కాల్పుల ఘటన తర్వాత ఫిట్‌నెస్ పై టైగర్ ష్రాఫ్ కీలక చర్చ..

ABN , Publish Date - Oct 25 , 2026 | 01:40 PM

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ (Tiger Shroff)పై  జరిగిన కాల్పుల ఘటన చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ (Tiger Shroff)పై  జరిగిన కాల్పుల ఘటన చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.  ఈ నెల 18న జుహు ప్రాంతంలోని  ఫుట్‌బాల్ మైదానం నుంచి కారులో వెళుతుండగా.. ముగ్గురు అజ్ఞాత వ్యక్తులు  బైక్‌పై వచ్చి టైగర్ కారుపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో టైగర్‌కు స్వల్ప గాయాలు కాగా.. ఆయన డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు.  ప్రస్తుతం టైగర్ కోలుకుంటున్నారు.  కఠినమైన వ్యాయామాలు, మార్షల్ ఆర్ట్స్, యాక్షన్ స్టంట్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన ప్రముఖ స్పోర్ట్స్ మెడిసిన్, రీజెనరేటివ్ ఆర్థోపెడిక్స్ నిపుణుడు డాక్టర్ వెంకటేష్ మోవ్వతో ఆయన ఆసక్తికర చర్చ చేసారు


"శారీరకంగా దృఢంగా ఉండటానికి వ్యాయామం ఎంత ముఖ్యమో, శరీరాన్ని గాయాల నుంచి కాపాడుకోవడం కూడా అంతే అవసరం. ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ టైగర్ ష్రాఫ్, డాక్టర్ వెంకటేష్ మోవ్వ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కండరాల బలాన్ని పెంచుకోవడం, శారీరక సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడం, పోషకాహారం, కీళ్ల సంరక్షణతో పాటు గాయాల తర్వాత తిరిగి సాధారణ స్థితికి చేరుకునే విధానాల గురించి మాట్లాడారు. దీనికి సంబంధించి టైగర్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు.

ఫిట్‌నెస్‌ను నిరంతరం కొనసాగించాలనుకునే వారు వ్యాయామాలకే పరిమితం కాకుండా, శరీరం కోలుకునే ప్రక్రియపైనా దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. గాయాల నుంచి కోలుకోవడంతో పాటు శారీరక సామర్థ్యాన్ని కొనసాగించేందుకు డాక్టర్ వెంకటేష్ మోవ్వ వద్ద పీఆర్పీ (PRP), స్టెమ్ సెల్ చికిత్సలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.  



'గాయాలు, కీళ్ల సమస్యలకు సంబంధించి ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య విధానాల్లో రీజెనరేటివ్ మెడిసిన్ ఒకటి. ఇందులో భాగంగా ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా (PRP) థెరపీ, ఎముక మజ్జ నుంచి సేకరించిన కణాలతో చేసే చికిత్సలు వంటి విధానాలను కొన్ని సందర్భాల్లో పరిశీలిస్తారని టైగర్ ష్రాఫ్ చెప్పారు. ఈ చికిత్సలు ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా ఉపయోగపడతాయని చెప్పలేమన్నారు. గాయం రకం, సమస్య తీవ్రత, రోగి ఆరోగ్య పరిస్థితి, వైద్య పరీక్షల ఫలితాలను బట్టి నిపుణులు తగిన చికిత్సను అందిస్తారని చెప్పారు.
 
'ఎముకలు, కీళ్లు, కండరాలకు సంబంధించిన సమస్యలు ఎదురైనప్పుడు శస్త్రచికిత్స ఒక్కటే పరిష్కారమని భావించాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో రోగి పరిస్థితిని బట్టి శస్త్రచికిత్స అవసరం లేని చికిత్సా విధానాలను కూడా పరిశీలించవచ్చు. సమస్యను తొలిదశలోనే గుర్తించడం, సరైన పరీక్షలు చేయించుకోవడం, అవసరమైన చికిత్సను ఆలస్యం చేయకుండా ప్రారంభించడం ఎంతో అవసరం. ముఖ్యంగా క్రీడాకారులు, నటీనటులు వృత్తిలో భాగంగా తీవ్రమైన శారీరక శ్రమను ఎదుర్కొంటుంటారు. అలాంటివారు గాయాలను నిర్లక్ష్యం చేయకుండా, కోలుకునేందుకు తగిన సమయం తీసుకోవాలి' అని ఈ చర్చలో వెల్లడించారు. 

''కేవలం శరీరాకృతిని మెరుగుపరుచుకోవడం లేదా కండరాలను పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకోకుండా, భవిష్యత్తులోనూ శారీరకంగా చురుగ్గా ఉండేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరక సామర్థ్యాన్ని పెంచుకోవడం ఎంత ముఖ్యమో, గాయాల నుంచి కోలుకోవడం, కండరాలు, ఎముకలు, కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని" చెప్పారు. 

Updated Date - Oct 25 , 2026 | 03:00 PM