Sayaji shinde: 6.5 లక్షల మొక్కలు నాటారు.. ఆ రూపంలో తల్లి బతికే ఉందని నమ్ముతూ..

ABN , Publish Date - May 30 , 2026 | 03:36 PM

వెండితెరపై పవర్‌ఫుల్‌ విలన్‌గానే కాకుండా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన నటుడు సాయాజి షిండే (Sayaji Shinde) వాచ్‌మెన్‌ నుంచి స్టార్‌గా ఎదిగారు.

వెండితెరపై పవర్‌ఫుల్‌ విలన్‌గానే కాకుండా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన నటుడు సాయాజి షిండే (Sayaji Shinde) వాచ్‌మెన్‌ నుంచి స్టార్‌గా ఎదిగారు. ఆయన ప్రకృతి ప్రేమికుడు. ఇప్పటికే లక్షల మొక్కలను నాటారు. ఆయన చేస్తున్న ఈ పర్యావరణ పోరాటం, దాని వెనుక ఉన్న బలమైన కారణం ఏంటనేది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.  

తల్లి అంటే సాయాజీ షిండేకు అమితమైన ప్రేమ. 2016లో జరిగిన కొన్ని సంఘటనలు ఆయన జీవితాన్ని, ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేశాయి. వందల కోట్ల ఆస్తి ఉండి కూడా సమాజానికి ఏమాత్రం ఉపయోగపడని వ్యక్తులను చూసినప్పుడు.. మరోవైపు తీవ్రమైన కరవుతో నీడ దొరకక అల్లాడుతున్న పల్లెలను గమనించినప్పుడు ఆయన మనసు తీవ్రంగా గాయపడింది. ఆ సమయంలో 92 ఏళ్ల వయసున్న తల్లిని కోల్పోయారు. మరణాన్ని ఆపలేకపోయినా తన తల్లి జ్ఞాపకాలను ఈ భూమిపై శాశ్వతంగా ఉంచాలని ఓ నిర్ణయం తీసుకున్నారు. తన తల్లి బరువుకు సమానంగా విత్తనాలు తూకం వేసి, వాటిని మహారాష్ట్ర అంతటా నాటాలని సంకల్పించారు. ఈ ఆలోచన నుంచి పుట్టిందే ‘సహ్యాద్రి దేవరాయ్‌’ పర్యావరణ ఉద్యమం. అప్పట్లో హైదరాబాద్‌ నుంచి దాదాపు రెండు లక్షల రూపాయల ఖర్చుతో రెండు ట్రక్కుల నిండా మొక్కలను తెప్పించి ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. పురాతన పవిత్ర అడవుల కాన్సెప్ట్‌ ఆధారంగా    మొదలైన ఈ మిషన్‌ ద్వారా ఇప్పటి వరకు ఏకంగా 6.5 లక్షలకు పైగా మొక్కలను నాటడం విశేషం. ఇది ప్రభుత్వ యంత్రాంగానికే ఓ సవాల్‌గా నిలిచింది. మొక్కలు నాటడమే కాదు, రోడ్ల విస్తరణలో భాగంగా నరికి వేయడానికి సిద్ధంగా ఉన్న 200కు పైగా పెద్ద మర్రిచెట్లను ఆధునికి సాంకేతికతో వేరే చోటుకు విజయవంతంగా తీసుకెళ్లి రీ ప్లాంటేషన్‌ చేఽశారు. ఈ చెట్టు ఇప్పుడు దాదాపు 200 జాతుల పక్షులు, కీటకాలకు నివాసాన్ని ఇస్తున్నాయి. గుడుల్లో ప్రసాదానికి బదులుగా ప్రతి ఒక్కరికీ ఒక మొక్కను ఇవ్వాలనే సరికొత్త ప్రతిపాదనను కూడా షిండే తెరపైకి తెచ్చారు. ఒకప్పుడు కనీసం ఒక్క చెట్టు లేక 60 ఏళ్లుగా ఎడారిలా ఉన్న ఓ గ్రామంలో ఊరి జనమంతా కలిసి 17 లక్షల రూపాయలు పోగుచేసేలా స్ఫూర్తిని నింపి అక్కడ 16,000 చెట్లతో పచ్చని అడవిని సృష్టించిన ఘనత సాయాజీ షిండేకే దక్కింది.




 



సాయాజీ షిండే జీవితం అష్టకష్టాల నడుమ సాగింది. సతారా జిల్లాలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించారాయన. ఆయన కుటుంబానికి చెందిన భూములను 1978లో ఒక డ్యామ్‌ నిర్మాణం కోసం ప్రభుత్వం తీసుకుంది. దానికి బదులుగా ఇరిగేషన్‌ శాఖలో వాచ్‌మెన్‌ ఉద్యోగం ఇచ్చారు. కానీ కోల్పోయిన భూమికి బదులుగా రావాల్సిన ప్రత్యామ్నాయ భూమి మాత్రం 35 ఏళ్ల తర్వాత 2022లో చేతికి వచ్చింది. ఇప్పుడు ఆ భూమిని పెద్ద నర్సరీగా మార్చి, వేల సంఖ్యలో గ్రామాలకు పచ్చదనాన్ని పంచేందుకు ఆయన సిద్థమవుతున్నారు. ప్రస్తుతం 48 ప్రాంతాల్లో విస్తరించి ఉన్న లక్షలాది చెట్లలోనే తన తల్లి బతికి ఉందని నమ్ముతూ ఆయన చేస్తున్న ఈ పోరాటం ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.

Updated Date - May 30 , 2026 | 03:54 PM