రిటైర్డ్ సూపర్ హీరోగా సల్మాన్ ఖాన్.. రాజ్ అండ్ డీకే మూవీలో సరికొత్త అవతార్!
ABN , Publish Date - Aug 09 , 2026 | 08:55 PM
సల్మాన్ ఖాన్, రాజ్ అండ్ డీకే కాంబినేషన్‌లో సూపర్ హీరో మూవీ రాబోతున్నట్లు బాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.
ఇప్పటి వరకు లవ్, యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సల్మాన్ ఖాన్ (Salman Khan), ఇప్పుడు మొదటిసారి కొత్త పంథాలోకి వెళ్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉన్న సూపర్ హీరో జానర్‌లో ఒక ఫ్యామిలీ యాక్షన్ మూవీ తీయడానికి రెడీ అవుతున్నారు. విభిన్నమైన ఐడియాలతో ఓటీటీ, వెండితెరపై సంచలనాలు సృష్టిస్తున్న తెలుగు దర్శకద్వయం రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందబోతుందని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ఒక విధంగా ఈ కాంబినేషన్ సినీ ప్రేమికులకు పూనకాలు తెప్పించే పాయింటే.. అయితే ఇది రెగ్యులర్ సినిమాగా కాకుండా కాస్త భిన్నంగా ఉండబోతుందట.
సాధారణంగా సూపర్ హీరో కథలంటే ముసుగులు తొడుక్కోవడం, ప్రపంచాన్ని రక్షించేందుకు ఆకాశంలో ఎగరడం చూస్తుంటాం. కానీ, రాజ్ & డీకే మార్క్ సూపర్ హీరో కథ దీనికి పూర్తిగా భిన్నంగా ఉండబోతోంది. హాలీవుడ్ హిట్ మూవీ హ్యాంకాక్ తరహాలో సాగే ఈ కథలో కథానాయకుడికి అపారమైన శక్తులు ఉంటాయి. సకల లోకాన్ని రక్షించి అలసిపోయిన ఆ హీరో.. ఇక చాలు ప్రశాంతంగా రిటైర్మెంట్ తీసుకుందాం అని అనుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో అనుకోని పరిస్థితులు అతడిని మళ్లీ విధి నిర్వహణలోకి నెడతాయి. బాధ్యతలకు దూరంగా ఉండాలనుకునే ఒక పవర్‌ఫుల్ హీరో, పరిస్థితుల ప్రభావంతో మళ్లీ పోరాటానికి దిగితే వచ్చే కామెడీ, యాక్షన్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. సల్మాన్ ఖాన్ కెరీర్‌లోనే ఇది మొదటి పూర్తిస్థాయి సూపర్ హీరో చిత్రం కావడం విశేషం. ఇప్పటికే ది ఫ్యామిలీ మ్యాన్, ఫార్జీ వంటి గ్లోబల్ హిట్ సిరీస్‌లతో తమకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న రాజ్ అండ్ డీకే.. సల్మాన్ కోసం ఒక షార్ప్ అండ్ హ్యూమరస్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నారట.
సల్మాన్‌కున్న తిరుగులేని మాస్ ఇమేజ్‌ను, తమదైన విచిత్రమైన కామెడీ టైమింగ్‌ను మిక్స్ చేసి ఈ కథను రాసుకున్నారని టాక్. స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా సల్మాన్ చేసే అల్లరి, మాస్ డైలాగులు రాజ్ అండ్ డీకే మేకింగ్ స్టైల్‌లో సరికొత్తగా కనిపిస్తాయని చిత్ర వర్గాలు అంటున్నాయి. తెలుగులో వరుస హిట్లతో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, బాలీవుడ్‌లో అతుల్ అగ్నిహోత్రికి చెందిన రీల్ లైఫ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ బిగ్ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించడానికి ముందుకు వచ్చాయి. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ఈ ప్రాజెక్ట్‌తో బాలీవుడ్‌లో చాలా పెద్ద స్థాయిలో అడుగుపెట్టబోతోంది.
భారీ విజువల్ ఎఫెక్ట్స్, అంతర్జాతీయ స్థాయి స్టంట్స్ ఈ సినిమాలో భాగం కానున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే, ఈ ఏడాది చివరినాటికి ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం తన మిగతా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండగా, రాజ్ & డీకే కూడా స్క్రిప్ట్‌కు ఆఖరి మెరుగులు దిద్దుతున్నారు. వినూత్నమైన కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ 'మాస్ సూపర్ హీరో' సినిమా.. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో వేచి చూడాలి.