AR Rahman: ఆ కష్టాలు రెహమాన్‌ దరి చేరవు.. ఎందుకంటే..

ABN , Publish Date - Jan 19 , 2026 | 06:00 PM

ఆస్కార్‌ విన్నర్‌, పాపులర్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ రెహమాన్‌ బాలీవుడ్‌పై చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అయిన సంగతి తెలిసిందే! దీనిపై రైటర్‌ తస్లీమా నస్రీన్‌ స్పందించారు.


ఆస్కార్‌ విన్నర్‌, పాపులర్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ రెహమాన్‌ (A.R. Rahman) బాలీవుడ్‌పై చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అయిన సంగతి తెలిసిందే! దీనిపై రైటర్‌ తస్లీమా నస్రీన్‌ (Taslima Nasreen )స్పందించారు. సంగీత దర్శకుడు రెహమాన్‌ దేశంలో పేరొందిన వ్యక్తి అని, అలాంటి వారికి ఎక్కడా ఇబ్బందులు ఎదురుకావని ఆమె ట్వీట్‌ చేశారు.  

‘ఏఆర్‌ రెహమాన్‌  మన దేశంలో పేరున్న వ్యక్తి. ఆయనకు రెమ్యూనరేషన్‌ కూడా ఎక్కువే ఉంటుంది. సంపన్న సంగీత దర్శకుడు ఆయనే కావచ్చని నేను అనుకుంటున్నా. ఆయనకు మతపరంగా బాలీవుడ్‌లో అవకాశాలు రావడం లేదని చెప్పారు. కానీ షబాన ఆజ్మీ, జావెద్‌ అక్తర్‌, షారుఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, ఆమిర్‌ఖాన్‌ వీళ్లంతా స్టార్స్‌. సినీరంగంలో పేరొందిన వ్యక్తులు. వారు ఏ మతానికి, ఏ సామాజిక వర్గానికి చెందిన వారైనా సరే వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావు. ఎందుకంటే వారంతా సంపన్నులు. నాలాంటి పేదలకే అనేక రకాల కష్టాలు ఉంటాయి. ఇటువంటివి ఏఆర్‌ రెహమాన్‌ దరికి కూడా రావు. అన్ని మతాల వారు ఆయన్ను గౌరవిస్తారు. ఆయన్ను చూసి జాలిపడటం తగదు’ అని తస్లీమా నస్రీన్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

అసలు ఏం జరిగిందంటే..

సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘బాలీవుడ్‌లో తమిళ లేదా మహరాష్ట్రాకు సంబంధం లేని వ్యక్తులపై పక్షపాతం ఉంటుందా?’ అనే ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన సమాధానమిస్తూ.. వ్యక్తిగతంగా నేనెప్పుడూ ఎలాంటి వివక్ష ఎదుర్కొలేదు’ అని చెప్పారు. ‘అయితే ఎనిమిదేళ్లుగా ఇండస్ర్టీలో ‘పవర్‌ షిఫ్ట్‌’ కనిపిస్తుంది. ప్రతిభ, సృజనాత్మకత లేనివారే కీలకంగా వ్యవహరిస్తున్నారు. మతపరమైన అంశం దీనికి ఓ కారణమై ఉండొచ్చని నా అభిప్రాయం. ఈ సమస్య నాకు నేరుగా ఎదురుకాలేదు. అక్కడక్కడ అంటుంటే విన్నాను. నేను పని కోసం వెతకను. చిత్తశుద్థి ఉంటే పనే మన వద్దకు వస్తుందని బలంగా నమ్ముతా’’ అని రెహమాన్‌ అన్నారు. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశం కావడంతో ఆయన తాజాగా వివరణ కూడా ఇచ్చారు.

Updated Date - Jan 19 , 2026 | 06:14 PM