'కింగ్‌' మ్యూజిక్‌ రైట్స్... భారీ డీల్‌!

ABN , Publish Date - Aug 01 , 2026 | 03:50 PM

షారుఖ్‌ ఖాన్ 'కింగ్‌' సినిమా ఆడియో హక్కులకై భారీ పోటీ నెలకొంది. మ్యూజిక్‌ రైట్స్ కోసం ఓ ప్రముఖ సంస్థ ఏకంగా రూ. 50 కోట్ల మొత్తాన్ని ఆఫర్ చేసినట్టు సమాచారం.

King movie

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ ఖాన్ 2023లో 'పఠాన్, జవాన్' వంటి రెండు బ్లాక్ బస్టర్స్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. అదే యేడాది వచ్చిన 'డంకీ' సినిమా సైతం గౌరవ ప్రదమైన విజయాన్నే అందుకుంది. ఇక ఈ యేడాది క్రిస్మస్ కానుకగా షారూఖ్‌ ఖాన్ 'కింగ్‌' సినిమా విడుదల కానుంది. దీన్ని సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్నారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ ఇవాళ బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ మూవీ మ్యూజిక్ రైట్స్ కోసం పలు సంస్థలు పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ సంగీత ప్రపంచంలో అగ్ర సంస్థలైన సోనీ మ్యూజిక్‌, టీ-సీరిస్, సారేగామా... 'కింగ్‌' మ్యూజిక్ రైట్స్ కోసం పోటీ పడుతున్నాయి. ఇందులో ఓ సంస్థ ఏకంగా రూ. 50 కోట్లను ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.


'కింగ్‌' సినిమాకు సచిన్ - జిగర్ సంగీతం అందిస్తున్నారు. ఒక వేళ బయట ప్రచారం జరుగుతున్నట్టుగా 'కింగ్‌' సినిమా మ్యూజిక్‌ రైట్స్ ను 50 కోట్ల రూపాయలకు తీసుకుంటే మాత్రం అది ఓ కొత్త రికార్డ్ అవుతుంది. రెండు భాగాలుగా వస్తున్న 'రామాయణ' సినిమా మ్యూజిక్ రైట్స్ ను రూ. 75 కోట్లకు కొనుగోలు చేశారు. అలానే 'ధురంధర్‌-2'కీ భారీ మొత్తాన్నే ఇచ్చారు. ఇప్పుడు ఈ రెండు ప్రాజెక్ట్స్ సరసన షారూఖ్‌ 'కింగ్‌' కూడా నిలిచినట్టు అవుతుంది.

కీలక పాత్రలో 'కిల్' విలన్!

'కిల్‌' సినిమాలో విలన్ గా నటించిన అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్నాడు రాఘవ్ జుయల్. ప్రస్తుతం ఈ యువ నటుడు, నేచురల్ స్టార్ నాని 'ప్యారడైజ్' మూవీలో మోహన్ బాబు కొడుకుగా విక్రమ్ మాలిక్‌ పాత్రను పోషిస్తున్నాడు. అంతే కాదు... షారూఖ్‌ ఖాన్ 'కింగ్‌'లోనూ రాఘవ్ జుయల్ యాక్ట్ చేస్తున్నాడు. ఇందులో అతనిది విలన్ పాత్ర అనే ప్రచారం జరుగుతోంది. అయితే దీన్ని రాఘవ్ జుయల్ ఖండించాడు. 'కింగ్‌'లో తాను విలన్ గా నటించడం లేదని, తనదీ చిత్రంలో ఓ కీలక పాత్ర అని స్పష్టం చేశాడు. ఇదిలా ఉంటే 'కింగ్‌' సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తయ్యింది. కేవలం పదిహేను రోజుల చిత్రీకరణ మాత్రం బాలెన్స్ ఉందని, మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సైతం శరవేగంగా సాగుతోందని చిత్రం బృందం తెలిపింది. షారూఖ్‌ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ ప్రధాన పాత్రను పోషిస్తున్న 'కింగ్‌' మూవీ డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి:

అంజలీదేవి నుంచి సాయి పల్లవి వరకు.. వెండితెర సీతమ్మల జర్నీ!

బర్త్‌డే స్పెషల్.. ‘టాక్సిక్’ రాయల్ లుక్‌లో కియారా!

సీనియర్ నటి మంజు భార్గవితో NSR స్పెషల్ ఇంటర్వ్యూ

Updated Date - Aug 01 , 2026 | 03:53 PM