రాజమౌళి: ఏ అంశంలోనూ లోపాలు కనిపించలేదు.. గట్స్‌కి మెచ్చుకోవాలి..
ABN , Publish Date - Mar 21 , 2026 | 03:45 PM
‘ధురంధర్-2’ చిత్రాన్ని ప్రశంసిస్తూ దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి (SS Rajamouli) సోషల్ మీడియా వేదికగా సుధీర్ఘ పోస్ట్ పెట్టారు.
రణ్‌వీర్ సింగ్ (Ranveer singh) హీరోగా ఆదిత్యాధర్ దర్శకత్వం వహించిన ‘ధురంధర్-2’ (Dhurandhar The Revenge) చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాను సినీ ప్రముఖులు. ఇప్పటికే తారక్, మహేశ్‌బాబు, రామ్‌చరణ్, విజయ్ దేవరకొండ వంటి స్టార్లు చిత్ర బృందాన్ని ప్రశంసించారు. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి (SS Rajamouli) సోషల్ మీడియా వేదికగా సుధీర్ఘ పోస్ట్ పెట్టారు. ఈ చిత్రం తనకెంతో నచ్చిందని పేర్కొన్నారు.
‘‘ధురంధర్’ నాకు ఎంతో నచ్చింది. రెండో పార్టుగా వచ్చిన ది రివెంజ్ మాత్రం కథ ఆత్మలోనూ, భావోద్వేగాలతోనూ ఒరిజినల్‌ను మించి ఉంది. రచన, నటీనటుల ఎంపిక, టెక్నికల్ వర్క్, మ్యూజిక్, వరల్డ్ డిజైన్, డైరెక్షన్ ఇలా ఏ అంశంలోనూ పొరపాట్లు కనిపించలేదు. ఎమోషనల్ స్టేక్స్ సినిమాను మరింతగా నిలబెట్టాయి. ఈ చిత్రంలో రచన, కథలో మలుపులు, ఉత్కంఠ, భావోద్వేగాలు అత్యద్భుతంగా చూపించడంతో దర్శకుడు ఆదిత్యధర్ సఫలమయ్యారు. ఇలాంటి కథతో నాలుగు గంటల సినిమా తీయాలంటే గట్స్ ఉండాలి. భారీ స్పాన్ ఉన్న సినిమా తీయడమే కాకుండా దర్శకుడు ప్రేక్షకుల్ని మెప్పించారు. నాలుగు గంటలపాటు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చారు. రణ్‌వీర్ సింగ్ నటనతో మెస్మరైజ్ చేశారు. జస్కిరాత్‌సింగ్, హమ్జా అలీ మజారీగా రెండు పాత్రల్లోనూ వేరియేషన్ చూపిస్తూ ఆయా పాత్రలకు న్యాయం. షెడ్డులో సోదరికి సంబంధించిన సన్నివేశంలో ఆయన నటన మాస్టర్ క్లాస్ అనే చెప్పాలి. సినిమా ప్రారంభం నుంచి పతాక సన్నివేశాల వరకూ రణ్‌వీర్ నటన హృదయాన్ని మెలిపెట్టేసింది. దేశ నిస్సహాయతను, అసహనాన్ని మాధవన్ చక్కగా ప్రదర్శించారు. ఈ సక్సెస్ మనందరిదీ. ధురంధర్-2 టీమ్ అందరికీ ప్రత్యేక అభినందనలు’ అని రాజమౌళి ట్వీట్‌లో పేర్కొన్నారు.