మోనికా బెల్లూచి, గియాన్‌కార్లోలతో సల్మాన్-సంజు రచ్చ
ABN , Publish Date - Aug 12 , 2026 | 04:18 PM
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్, నటుడు సంజయ్ దత్ ప్రధాన ఆకర్షణగా అంతర్జాతీయ యాక్షన్ థ్రిల్లర్ 7 డాగ్స్ (7 Dogs) భారతీయ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan), నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt)ప్రధాన ఆకర్షణగా అంతర్జాతీయ యాక్షన్ థ్రిల్లర్ 7 డాగ్స్ (7 Dogs) భారతీయ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఈజిప్షియన్ సూపర్‌స్టార్స్ అహ్మద్ ఎజ్, కరీమ్ అబ్దెల్ అజీజ్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ భారీ గ్లోబల్ ప్రాజెక్ట్‌లో సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 21న భారతదేశ వ్యాప్తంగా హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఘనంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
భారత్, ఈజిప్ట్, యూరప్, హాలీవుడ్, మిడిల్ ఈస్ట్ దేశాలకు చెందిన ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు కలిసి పనిచేసిన ఒక అరుదైన సినిమాటిక్ కలయికగా ఈ చిత్రం నిలవనుంది. ఇటాలియన్ నటి మోనికా బెల్లూచి, బ్రేకింగ్ బ్యాడ్ ఫేమ్ జియాన్‌కార్లో ఎస్పోసిటో వంటి ప్రముఖ అంతర్జాతీయ తారలు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన బ్యాడ్ బాయ్స్ ఫర్ లైఫ్, బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై చిత్రాల దర్శకులు ఆదిల్ ఎల్ అర్బి, బిలాల్ ఫల్లా ఈ బిగ్ యాక్షన్ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించారు.
సెలా స్టూడియోస్ నిర్మాణంలో, సౌదీ అరేబియా జనరల్ ఎంటర్‌టైన్‌మెంట్ అథారిటీ (GEA)రియాద్ సీజన్ భాగస్వామ్యంతో దాదాపు 40 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. అంతేకాకుండా ఇందులో చిత్రీకరించిన భారీ పేలుడు సన్నివేశం గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా సొంతం చేసుకోవడం గమనార్హం. ఇంటర్పోల్ అధికారి, నేర ప్రపంచానికి చెందిన వ్యక్తి మధ్య జరిగే డ్రగ్ ట్రాఫికింగ్ నిరోధక పోరాటం నేపథ్యంగా ఈ కథ సాగుతుంది. ఎంతో కాలం తర్వాత సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ ఒకే అంతర్జాతీయ స్క్రీన్‌పై కనిపించబోతుండటంతో భారతీయ సినీ అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమాతో బాలీవుడ్ స్టార్స్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.