సోనల్ ఛౌహన్: దుబాయిలో చిక్కుకున్నా.. మోదీజీ రక్షించండి..
ABN , Publish Date - Mar 01 , 2026 | 11:53 AM
దుబాయ్‌లో ఎయిర్‌ఫోర్ట్‌లో చిక్కుకున్న తనను సురక్షితంగా ఇండియాకు చేరుకునేలా సాయం అందించాలని హీరోయిన్ సోనల్ ఛౌహన్ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు.
దుబాయ్‌లో ఎయిర్పోర్ట్లో చిక్కుకున్న తనను సురక్షితంగా ఇండియాకు చేరుకునేలా సాయం అందించాలని హీరోయిన్ సోనల్ ఛౌహన్ (Sonal Chauhan) ప్రధాని నరేంద్ర మోదీని (Narendra Modi) కోరారు. ఇరాన్‌పై యుద్థం నేపథ్యంలో ఇజ్రాయెల్, బహ్రెయిన్, ఖతర్, యూఏఈలో ఉన్న భారత ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయపడుతున్నారు. ఇండియాకు తిరిగెళ్లే మార్గం కోసం ఎదురుచూస్తున్నారు. హీరోయిన్ సోనల్ చౌహన్ ప్రస్తుతం దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె సోషల్ మీడియా వేదికగా తనను ఇండియాకు తీసుకెళ్లాలని దేశ ప్రధాని మోదీని కోరారు. ఈ మేరకు పోస్ట్ చేశారు.

‘గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీగారు.. ప్రస్తుత నెలకొన్న సంక్షోభం వల్ల నేను దుబాయ్‌లో చిక్కుకున్నాను. విమానాల రాకపోకలు ఆగిపోయాయి. ఇండియాకు ఎలా చేరుకోవాలో తెలియడం లేదు. నేను సురక్షితంగా ఇంటికి చేరేందుకు ప్రభుత్వం సహాయం చేయాలని కోరుతున్నాను’ అంటూ చేతులు జోడించి నమస్కరిస్తున్న ఎమోజీని జత చేసింది. మంచు విష్ణు, క్రీడాకారిణి పీవీ సింధు కూడా అక్కడే ఉన్నట్లు సమాచారం. ‘రెయిన్’ చిత్రంతో తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టారు సోనల్. తదుపరి ‘లెజెండ్’, ‘పండగ చేస్కో’, ‘షేర్’ ‘సైజ్ జీరో’, ‘డిక్టేటర్’, ‘ఎఫ్3’, ‘ద ఘోస్ట్’ చిత్రాల్లో నటించారు. ‘ఆదిపురుష్’ చిత్రంతో మండోదరిగా చేసింది.
భారీ శబ్దాలు భయాందోళనకు గురి చేశాయి: మంచు విష్ణుమంచు విష్ణు తన కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్‌లో ఉన్న సమయంలో ఆకాశంలో క్షిపణులు దూసుకెళ్లడం, వాటిని గాలిలోనే అడ్డుకుంటున్న భారీ శబ్దాలు వారిని భయాందోళనకు గురిచేశాయి. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్(ఎక్స్) వేదికగా ఆయన ట్వీట్ పెట్టారు. దుబాయ్ గగనతలంలో క్షిపణులు కనిపిస్తున్న వీడియోను షేర్ చేస్తూ విష్ణు తన అనుభవాలను గురించి తెలిపారు.