భయం గుప్పిట్లో బాలీవుడ్ స్టార్ హీరోస్‌...సేఫ్టీ కోసం డ‌బుల్ ఖర్చు!

ABN , Publish Date - Feb 12 , 2026 | 02:18 PM

ఒకప్పుడు బాలీవుడ్‌ (Bollywood) ను మాఫియా శాసించింది. అప్పట్లో కొంతమంది డాన్స్ కనుసన్నల్లోనే హిందీ సినిమా రంగం సాగింది. ఇప్పుడు ప్రశాంతంగా ఉందనుకుంటే - మళ్ళీ హీరోలపై బెదిరింపులు మొదలయ్యాయి. ఇంతకూ ఏం జరుగుతోంది!?

Bollywood Heroes

బాలీవుడ్ కండల వీరుడుగా పేరొందిన సల్మాన్ ఖాన్ (Salman Khan) కు ఎప్పటి నుంచో ప్రాణ హాని ఉందని వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు 'ధురంధర్' (Dhurandhar) హీరో రణవీర్ సింగ్‌ (Ranveer Singh) కు కూడా ఓ థ్రెటనింగ్ నోట్ వచ్చిందట. రణవీర్ సింగ్‌కు గుర్తు తెలియని వ్యక్తుల నుండి వాట్సప్‌లో ఒక బెదిరింపు వాయిస్ నోట్ రావడం ఇప్పుడు ముంబైలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంలో రణవీర్ వెంటనే పోలీసులను ఆశ్రయించారు. దాంతో రణవీర్, ఆయన భార్య దీపికా పడుకోణె (Deepika Padukone) నివాసముంటున్న బిల్డింగ్ చుట్టూ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. చుట్టూ ఉన్న పోలీసులను చూసి అదే ప్రాంతంలో నివాసముంటున్న వారికి కూడా భయం భయంగా ఉందని టాక్.

సల్మాన్ ఖాన్, సైఫ్ అలీఖాన్, సోనాలీ బింద్రే, సోనమ్, టబు 1998లో జోద్‌పూర్‌లో వేటకు వెళ్ళారు. ఆ సమయంలో వారందరూ 'హమ్ సాథ్ సాథ్ హై' మూవీ షూటింగ్ కోసం ఆ ప్రాంతంలో ఉండవలసి వచ్చింది. ఓ రోజు షూటింగ్‌కు గ్యాప్ తీసుకొని వీరందరూ స్పాట్‌కు సమీపంలో ఉన్న కంకనీ గ్రామం అడవిలో రెండు కృష్ణజింకలను వేటాడారు. కృష్ణజింకలను ఎంతో ప్రేమగా చూసుకొనే బిష్ణోయ్ తెగవారు దీనిని అతి దారుణమైన నేరంగా భావించారు. సల్మాన్‌పై కేసు పెట్టారు. వారి ఫిర్యాదు మేరకు సల్మాన్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు. ఆపైన బెయిల్‌పై బయటకు వచ్చారు సల్మాన్. అయితే సల్మాన్ పలు న్యాయస్థానాలను ఆశ్రయించినా ఆయనను, ఆయనతో పాటు ఉన్నవారిని కూడా నేరస్థులుగానే పరిగణించారు. ఇప్పటికీ ఈ కేసులో కోర్టు మెట్లు ఎక్కుతూనే ఉన్నారు సల్మాన్. ఈ నేపథ్యంలోనే లారెన్స్ బిష్ణోయ్, అతని అనుచరులు సల్మాన్‌పై దాడికి యత్నించారు. అలాగే సైఫ్ అలీ ఖాన్‌పైనా దాడి జరిగింది. ఇప్పుడు రణవీర్ సింగ్‌కు బెదిరింపు నోట్ పంపించింది కూడా వారే అయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ మధ్యే దర్శకుడు రోహిత్ శెట్టి ఇంటిపై కూడా కొందరు కాల్పులు జరిపారు. అలా రోహిత్, రణవీర్‌పై లేటెస్ట్ అటెంప్ట్స్ కారణంగా బాలీవుడ్‌లో భయం చోటు చేసుకుంది.


టాప్ స్టార్స్‌కు బెదిరింపులు రావడం బాలీవుడ్‌లో కొత్తేమీ కాదు. ఒకప్పుడు మాఫియా రాజ్యమేలిన కాలంలో ఎంతో మంది హిందీతారలు అప్పటి మాఫియా డాన్స్‌కు సన్నిహితులుగా ఉండవలసి వచ్చింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదులే అనుకుంటున్న సమయంలో వరుసగా రోహిత్, రణవీర్‌కు బెదిరింపులు రావడం మరింత భయాన్ని కలిగిస్తోంది. ఇదిలా ఉంటే రణవీర్ సింగ్ బిల్డింగ్ చుట్టూ పోలీసులు పహారా కాస్తూ ఉండడంతో అక్కడ నివాసముంటున్న ఇతరుల పిల్లలు భయాందోళనకు గురవుతున్నారట. ఈ విషయంపై అక్కడివారు పోలీసులకు ఫిర్యాదు చేశారట. పోలీసులకు ఈ బెదిరింపు కాల్స్ తలనొప్పిగా మారాయి. మరోవైపు థ్రెటినింగ్ కాల్స్ ఎదుర్కొంటున్న వారందరూ టాప్ స్టార్స్ కావడంతో వారిని షూటింగ్స్‌లో కూడా కాపాడుకోవలసిన బాధ్యత నిర్మాతలపై పడింది. స్టార్స్‌కు భారీ రెమ్యూనరేషన్స్ ఇస్తూ, మళ్ళీ వారి రక్షణ కోసం అదనంగా ఖర్చు చేయవలసి రావడంపై బాలీవుడ్‌లో చర్చ సాగుతోంది. మరి ఈ భయాందోళనలు ఎప్పుడు సద్దుమణుగుతాయో చూడాలి.

Updated Date - Feb 12 , 2026 | 03:48 PM