సారా అలీఖాన్‌: నా వ్యక్తిత్వాన్ని దాచుకోవడం నాకు ఇష్టం లేదు

ABN , Publish Date - Mar 22 , 2026 | 02:52 PM

రాజవంశపు వారసత్వం.. బాలీవుడ్‌ గ్లామర్‌.. వీటన్నింటికీ మించి స్పష్టమైన ఆలోచనలున్న ఆధునిక యువతి సారా అలీఖాన్‌(Sara Alikhan).

రాజవంశపు వారసత్వం.. బాలీవుడ్‌ గ్లామర్‌.. వీటన్నింటికీ మించి స్పష్టమైన ఆలోచనలున్న ఆధునిక యువతి సారా అలీఖాన్‌ (Sara Alikhan). వివాదాలు చుట్టుముట్టినా, విమర్శలు ఎదురైనా తనదైన శైలిలో సమాధానమిస్తూ వార్తల్లో నిలుస్తున్న ఈ ‘పటౌడీ ప్రిన్సెస్‌’ ప్రయాణం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌.

వారసత్వంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టడం సులభమే కావొచ్చు, కానీ ఆ వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకోవడం కత్తి మీద సామే. తల్లి అమృతాసింగ్‌ గంభీరం.. తండ్రి సైఫ్‌ అలీఖాన్‌ వాక్చాతుర్యం పుణికిపుచ్చుకున్న సారా అలీఖాన్‌.. నేటి తరం కథానాయికలలో అత్యంత విలక్షణమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఇటీవల ఆమె చుట్టూ ముసురుతున్న వివాదాలు, ఆమె ఇంటర్వ్యూలను గమనిస్తే సారా ఒక గ్లామర్‌ డాల్‌ మాత్రమే కాదని, గట్టి పట్టుదల ఉన్న నటి అని అర్థమవుతుంది.


ఆధ్యాత్మికత

గత వారం రోజులుగా సోషల్‌ మీడియాలో సారా అలీఖాన్‌ పేరు మార్మోగుతోంది. దానికి కారణం ఆమె సినిమా మాత్రం కాదు, ఆమె ఆధ్యాత్మిక విశ్వాసాలు. కేదార్‌నాథ్‌ ఆలయానికి ఆమె తరచుగా వెళ్లడం అందరికీ తెలిసిందే. అయితే, ఇటీవల ఉత్తరాఖండ్‌లోని ఆలయ కమిటీలు హిందూయేతరుల దర్శనంపై కొన్ని నిబంధనలు విధుస్తున్నట్టు వస్తున్న వార్తలు ఇప్పుడు చర్చకు దారి తీశాయి. సనాతన ధర్మంపై నమ్మకం ఉందని అఫిడవిట్‌ ఇస్తేనే దర్శనానికి అనుమతిస్తారనే ప్రతిపాదనపై నెటిజన్లు సారాను ఉద్దేశించి రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సారా గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలోని మాటలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. ‘‘నేను ఎక్కడికి వెళ్లినా నా మనసులో ఉన్న భక్తి ముఖ్యం. దేవాలయాలకు వెళ్లడం నాకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. అది నా వ్యక్తిగత ఆధ్యాత్మిక ప్రయాణం’’ అని చెప్పారు. వివాదాలు ఎన్ని వచ్చినా తన నమ్మకాన్ని హుందాగా చాటుకోవడం ఆమె పరిణితికి నిదర్శనం.

 


Sara.jpg
కెరీర్‌ జోరు.. కొత్త లక్ష్యాలు

సారా అలీఖాన్‌ కెరీర్‌ గ్రాఫ్‌ ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన మలుపులో ఉంది. ‘మెట్రో ఇన్‌ దినో’ వంటి విభిన్న చిత్రాల తర్వాత ఆమె కమర్షియల్‌ చిత్రాల్లోనూ సత్తా చాటుతోంది. ఇటీవల అక్షయ్‌ కుమార్‌తో కలిసి నటించిన ‘స్కైఫోర్స్‌’ చిత్రం సారాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ యాక్షన్‌ డ్రామాలో ఆమె పోషించిన పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం సారా చేతిలో ధర్మా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఒక భారీ చిత్రం, మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. తన సినిమా ఎంపికల గురించి మాట్లాడుతూ ‘‘నేను చేసే ప్రతి సినిమాలోనూ కొత్తదనం ఉండాలని కోరుకుంటాను. కేవలం స్క్రీన్ ప్రెజెన్స్‌ కోసం కాకుండా, కథను మలుపుతిప్పే పాత్రలకే ప్రాధాన్యం ఇస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు.


