ఐసీయూలో.. స‌ల్మాన్ ఖాన్ తండ్రి

ABN , Publish Date - Feb 18 , 2026 | 07:26 AM

ప్రముఖ బాలీవుడ్ రచయిత, హీరో సల్మాన్ ఖాన్ తండ్రి సలీంఖాన్ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేర్చారు.

Salman Khan

ప్రముఖ బాలీవుడ్ రచయిత, హీరో సల్మాన్ ఖాన్ తండ్రి సలీంఖాన్ (Salim Khan) తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేర్చారు. ఈ వార్త తెలియగానే ఆయన పెద్ద కుమారుడు సల్మాన్ ఖాన్ హుటాహుటిన బాంద్రాలో ఉన్న ఆ ఆస్పత్రికి వెళ్లారు. సలీంఖాన్‌ను ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. సలీంఖాన్ రెండో భార్య, నటి, నర్తకి హెలెన్, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఆస్పత్రికి వెళ్లారు.

సలీం ఖాన్ డెబ్బై, ఎన‌భై దశకాల్లో మ‌రో ర‌చ‌యిత జావేద్ అక్త‌ర్ (Javed Akhtar) తో క‌లిసి స‌లీం - జావెద్ (Salim–Javed)గా బాలీవుడ్‌ను శాసించారు. వారు ప‌ట్టింద‌ల్లా బంగారం అయింది. వారు ర‌చ‌న చేసిన సినిమాలు ఎక్కువ శాతం బ్లాక్ బ‌స్ట‌ర్స్ అయి హీరోల‌కు స్టార్ స్టేట‌స్ తీసుకు వ‌చ్చాయి. ముఖ్యంగా 'జంజీర్', 'షోలే' వంటి చిత్రాలతో అమితాబ్ బచ్చన్‌కు యాంగ్రీ యంగ్ మన్ ఇమేజ్ తీసుకువచ్చారు.

ఇదిలాఉంటే స‌లీంఖాన్‌కు ఇద్ద‌రు భార్య‌లు కాగా మొద‌టి భార్య స‌ల్మా ఖాన్ (సుశీల చ‌ర‌క్) ద్వారా న‌లుగురు సంతానం. బాలీవుడ్ మెగాస్టార్ స‌ల్మాన్ ఖాన్ (Salman Khan), అర్బాజ్ ఖాన్ (Arbaaz Khan), సోహైల్ ఖాన్ (Sohail Khan) కుమారులు ఉండ‌గా అల్విరా ఖాన్ అగ్నిహోత్రి (Alvira Khan Agnihotri) అనే కూతురు ఉంది. ఇక రెండో భార్య అల‌నాటి హీరోయిన్ హెల‌న్ (Helen​) కాగా కూతురు అర్పితా ఖాన్‌ను ద‌త్త‌త తీసుకున్నారు. వీరంతా ఇప్ప‌టికీ క‌లిసి ఉండ‌డం విశేషం.

Updated Date - Feb 18 , 2026 | 10:30 AM