మడుమ తిప్పని దిల్ రాజు...

ABN , Publish Date - Mar 30 , 2026 | 01:11 PM

సల్మాన్ ఖాన్‌ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌ రాజు ఓ సినిమా నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌లో ఏప్రిల్‌లో మొదలు కానుంది.

Salman Khan Vamsi Paidipalli Dil Raju

ఇటీవల దిల్ రాజు (Dil Raju) మిత్రులతో కలిసి రెండు హిందీ సినిమాలు నిర్మించారు. అందులో ఒకటి 'జెర్సీ' కాగా, మరొకటి 'హిట్‌'. ఈ రెండు సినిమాలు దిల్ రాజుకు తీవ్ర నిరాశను కల్గించాయి. అయినా... ఆయన తగ్గేదే లే అంటున్నారు. తాజాగా సల్మాన్ ఖాన్‌తో తీయబోతున్న సినిమా ఏప్రిల్‌లో సెట్స్ పైకి వెళుతుందని ప్రకటించారు. నిజానికి దిల్‌ రాజు హిందీలోనూ వరుసగా సినిమాలు నిర్మించడానికి సిద్థమయ్యారు. గత యేడాది సంక్రాంతికి వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాను అజయ్‌ దేవ్ గన్ తో దిల్ రాజు నిర్మించబోతున్నారని, దానికి అనీస్‌ బాజ్మీ దర్శకత్వం వహిస్తాడని వార్తలు వచ్చాయి. అలానే సల్మాన్‌ ఖాన్‌తో నిర్మించబోయే సినిమాకు వంశీ పైడిపల్లి (Vamsi Paidipalli) దర్శకుడని గతంలోనే దిల్‌ రాజు, ఆయన సోదరుడు శిరీష్‌ తెలిపారు. అయితే ఇప్పుడు సల్మాన్ ఖాన్ (Salaman Khan) మూవీ ఏప్రిల్‌లో మొదలువుతుందని, అధికారికంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'మున్నా' సినిమాతో వంశీ పైడిపల్లిని దిల్‌ రాజే దర్శకుడిగా పరిచయం చేశాడు. అప్పటి నుండి వంశీ పైడిపల్లి దర్శకుడిగా తన స్థాయిని పెంచుకుంటూ వెళ్ళాడు. అలానే ఇటీవల విజయ్‌ హీరోగా దిల్ రాజు వంశీ పైడిపల్లి దర్శకత్వంలోనే 'వారసుడు' మూవీని తమిళ, తెలుగు భాషల్లో నిర్మించారు. ఆ సినిమా విడుదలైనప్పుటి నుండి వంశీ... సల్మాన్‌ ఖాన్ ప్రాజెక్ట్ మీదనే పూర్తి స్థాయిలో దృష్టిపెట్టారు. మొత్తానికి ఈ సినిమా ఇప్పుడు సెట్స్ పైకి వెళుతోంది.


ఈ సినిమాకు సంబంధించి దిల్ రాజు వివరిస్తూ, 'ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయ సినీ ప్రేక్షకులను అలరించిన వ్యక్తి సల్మాన్ ఖాన్. ఆయన ఇప్పుడు హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లితో చేతులు కలుపుతున్నారు. ఏప్రిల్‌లో షూటింగ్‌ ప్రారంభమౌతుంది. ఘన విజయానికి సిద్థంగా ఉండండి' అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దిల్ రాజు బ్యానర్‌లో 63వ చిత్రంగా ఇది నిర్మితం కానుంది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించబోతున్నట్టు సమాచారం. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సల్మాన్‌ ఖాన్ మూవీ సెట్స్ పైకి వెళ్ళగానే దిల్‌ రాజు... అజయ్‌ దేవ్ గన్ మూవీపైనా ఫోకస్‌ పెడతారని, దాని అప్ డేట్‌ కూడా త్వరలోనే వస్తుందని సన్నిహితులు చెబుతున్నారు.

Updated Date - Mar 30 , 2026 | 01:13 PM