ముసుగు లేని ముఖం

ఇతర హీరోయిన్లలాగా సారా తన సోషల్‌ మీడియాను కేవలం ఫొటో షూట్ల కోసం మాత్రమే వాడరు. ఆమె షేర్‌ చేసే ‘నమస్తే దర్శకో’ వీడియోలు, తన ప్రయాణ విశేషాలు సహజంగా ఉంటాయి. తన ఇన్‌స్టాగ్రామ్‌ గురించి మాట్లాడుతూ ‘‘అక్కడ నేను ఒక నటిని మాత్రమే కాదు, ఒక సాధారణ అమ్మాయిని కూడా. నా వ్యక్తిత్వాన్ని దాచుకోవడం నాకు ఇష్టం లేదు’’ అని తేల్చి చెప్పారు. ఈ అథెంటిసిటీయే ఆమెకు లక్షలాదిమంది ఫాలోవర్లను సంపాదించి పెట్టింది.
పరిణితి చెందిన ప్రయాణం
సారా అలీఖాన్‌ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ చర్చనీయాంశమే. కానీ, ఎక్కడా ఆమె అసహనాన్ని ప్రదర్శించింది లేదు. తన తండ్రి సైఫ్‌ అలీఖాన్‌, కరీనా కపూర్‌తో ఆమెకు ఉన్న సత్సంబంధాలు, తన తల్లి అమృతాసింగ్‌పై ఉన్న గౌరవం ఆమెను ఒక సంస్కారవంతమైన వ్యక్తిగా నిలబెట్టాయి. ‘‘జీవితంలో ఎత్తు పల్లాలు సహజం.. నా కుటుంబమే నాకు బలం’’ అని చెబుతూ ఉంటారు.


Saara-2.jpg
స్టార్‌కిడ్‌ ముద్రను చెరిపేసుకుని

సారా అలీఖాన్‌ ప్రయాణం ఒక స్ఫూర్తిదాయకమైన పాఠం. స్టార్‌కిడ్‌ అనే ముద్రను చెరిపేసుకుని, తనకంటూ ఒక ప్రత్యేక అస్తిత్వాన్ని సృష్టించుకోవడంలో ఆమె విజయం సాధించారు. వివాదాలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేయాలని చూసినా, ఆమె మాత్రం తన పని ద్వారానే సమాధానం చెబుతూ వస్తున్నారు.  

మధ్యతరగతి మనస్తత్వం
వేల కోట్ల ఆస్తి ఉన్న కుటుంబం నుంచి వచ్చినా సారా ఆలోచనలు మాత్రం చాలా సాధారణంగా ఉంటాయి. ‘‘నేను ఎప్పటికీ ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించడానికే ఇష్టపడతాను. అనవసర ఖర్చులకు దూరంగా ఉండటం మా అమ్మ నుంచి నేర్చుకున్నాను’’ అంటూ తన సింప్లిసిటీని బయటపెట్టారు. ఇది ఆమెను సామాన్య ప్రేక్షకులకు, ముఖ్యంగా యువతకు దగ్గర చేస్తోంది.

సారా క్విక్‌ ఫ్యాక్ట్స్‌
చదువు: గ్రాడ్యుయేషన్‌  
(కొలంబియా యూనివర్సిటీ, న్యూయార్క్‌)
ఇష్టమైన ప్రదేశం: కేదార్‌నాథ్‌
సిద్ధాంతం: మతం అనేది వ్యక్తిగతం...  భక్తి అనేది మానసికం

Updated Date - Mar 22 , 2026 | 03:09 PM