సెలబ్రేట్ చేసుకునే సినిమా 'ఓ మై డాగ్'
ABN , Publish Date - Aug 12 , 2026 | 01:26 PM
అమిత్ రాయ్ తెరకెక్కించిన హిందీ సినిమా 'ఓ మై డాగ్' ఆగస్ట్ 7న విడుదలైంది. ఇది అందరూ తప్పక చూడాల్సిన సినిమా అని తెలుగు దర్శకుడు శశికిరణ్ తిక్క అంటున్నారు.
అమిత్ రాయ్ దర్శకత్వంలో పంకజ్ త్రిపాఠి, రాజేష్ కుమార్, గీతా అగర్వాల్ శర్మ, పవన్ మల్హోత్రా, శ్రీధర్ దూబే ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ మై డాగ్’. రాజేష్ భరద్వాజ్, అమిత్ రాయ్, సనా వార్సీ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 7న విడుదలైంది. ఈ సినిమా విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి దర్శకుడు శశికిరణ్ తిక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా దర్శకుడు అమిత్ రాయ్ మాట్లాడుతూ, 'నేను హైదరాబాద్‌కు ఎన్నోసార్లు వచ్చాను. పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, దిల్ రాజు గారితో పాటు ఎంతోమందిని కలిశాను. కొన్ని ప్రాజెక్టులు కూడా అనుకున్నాం. కానీ అవి కుదరలేదు. అయితే 'ఓ మై డాగ్' మూవీకి కథ నేను రాయలేదు. నిజానికి ఈ కథను నాతో డాగ్సే రాయించాయి. నాలుగేళ్ల క్రితం ఆస్కార్ నా జీవితంలోకి వచ్చాడు. అప్పటి నుంచి నేను తనను దగ్గరుండి చూసుకునే వాడిని. కానీ ఒక నెల తర్వాత ఒక విషయం నాకు అర్థమైంది. నేను ఆస్కార్ ను చూసుకుంటున్నానని అనుకున్నాను. కానీ నిజానికి ఆస్కార్ నన్ను చూసుకుంటున్నాడు. అక్కడి నుంచే ఈ కథకు స్ఫూర్తి వచ్చింది. మన నిజాయితీని నిరూపించుకోవడానికి మనం ఎంత దూరమైనా వెళ్తాం. అదే విధంగా డాగ్స్ తమ ప్రేమను, నిజాయితీని నిరూపించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాయి. అదే ఈ కథకు మూలం. డాగ్స్ మనకు సహానుభూతిని, ప్రేమను, కరుణను ఎలా నేర్పిస్తాయనేది ఈ సినిమా ద్వారా చూపించాం. ఈ మూవీ మీరు తప్పకుండా చూడండి. మీ పిల్లలకు కూడా చూపించండి. ఈ కథ మిమ్మల్ని కదిలిస్తుంది. మీలో ప్రేమను నింపుతుంది' అని అన్నారు.
దర్శకుడు శశికిరణ్ తిక్క మాట్లాడుతూ, 'ఇది ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన సినిమా. అమిత్ రాయ్ గతంలో తీసిన ‘ఓ మై గాడ్ 2’ ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు ‘ఓ మై డాగ్’ కూడా అందరూ తప్పకుండా చూసి ఆనందించాల్సిన సినిమా. దేశం మొత్తం గర్వించాల్సిన సినిమా ఇది. డాగ్స్ నేపథ్యంలో చాలా సినిమాలు వస్తుంటాయి. ఇప్పుడిప్పుడే ఇండియాలో కూడా ఇలాంటి కథలు ఎక్కువగా వస్తున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం ‘చార్లీ’ సినిమా వచ్చింది. అది చాలా బాగా ఆడింది. ఇప్పుడు ‘ఓ మై డాగ్’ కూడా మంచి విజయం సాధిస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి కథలు మరెన్నో రావాలని కోరుకుంటున్నాను. కుటుంబం మొత్తం కలిసి చూడదగ్గ సినిమా ఇది' అని అన్నారు. రాజేష్ కుమార్ మాట్లాడుతూ, 'అమిత్ రాయ్ ఈ సినిమాను మనసుకు హత్తుకునేలా తెరకెక్కించారు. ఇది ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది' అని చెప్పారు. డాలీషా చౌరాసియా మాట్లాడుతూ, 'ఇంత మంచి సినిమాను అందించిన దర్శకుడు అమిత్ రాయ్ గారికి ముందుగా ధన్యవాదాలు. మూగజీవాలకు కూడా మనతో కలిసి ఈ ప్రపంచంలో జీవించే హక్కు ఉంది. ఈ సినిమా చూసిన తర్వాత డాగ్స్‌పై చాలామందికి ఉన్న అభిప్రాయం తప్పకుండా మారుతుందని నేను నమ్ముతున్నాను. సినిమాలో మంచి థ్రిల్‌తో పాటు చక్కటి వినోదం కూడా ఉంది' అన్నారు.
ఇవి కూడా చదవండి:
‘ఇప్పుడేం సమాధానం చెబుతారు? నటుడు గోవిందపై.. భార్య సునీత సంచలన వ్యాఖ్యలు!
చిరు లీక్స్.. మెగా 158 టైటిల్ ఇదే
హీరోగా మారుతున్న కేసీఆర్ మనవడు..