Sholay: 'షోలే' ఓ మధుర జ్ఞాపకం: నందమూరి మోహనకృష్ణ
ABN , Publish Date - Jan 26 , 2026 | 04:13 PM
సినిమా పారడిసో, సిండీరీల్ సంస్థలు ఆదివారం ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 'షోలే' సినిమా స్పెషల్ షో ను ఏర్పాటు చేశారు. పలువురు సినీ ప్రముఖులు, పాత్రికేయులు దీనికి హాజరయ్యారు.
భారతీయ సినిమా రంగాన్ని 'షోలే' ముందు, తర్వాత అని పోల్చడం సర్వసాధారణమైపోయింది. 1975 ఆగస్ట్ 15న విడుదలైన 'షోలే' ఓ గొప్ప చరిత్రను సృష్టించింది. 'షోలే' స్ఫూర్తితో ఆ తర్వాత వివిధ భాషల్లో అనేక చిత్రాలు రూపుకున్నాయి. అయినా అందరూ చెప్పే మాట ఒక్కటే 'ఒన్ అండ్ ఓన్లీ షోలే' అని! ఆ సినిమా విడుదలై యాభై సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో తాజాగా 4కె వర్షన్ తో ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో సినిమా పారడిసో, సిండీరీల్ సంస్థల ఆధ్వర్యంలో రవి పాడి (రైల్వే చీఫ్ కమర్షియల్ మేనేజర్, క్లయిమ్స్, దక్షిణ మధ్య రైల్వే) ఈ సినిమా స్పెషల్ షో ను ఏర్పాటు చేశారు.
సినిమా రంగానికి చెందిన పలువురు దర్శకులు, రచయితలు, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కేక్ కటింగ్ కార్యక్రమంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు తనయుడు, మోహన కృష్ణ మాట్లాడుతూ, 'యాభై యేళ్ళ క్రితం మా రామకృష్ణ 70 ఎం.ఎం. థియేటర్ లో 'షోలే' సినిమాను చూశాను. మళ్ళీ ఇప్పుడు ఇలా థియేటర్ లో స్పెషల్ స్క్రీనింగ్ కు హాజరు కావడం ఆనందంగా ఉంది. ఈ గొప్ప అనుభూతిని కలిగించిన రవి పాడికి ధన్యవాదాలు' అని అన్నారు.
'షోలే' సినిమాను తాను యుక్తవయసులో దాదాపు పాతిక సార్లు చూశానని, ఇటీవల రీ-రిలీజ్ అయినప్పుడు కూడా కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్లో చూశానని, ఎప్పుడు ఈ సినిమా చూసి కొత్తగా చూస్తున్న అనుభూతికే కలిగిస్తూ వచ్చిందని, అందుకే సినిమా రంగానికి చెందిన పెద్దల కోసం ఈ స్పెషల్ షో ఏర్పాటు చేశానని రవి పాడి చెప్పారు. రాబోయే రోజుల్లో వరల్డ్ అండ్ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో మైల్ స్టోన్ మూవీస్ ను ప్రదర్శించాలనే ఆలోచన ఉందని చెప్పారు. 'షోలే' స్పెషల్ షోకు సహకారం అందించిన యశ్ రాజ్ ఫిలిమ్స్ తెలుగు స్టేట్స్ హెడ్ హరి అనంత్ కు రవి పాడి ధన్యవాదాలు తెలిపారు. మిత్రుడు పులగం చిన్నారాయణతో కలిసి తాను రాసిన 'మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్ కాక్' పుస్తకానికి చక్కని ఆదరణ లభించిందని, అదే స్ఫూర్తితో అతి త్వరలో ప్రపంచం మెచ్చిన దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ మీద కూడా పుస్తకాన్ని రాస్తున్నామని, స్పీల్ బర్గ్ 40వ సినిమా జూన్ 12న విడుదల కాబోతున్న సందర్భంగా పుస్తకావిష్కరణ ఉంటుందని రవి పాడి చెప్పారు.

ఈ స్పెషల్ షోకు దర్శకులు శివ నాగేశ్వరరావు, వైవియస్ చౌదరి, రాజా వన్నెంరెడ్డి, దేవిప్రసాద్, రాజ్ మాదిరాజు, కరుణ కుమార్; నిర్మాతలు దామోదరప్రసాద్, తుమ్మల ప్రసన్న కుమార్, రాజ్ కందుకూరి, కొమ్మినేని వెంకటేశ్వరరావు; రచయితలు మల్లాది వెంకటకృష్ణమూర్తి, బుర్రా సాయిమాధవ్, గోపీ మోహన్, ఆకెళ్ళ శివప్రసాద్, ఖదీర్ బాబు, పురాణం విజయదుర్గ, పద్మజ తదితరులు హాజరయ్యారు. ఈ సినిమా స్క్రీనింగ్ జరుగుతున్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వం నుండి ధర్మేంద్రకు పద్మవిభూషణ్ పురస్కార ప్రకటన వెలువడటం యాదృచ్ఛికం!