ఆయన టాలీవుడ్‌లో రీ-ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా మ్యూజికల్ హిట్ అయ్యింది. దాంతో ఈ యేడాది ఉదిత్ నారాయణ్‌కు తెలుగులోనూ పలు అవకాశాలు వస్తాయని అందరూ భావించారు. అయితే మరోసారి ఇక్కడ పేరు ప్రఖ్యాతులు గడించడం మాట అటుంచి, ఇప్పుడు ఆయనపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. దాన్ని కూడా ఆయన మొదటి భార్య రంజనా ఝా (Ranjana Jha) పెట్టడం విశేషం.

ఉదిత్ నారాయణ్‌ ముంబై వెళ్ళి గాయకుడిగా పేరు గడించకముందే ఆయన వివాహం 1984 డిసెంబర్ 7న రంజనా ఝాతో జరిగింది. కొంతకాలానికి ఆయన ముంబైకి వెళ్ళి గాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో దీపను ద్వితీయ వివాహం చేసుకున్నారు. తనకు తెలియకుండా, తన అనుమతి లేకుండా ఉదిత్ నారాయణ్ రెండో పెళ్ళి చేసుకున్నారని రంజనా అప్పట్లో వాపోయారు. అనేకసార్లు ఆయనపై కేసులూ పెట్టారు. అయితే... ఆమెను చల్లబరుస్తూ ఉదిత్ నారాయణ్‌ ఆర్థిక సాయం చేస్తూ వచ్చారని, నెలకు పాతిక వేల రూపాయలు పంపుతుండేవారని సన్నిహితులు తెలిపారు.


ఇదిలా ఉంటే... తాజాగా మరోసారి రంజనా ఝా తన న్యాయవాది కరుణాకాంత్ ఝాతో కలిసి బీహార్‌లోని సుపౌల్‌ మహిళా పోలీస్ స్టేషన్‌లో మంగళవారం భర్త ఉదిత్ నారాయణ్‌పై కేసు పెట్టారు. 1996లో ఢిల్లీలో జరిగిన వైద్య పరీక్షల సమయంలో తన గర్భాశయాన్ని ఉదిత్ నారాయణ్‌, అతని ఇద్దరు సోదరులు తనకు తెలియకుండా తొలగించారని, ఆ సమయంలో దీపా నారాయణ్‌ కూడా అక్కడే ఉన్నారని ఆమె ఆరోపించారు. కొన్నేళ్ళ తర్వాత ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, ఇప్పుడు తన ఆరోగ్యం దెబ్బతిన్న కారణంగా ఉదిత్ నారాయణ్‌ తనకు సహాయం చేయాలని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎప్పుడు ఉదిత్ నారాయణ్ గ్రామానికి వచ్చినా ఇచ్చిన హామీలనే ఇస్తుంటారని, కానీ వాటిని ఆయన ఎప్పుడూ నెరవేర్చలేదని ఆమె తెలిపారు. కొంతకాలం క్రితం మహిళా కమీషనర్ దగ్గరకు వెళ్ళినా తన గోడును పట్టించుకోలేదని వాపోయారు. తాజాగా పెట్టిన కేసు విషయమై మహిళా పోలీస్ స్టేషన్ అధికారి మాట్లాడుతూ, 'దాదాపు మూడు దశాబ్దాల క్రితం జరిగిన సంఘటన కావడంతో కేసు రిజిస్టర్ చేసుకుని దర్యాప్తు చేస్తున్నామ'ని చెప్పారు.

Updated Date - Feb 12 , 2026 | 03:40 PM