Shalini Pandey: షాలిని పాండే డీప్ ఫేక్ వీడియో.. తీవ్ర ఆగ్రహం
ABN , Publish Date - Aug 31 , 2026 | 05:37 PM
ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ఎన్నో వింతలు జరుగుతున్నాయి. పెరిగిన టెక్నాలజీని కొందరు ఎదుగుదలకు ఉపయోగిస్తే మరి కొందరు దుర్వినియోగం చేస్తున్నారు.
ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ఎన్నో వింతలు జరుగుతున్నాయి. పెరిగిన టెక్నాలజీని కొందరు ఎదుగుదలకు ఉపయోగిస్తే మరి కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. ముఖ్యంగా సినీ తారలను లక్ష్యంగా చేసుకుని మార్ఫింగ్, డీప్‌ఫేక్ (Shalini pandey Fake video), ఏఐ జనరేటెడ్ వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. తాజాగా ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి షాలిని పాండే కూడా ఇలాంటి వేధింపులకు గురయ్యారు.షాలిని పాండేకు సంబంధించిన ఫేక్ ఏఐ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన న్యూడ్ వీడియోను కొందరు నిజమైనదేనంటూ ప్రచారం చేయడంతో విషయం షాలిని దృష్టికి వెళ్లింది. దీంతో షాలిని పాండే సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో పూర్తిగా కల్పితమైనది. ఆ వీడియో కనిపిస్తున్నది నేను కాదు. నన్ను లక్ష్యంగా చేసుకుని టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేయడం ఎంతో బాధాకరంగా ఉంది. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. టెక్నాలజీని ఈ విధంగా దుర్వినియోగం చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాధారణ విషయంగా పరిగణించకూడదు. ఈ వీడియో మీకు కనిపిస్తే దయచేసి షేర్ చేయవద్దు, ఫార్వర్డ్ చేయవద్దు, డౌన్‌లోడ్ చేయవద్దు లేదా దానితో ఎలాంటి విధంగానూ ఎంగేజ్ కావద్దు. బదులుగా వెంటనే ఆ వీడియోను రిపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా, అప్రమత్తంగా వ్యవహరించాలని కోరుతున్నాను. ఈ ఫేక్ వీడియోకు మరింత ప్రచారం కల్పించకుండా, దాని వ్యాప్తిని అడ్డుకోవడంలో సహకరించండి. ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని ఏఐ టెక్నాలజీని ఉపయోగించి అభ్యంతరకరమైన కంటెంట్‌ను రూపొందించడం తీవ్రంగా ఖండించాల్సిన విషయం" అని షాలిని అన్నారు.
ఇటీవల కాలంలో సెలబ్రిటీలకు సంబంధించిన డీప్‌ఫేక్, ఏఐ జనరేటెడ్ వీడియోలు పెరుగుతున్నాయి. గతంలో రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, శృతిహాసన్, టబు, ఐశ్వర్య రాయ్ బచ్చన్ తదితర నటీమణులు కూడా ఇలాంటి ఫేక్ కంటెంట్‌పై స్పందించారు.