Tiger: రీల్లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ హీరోనే!
ABN , Publish Date - Oct 19 , 2026 | 03:00 PM
సినిమాల్లో విలన్లను చిత్తు చేస్తూ, ఒళ్లు గగుర్పొడిచే స్టంట్స్‌తో ప్రేక్షకులను అలరించే బాలీవుడ్ యాక్షన్ స్టార్ టైగర్ ష్రాఫ్.. నిజ జీవితంలోనూ హీరో అనిపించుకున్నారు.
సినిమాల్లో విలన్లను చిత్తు చేస్తూ, ఒళ్లు గగుర్పొడిచే స్టంట్స్‌తో ప్రేక్షకులను అలరించే బాలీవుడ్ యాక్షన్ స్టార్ టైగర్ ష్రాఫ్.. నిజ జీవితంలోనూ హీరో అనిపించుకున్నారు. ముంబైలోని జుహు ప్రాంతంలో టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఫుట్‌బాల్ ప్రాక్టీస్ అనంతరం ఆయన అక్కడి నుంచి బయలుదేరే సమయంలో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా తమ భద్రత గురించి ఆందోళన చెందుతారు. కానీ, ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ తన డ్రైవర్‌కు సహాయం చేసేందుకు ముందుకొచ్చారు.
కాల్పుల ఘటన అనంతరం గాయపడిన డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించేందుకు టైగర్ స్వయంగా చొరవ తీసుకున్నారు. ప్రమాదకర పరిస్థితుల్లోనూ బాధితుడికి సాయం చేయాలనే పడిన తపన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే కాల్పుల్లో టైగర్‌కు గాయాలయినప్పటికీ.. అంతకు మించి ప్రమాదం లో ఉన్న తన డ్రైవర్ ను స్వయంగా ఆయనే కార్ డ్రైవ్ చేసుకుంటూ నానావతి ఆసుపత్రికి తీసుకెళ్లారు.
టైగర్ ష్రాఫ్‌కు యాక్షన్ సినిమాల ద్వారా ప్రత్యేక గుర్తింపు వచ్చింది. కఠినమైన స్టంట్స్, ఫైట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే ఆయన.. నిజ జీవితంలో ఎదురయ్యే సవాళ్ల సమయంలో ఎలా స్పందిస్తారనేది కూడా ఇప్పుడు అభిమానుల్లో చర్చగా మారింది. మరోవైపు, ఈ కాల్పుల ఘటనతో ముంబైలో సినీ ప్రముఖుల భద్రతపై చర్చ మళ్లీ మొదలైంది. దాడికి గల కారణాలు, ఇందులో పాల్గొన్నవారి పాత్ర, ఇతరుల ప్రమేయం వంటి అంశాలపై పోలీసుల దర్యాప్తు కీలకం కానుంది. నిందితులకు సంబంధించి వెలువడుతున్న సమాచారాన్ని అధికారిక నిర్ధారణతోనే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.