దిశా పటానీకి చెక్ పెడుతున్న త్రిప్తి!

ABN , Publish Date - Apr 13 , 2026 | 12:18 PM

అంతర్జాతీయ లోదుస్తుల కంపెనీ విక్టోరియా సీక్రెట్‌కు త్రిప్తి డిమ్రీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ఈ సందర్భంగా ఆమె ఓ ప్రత్యేక వీడియోను సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.

Triptii Dimri

బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మలు బ్రాండ్‌ అంబాసిడర్స్‌గా ఒకరితో ఒకరు గట్టిగా పోటీపడుతున్నారు. ప్రఖ్యాత కెల్విన్‌ క్లెయిన్‌ (సీకే) బ్రాండ్‌కు ఓ పక్క అందాల చిన్నది దిశా పటానీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూంటే... ఆమెతో పోటీపడుతూ ఇప్పుడో అంతర్జాతీయ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా సైన్ చేసింది త్రిప్తీ డిమ్రీ. ప్రముఖ అంతర్జాతీయ ఫ్యాషన్‌ బ్రాండ్‌ విక్టోరియా సీక్రెట్‌... భారతీయ మార్కెట్లో తనదైన ముద్రను బలంగా వేయాలని అనుకుంది. అందులో భాగంగా బాలీవుడ్‌ భామ త్రిప్తి డిమ్రీతో అగ్రిమెంట్‌ చేసుకుంది. ఈ బ్రాండ్‌కు భారత్ నుండి ప్రచారం చేస్తున్న మొట్టమొదటి మహిళ త్రిప్తీ డిమ్రీనే కావడం విశేషం.


'యానిమల్‌' మూవీతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకున్న త్రిప్తి డిమ్రీ... ప్రకటనల రంగంలోనూ తన సత్తా చాటుతోంది. అందివచ్చిన అవకాశాలు దొరకపుచ్చుకుని ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ప్రభాస్‌, సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్‌'లో నటిస్తున్న త్రిప్తికి బ్రాండ్‌ అంబాసిడర్‌గానూ బోలెడన్ని అవకాశాలు వస్తున్నాయి. తాజాగా విక్టోరియా సీక్రెట్‌కు చెందిన స్టైలిష్‌ అవుట్ ఫిట్స్‌ను ధరించిన వీడియోను త్రిప్తి ఇన్ స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆత్మవిశ్వాసం, సాధికారికత, వైవిధ్యానికి ప్రతిరూపమైన విక్టోరియా సీక్రెట్‌ కుటుంబంలో భాగం కావడం ఎంతో గర్వంగా ఉందని ఆమె ఈ సందర్భంగా తెలిపింది. ఈ వీడియో కేవలం ఫ్యాషన్‌కే పరిమితం కాకుండా మహిళల వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఉంది. విక్టోరియా సీక్రెట్‌తో ఏర్పడిన బంధంతో త్రిప్తి డిమ్రీ ఖాతాలో మరెన్ని అంతర్జాతీయ సంస్థలు జమ అవుతాయో చూడాలి.

Updated Date - Apr 13 , 2026 | 01:56 PM