కల్కి దెబ్బ.. షాహిద్ సినిమా క్యాన్సిల్

ABN , Publish Date - Aug 17 , 2026 | 05:15 PM

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కథానాయకుడిగా ప్రకటించిన అత్యంత ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రం అశ్వత్థామ (Ashwatthama) ఆగిపోవడం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్రంగా చర్చనీయాంశమైంది.

Shahid Kapoor

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ (Shahid Kapoor) కథానాయకుడిగా ప్రకటించిన అత్యంత ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రం అశ్వత్థామ (Ashwatthama) ఆగిపోవడం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్రంగా చర్చనీయాంశమైంది. ఎంతో గ్రాండ్‌గా ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ షూటింగ్ దశకు కూడా చేరుకోకుండానే రద్దవ్వడం షాహిద్ కపూర్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌ను రద్దు చేయడానికి గల అసలు కారణాలను ప్రముఖ నిర్మాత జాకీ భగ్నానీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ సినిమాను పక్కన పెట్టడానికి పలు కారణాలు ఉన్నప్పటికీ, అందులో ముఖ్యమైనది రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD చిత్ర ప్రభావమేనని ఆయన బహిరంగంగా అంగీకరించడం సంచలనంగా మారింది.


నిర్మాత జాకీ భగ్నానీ మాట్లాడుతూ..' ప్రేక్షకులు ఒక సినిమాపై ఎంత డబ్బు ఖర్చు చేశారనే దాని ఆధారంగా విజయాన్ని నిర్ణయించరు. వారు ఎప్పుడూ కొత్తదనం, వినూత్నమైన కంటెంట్‌ను మాత్రమే కోరుకుంటారు. కల్కి 2898 AD చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ పోషించిన అశ్వత్థామ పాత్ర ప్రేక్షకుల్లో అత్యంత తీవ్రమైన ముద్ర వేసింది. అటువంటి పాపులర్ రోల్‌ను మళ్లీ షాహిద్ కపూర్‌తో చూపించడం ద్వారా ప్రేక్షకులకు ఎలాంటి కొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వగలమనే సందేహం కలిగింది. తొందరపడి సెట్స్ పైకి వెళ్లడం కంటే ప్రాజెక్ట్‌ను నిలిపివేయడమే శ్రేయస్కరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు' ఆయన తెలిపాడు.


ఒకవైపు షాహిద్ కపూర్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఆగిపోవడం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారగా, మరోవైపు ప్రభాస్ అభిమానులకు మాత్రం పండగ వాతావరణం నెలకొంది. వైజయంతీ మూవీస్ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న కల్కి 2 చిత్రీకరణ ఇప్పటికే వేగంగా సాగుతోంది. త్వరలోనే ప్రభాస్ కూడా ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్‌లో పాల్గొననున్నాడు. కల్కి సృష్టించిన ఇంపాక్ట్ వల్లనే బాలీవుడ్ మేకర్స్ తమ నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి కల్కి 2 ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Updated Date - Aug 17 , 2026 | 05:15 PM