Eetha Trailer: ఈత ట్రైలర్.. సాహో బ్యూటీ నట విశ్వరూపం
ABN , Publish Date - Oct 30 , 2026 | 04:24 PM
బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor), వర్సటైల్ యాక్టర్ రణ్‌దీప్ హుడా (Randeep Hooda) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం 'ఈతా' (Eetha). దినేష్ విజన్ నిర్మాణంలో, లక్ష్మణ్ ఉటెకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మహారాష్ట్రకు చెందిన పురాణ జానపద కళాకారిణి విఠాబాయి నారాయణంగావ్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది.
బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor), వర్సటైల్ యాక్టర్ రణ్‌దీప్ హుడా (Randeep Hooda) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం 'ఈతా' (Eetha). దినేష్ విజన్ నిర్మాణంలో, లక్ష్మణ్ ఉటెకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మహారాష్ట్రకు చెందిన పురాణ జానపద కళాకారిణి విఠాబాయి నారాయణంగావ్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. స్త్రీ 2 వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కావడంతో మొదటి నుంచి ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తాజాగా ఈత ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం సంస్కృతి, నృత్యం, వితాబాయి ఆత్మగౌరవం, పట్టుదల అనే అంశాల చుట్టూ తిరుగుతుందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా మరాఠీ సాంప్రదాయ నృత్య రూపం లావణి, మరాఠీ కల్చర్ నేపథ్యాన్ని ట్రైలర్లో ఎంతో పవర్‌ఫుల్‌గా చూపించారు. ఈ ట్రైలర్లో శ్రద్ధా కపూర్ అద్భుతమైన నటన, లుక్ ప్రేక్షకులను కట్టిపడేస్తోందని చెప్పవచ్చు.ఇప్పటివరకు గ్లామరస్ పాత్రల్లో కనిపించిన ఆమె, ఇందులో సాంప్రదాయ తొమ్మిది గజాల నౌవారి చీర కట్టి, ముక్కుపుడక, కాళ్లకు గజ్జెలతో అచ్చమైన లావణి,తమాషా సామ్రాజ్ఞిలా మారిపోయింది. కేవలం నృత్యంలోనే కాకుండా, విఠాబాయి పాత్రలోని పౌరుషాన్ని, ఒక కళాకారిణిగా ఆమె పడే ఆవేదనను శ్రద్ధా కపూర్ తన కళ్లలోనే పలికించి నటన పరంగా తన కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వబోతున్నట్లు ట్రైలర్ ద్వారా చూపించారు.
ఇక ట్రైలర్ లో ఒళ్లు గగుర్పొడిచే విధంగా చూపించిన వితాబాయి జీవితంలోని ఒక సంఘటన ప్రేక్షకులను ఎంతగానో కదిలిస్తోంది. ఆమె తొమ్మిది నెలల గర్భవతిగా ఉన్నప్పుడు వేదికపై లైవ్ ప్రదర్శన ఇస్తూనే ప్రసవ వేదనను భరిస్తుంది. ఆపై వెనువెంటనే బ్యాక్స్టేజ్కి వెళ్లి స్వయంగా బిడ్డను ప్రసవించి, ఒక పదునైన రాయితో బొడ్డు తాడును కోసి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా మళ్లీ స్టేజీపైకి వచ్చి తన నృత్యాన్ని పూర్తి చేయడం లాంటి సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ముఖ్యంగా నేను పడుకుని చనిపోతే నిస్సహాయురాలంటారు, అదే నృత్యం చేస్తూ చనిపోతే ఒక ఆదర్శంగా మిగిలిపోతాను, నా నమ్మకమే నా అహం అనే డైలాగ్స్, చివర్లో నౌవారి చీర గురించి, దాని ధరించే స్త్రీల గురించి వచ్చే డైలాగ్స్ ట్రైలర్ కే హైలైట్ గా నిలిచాయి. ఇకపోతే ఈత డిసెంబర్ 4 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా శ్రద్ధా కపూర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.