విశేషంగా వినిపిస్తోన్న చెర్రీ - భన్సాలీ కాంబో మూవీ!
ABN , Publish Date - Apr 11 , 2026 | 05:07 PM
సంజయ్ లీలా భన్సాలీ ఒక తెలుగు స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాడనే వార్త ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఆ సినిమా రామ్ చరణ్‌తో ఉండబోతోందని కొందరంటుంటే, కాదు అల్లు అర్జున్‌తో అని మరికొందరు అంటున్నారు.
టాలీవుడ్ టాప్ స్టార్స్‌తో జోడీ కట్టడానికి బాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ ఉరకలు వేస్తున్నారు. అలా ఓ తెలుగు స్టార్ హీరోతో ప్రముఖ హిందీ డైరెక్టర్ ఓ మూవీ చేయబోతున్నారని టాక్. ఇంతకూ వారెవరు...!?
ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా 'పెద్ది' సినిమా రూపొందుతోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'పెద్ది'పై ఫ్యాన్స్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా కాగానే సుకుమార్ డైరెక్షన్‌లో రామ్ చరణ్ నటిస్తారని తెలుస్తోంది. అదయ్యాక చెర్రీ ఏ సినిమాలో నటిస్తారు అన్న ప్రశ్న కూడా ఫ్యాన్స్ మదిలో మెదలుతోంది. ఇదిలా ఉండగానే బాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైన సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్నారన్న టాక్ కూడా విశేషంగా వినిపిస్తోంది. ఈ చిత్రానికి తెలుగు రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథను రూపొందించినట్టు మరోమాట హల్ చల్ చేస్తోంది.
రామ్ చరణ్ గతంలో 'జంజీర్' చిత్రంతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అమితాబ్ బచ్చన్ ను 'యాంగ్రీ యంగ్ మేన్'గా నిలిపిన 1973 నాటి 'జంజీర్' ఆధారంగానే 2013లో రామ్ చరణ్ 'జంజీర్' రూపొందింది. అయితే ఆ సినిమా ఘోరపరాజయాన్ని చవిచూసింది. ఆ తరువాత రామ్ చరణ్ ఏ స్ట్రెయిట్ హిందీ మూవీలోనూ నటించలేదు. ఆ పై చెర్రీ నటించిన పాన్ ఇండియా మూవీస్ మాత్రమే హిందీ జనాన్ని అలరించాయి. ఈ నేపథ్యంలోనే సంజయ్ లీలా భన్సాలీ, రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా రూపొందించాలని ఆశించారు. అమిష్ త్రిపాఠి రచన చేసిన 'ద లెజెండ్ ఆఫ్ సుహెల్ దేవ్' చిత్రాన్ని చెర్రీతో తెరకెక్కించాలని సంజయ్ ఆశించారు. అయితే ఎందువల్లో ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. అప్పటి నుంచీ చెర్రీతో సంజయ్ సినిమా ఉంటుందనే వినిపిస్తోంది. అలాగే ఇప్పుడు మరోమారు చెర్రీ- సంజయ్ కాంబో రానుందని టాక్ !
నిజానికి రామ్ చరణ్ ఓ వైపు, సంజయ్ లీలా భన్సాలీ మరోవైపు బిజీగానే సాగుతున్నారు. 'పెద్ది' కాగానే చెర్రీ సుకుమార్ సినిమాలో నటించనున్నారు. ఆ మూవీ వచ్చే యేడాది వెలుగు చూస్తుంది. ఇక రణబీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలుగా సంజయ్ లీలా భన్సాలీ 'లవ్ అండ్ వార్' తెరకెక్కిస్తున్నారు. అది పూర్తయ్యాకే వేరే ప్రాజెక్ట్ పై సంజయ్ దృష్టి సారించనున్నారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ తన 'రాకా' మూవీ షూటింగ్ సమయంలో ముంబైలో ఉన్నప్పుడు సంజయ్ లీలా భన్సాలీని పలుమార్లు కలిశారనీ వినిపిస్తోంది. మరి సంజయ్ తో బన్నీ మూవీ ఉంటుందా అన్న అనుమానమూ కలుగుతోంది. అయితే మరో మూడేళ్ళ వరకు బన్నీ కూడా ఖాళీగా లేరు. కాబట్టి చెర్రీతోనే సంజయ్ సాగవచ్చునని కొందరి భావన. ఏమవుతుందో చూద్దాం.