Tamannaah: సౌత్‌లో అదే నాకు ఆయుధమైంది

ABN , Publish Date - Aug 04 , 2026 | 10:37 AM

ఇండస్ట్రీలో నటన, డ్యాన్స్‌లను వేర్వేరు కోణాల్లో చూడడం సరైన విధానం కాదని తమన్నా అభిప్రాయపడ్డారు.

ఇండస్ట్రీలో నటన, డ్యాన్స్‌లను వేర్వేరు కోణాల్లో చూడడం సరైన విధానం కాదని తమన్నా (Tamannaah Bhatia) అభిప్రాయపడ్డారు. తాను ఎప్పుడూ క్లాసికల్ డ్యాన్స్‌లో శిక్షణ తీసుకోలేదని, కానీ దక్షిణాది చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి డ్యాన్స్‌నే తన బలంగా మార్చుకున్నానని చెప్పారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ జర్నీలోని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు  మిల్కీ బ్యూటీ తమన్నా. 

'నేను క్లాసికల్ డ్యాన్స్ ఎప్పుడూ నేర్చుకోలేదు. ప్రత్యేకంగా ఎలాంటి శిక్షణ కూడా తీసుకోలేదు. టీనేజ్‌లోనే దక్షిణాది సినిమాల్లో నటించడం ప్రారంభించాను. అప్పట్లో పాటల చిత్రీకరణ కోసం రిహార్సల్స్‌కు సమయం ఉండేది కాదు. భారీ సెట్లు సిద్ధంగా ఉండేవి. వందల మంది నా కోసం ఎదురుచూస్తూ ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లో భయపడేందుకు కూడా సమయం ఉండేది కాదు. అప్పటికప్పుడు స్టెప్పులు నేర్చుకుని కెమెరా ముందు డ్యాన్స్ చేసేదాన్ని. అలా డ్యాన్స్ నాకు సహజంగా వచ్చేసింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ కోసం రూపొందుతున్న  సిరీస్‌లో  'గఫూర్' పాటతో పాటు, 'రేంజర్' సినిమాలో చేస్తున్నాను.  ఈ రెండు ప్రాజెక్టులు సవాల్ తో కూడినవే. ఏ రెండు ప్రాజెక్ట్స్ ఒకే సమయంలో చేశా. రోజుకు కేవలం ఆరు గంటల నిద్ర మాత్రమే దొరికేది. 'రేంజర్' పాట షూటింగ్ ముగించుకుని నేరుగా 'గఫూర్' పాట షూటింగ్‌కు వెళ్లేదాన్ని. రిహార్సల్స్ చేయడానికి కూడా సమయం ఉండేది కాదు. అయినప్పటికీ ప్రతి పాటను అత్యుత్తమంగా చేయాలని ప్రయత్నించేదాన్ని" అని చెప్పారు.

"నటన, డాన్స్ ను విడదీసి చూడటం సరికాదు. మాధురి దీక్షిత్, శ్రీదేవి, రేఖ వంటి దిగ్గజ నటీమణులు అద్భుతమైన నటనతో పాటు డ్యాన్స్‌లోనూ తమదైన ముద్ర వేశారు. నటన, డ్యాన్స్ రెండూ ఒకదానికొకటి తోడుగా ఉండాలి. తాత్కాలిక విజయాల కంటే ప్రేక్షకుల మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయే పాత్రలు చేయడమే నా లక్ష్యం. కెరీర్ ప్రారంభంలో నేర్చుకున్న పాఠాలే నేడు నాకు బలంగా నిలిచాయి. వాటి వల్లే భాషతో సంబంధం లేకుండా మంచి అవకాశాలు వస్తున్నాయి. కష్టపడి సాధించిన అనుభవం, నిరంతరం నేర్చుకోవాలనే తపనే నేటికీ  నన్ను కొత్త అవకాశాల వైపు నడిపిస్తుంది' అని  తమన్నా అన్నారు. 'ఓదెల 2' తర్వాత మరో తెలుగు సినిమాకు సైన్ చేయలేదు తమన్నా. కానీ బాలీవుడ్, కోలీవుడ్ లో వరుసగా అరడజను సినిమాలు చేస్తుంది. 

Updated Date - Aug 04 , 2026 | 11:05 AM