Salman controversy: రూ.3 కోట్ల మోసం కేసులో విచారణకు ఆదేశం
ABN , Publish Date - Aug 06 , 2026 | 11:09 AM
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరోసారి వార్తల్లో వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయన న్యాయపరమైన వివాదంలో చిక్కుకున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (SalmanKhan) మరోసారి వార్తల్లో వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయన న్యాయపరమైన వివాదంలో చిక్కుకున్నారు. 'బీయింగ్ హ్యూమన్' (being Human) జ్యువెలరీ షోరూమ్ పేరుతో మోసం జరిగిందంటూ నమోదైన కేసులో చండీగఢ్ జిల్లా కోర్టు సల్మాన్ ఖాన్, ఆయన సోదరి అల్విరా ఖాన్‌తో పాటు సంబంధిత సంస్థ డైరెక్టర్లకు నోటీసులు జారీ (Salman controversy) చేసింది. అక్టోబర్ 5న విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసును చండీగఢ్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ గుప్తా దాఖలు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు 'బీయింగ్ హ్యూమన్' జ్యువెలరీ బ్రాండ్ షోరూమ్‌ను ఏర్పాటు చేయాలని కంపెనీ ప్రతినిధులు ప్రోత్సహించడంతో సుమారు రూ.3 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందులో షోరూమ్ అభివృద్ధి పనులకే దాదాపు రూ.1 కోటి ఖర్చు అయినట్లు చెప్పారు.
'ఒప్పందంలోని అన్ని నిబంధనలను పాటించినప్పటికీ, షోరూమ్ ప్రారంభమైన తర్వాత కంపెనీ నుంచి హామీ ఇచ్చిన స్థాయిలో వ్యాపార సహకారం అందలేదు. ముఖ్యంగా 2020 ఫిబ్రవరి నుంచి నగల సరఫరా నిలిచిపోవడంతో వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. భారీ నష్టాలు వచ్చాయి' అని ఫిర్యాదులో వివరించారు. ఈ ఆరోపణలను సంబంధిత సంస్థ ఇప్పటికే ఖండించింది. 2018లో స్థానిక వ్యాపారవేత్తతో కుదిరిన ఒప్పందంలో సల్మాన్ ఖాన్‌కు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని సంస్థ స్పష్టం చేసింది. ఈ వివాదంపై తదుపరి విచారణ అక్టోబర్ 5న జరగనుండగా, కోర్టు ముందు ఇరు పక్షాల వాదనలు వినిపించనున్నాయి. ఈ కేసు విచారణ ఎలాంటి మలుపు తిరుగుతుందో అన్నది ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.