'పొన్నియిన్ సెల్వన్' పాటపై రెహమాన్‌కు సుప్రీమ్ సలహా!
ABN , Publish Date - Feb 13 , 2026 | 06:28 PM
'పొన్నియిన్ సెల్వన్ 2' లో రెహమాన్ ఉపయోగించిన 'వీరా రాజ వీర' పాటపై సుప్రీమ్ కోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. పాటను తొలిసారి స్వరపర్చిన వారి పేరును ఉదహరించమని రెహమాన్‌కు సూచన చేసింది.
ప్రముఖ దర్శకుడు మణిరత్నం (Manirathnam) రూపొందించిన ప్రతిష్ఠాత్మక చిత్రం 'పొన్నియిన్ సెల్వన్' (Ponniyin Selvan). ఈ సినిమా రెండో భాగంలో దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ (A.R. Rahman) 'వీరా రాజా వీర' అనే పాటను స్వరపరిచారు. అయితే ఈ పాట బాణీని తమ పూర్వీకులు సంగీతం సమకూర్చిన శివస్తుతి నుండి ఎ.ఆర్. రెహమాన్ తీసుకున్నారంటూ ఉస్తాద్ ఫయాజ్ వసిఫుద్దీన్ కోర్టు కెక్కారు. కాపీరైట్ యాక్ట్ కింద కేసు నమోదైంది. పలు మార్లు విచారణ జరిగిన అనంతరం ఢిల్లీ హైకోర్టు గత యేడాది ఏప్రిల్‌లో ఈ పాటను వాడుకున్నందుకు రెండు కోట్ల రూపాయలను జమ చేయాలంటూ రెహమాన్‌ను, చిత్ర నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్‌ను ఆదేశించింది. దీనిపై అదే యేడాది సెప్టెంబర్‌లో డివిజన్ బెంచ్ ఆ మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసింది. దాంతో ఫయాజ్ ఈసారి సుప్రీమ్ కోర్టును ఆశ్రయించారు.
శుక్రవారం చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చి ఉన్న ధర్మాసనం ఈ కేసును విచారించింది. రెహమాన్ ఆ పాట డాగర్వాణి సంప్రదాయం నుండి వచ్చిందని ఇప్పటికే అంగీకరించారని, అలాంటప్పుడు ఆ విషయాన్ని తెలియచేస్తూ వారి పేరును ప్రస్తావించడంలో తప్పేముందని ధర్మాసనం ప్రశ్నించింది. డాగర్ కుటుంబ సభ్యులు తొలుత దీన్ని ప్రదర్శించారని చెప్పడం సమంజసమని, ఈ విషయాన్ని రెహమాన్ ఆలోచించాలని సలహా ఇచ్చింది. ఇప్పుడు ఆయన తీసుకునే నిర్ణయం రాబోయే తీర్పుపై ఎలాంటి ప్రభావం చూపించదని న్యాయమూర్తులు తెలియచేశారు. ఘరానాలకు చెందిన వారు శాస్త్రీయ సంగీతాన్ని ఆరాధించే కళాకారులని, వారికి తగిన గౌరవం, గుర్తింపు ఇవ్వాలని ఈ సందర్భంగా జస్టిస్ బాగ్చి అన్నారు. అనంతరం ఈ కేసును న్యాయమూర్తులు ఈ నెల 20కు వాయిదా వేశారు.