‘బాబా సిద్ధిఖీకి పట్టిన గతే నీకూ’.. సైఫ్ అలీఖాన్‌కు బెదిరింపులు
ABN , Publish Date - Nov 20 , 2026 | 06:35 AM
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌కు జీషన్ అఖ్తర్ పేరుతో హత్య బెదిరింపు వాయిస్ మెసేజ్ వచ్చింది.
హత్య చేస్తామంటూ ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ (Saif Ali Khan) కు బెదిరింపులు వచ్చాయని గురువారం పోలీసులు తెలిపారు. జీషన్ అఖ్తర్ (Zeeshan Akhtar) అనే వ్యక్తి పేరున ఈ హెచ్చరికలు వచ్చాయని చెప్పారు. ఎన్సీపీ నాయకుడు, మాజీ మంత్రి బాబా సిద్దిఖీ (Baba Siddique Murder Case) హత్య కేసులో జీషన్ నిందితుడిగా ఉన్నాడని తెలిపారు. జీషనే ఈ హెచ్చరిక చేశాడా, లేదంటే అతడి పేరున ఇతరులు ఎవరైనా చేశారా అన్నదానిపై దర్యాప్తు చేస్తామని చెప్పారు. గడిచిన నాలుగైదు నెలలుగా తరుచూ బెదిరింపు కాల్స్‌తో కంటి మీద కునుకు లేకుండా ఉన్న బాలీవుడ్లో మరోసారి అలాంటి ఘటనే పునరావృతమైంది.
ఇప్పటికే ఇటీవల అమితాబ్, టైగర్ ష్రాప్, సల్మాన్ ఖాన్ ఇంటి సమీపంలో ఫైరింగ్ లాంటి ఘటనలు చోటు చేసుకోగా తాజాగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌కు హత్య బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. బాబా సిద్ధిఖీ హత్య కేసులో నిందితుడిగా ఉన్న జీషన్ అఖ్తర్ పేరుతో సైఫ్‌కు బెదిరింపు సందేశం వచ్చినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. ఈ విషయాన్ని గురువారం ధ్రువీకరించిన పోలీసులు.. ఆ బెదిరింపుల వెనుక ఉన్న వ్యక్తి ఎవరనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల వివరాల ప్రకారం.. సైఫ్ అలీఖాన్ ఫోన్‌కు ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది. అందులో బాబా సిద్ధిఖీకి పట్టిన గతే నీకూ పడుతుందని హెచ్చరించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందేశం నిజంగానే జీషన్ అఖ్తర్ పంపించాడా? లేక అతడి పేరును ఉపయోగించుకుని మరెవరైనా ఈ బెదిరింపులకు పాల్పడ్డారా? అనే విషయాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. వాయిస్ మెసేజ్ నిజానిజాలను నిర్ధారించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.
జీషన్ అఖ్తర్.. మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ నాయకుడు, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. 2024 అక్టోబర్ 12న ముంబైలోని బాంద్రా ఈస్ట్ ప్రాంతంలో తన కుమారుడు జీషన్ సిద్ధిఖీ కార్యాలయం వెలుపల బాబా సిద్ధిఖీని ముగ్గురు దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో జీషన్ అఖ్తర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.ఇదిలా ఉండగా.. ఇటీవల బాలీవుడ్ నటులు తుషార్ కపూర్, ఆయుష్మాన్ ఖురానాలకు కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఆ కేసుల్లో బెంగళూరుకు చెందిన 30 ఏళ్ల వైభవ్ మిశ్రాను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. అతడికి ఎలాంటి క్రిమినల్ గ్యాంగ్‌తో సంబంధాలు లేవని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో బెదిరింపు సందేశాలు పంపినట్లు దర్యాప్తులో వెల్లడైందని అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో సైఫ్ అలీఖాన్‌కు వచ్చిన తాజా బెదిరింపు సందేశాన్ని పోలీసులు మరింత జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. గతంలోనూ సైఫ్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. 2025 జనవరిలో ముంబైలోని బాంద్రాలో ఉన్న ఆయన నివాసంలోకి చొరబడిన వ్యక్తి కత్తితో దాడి చేయడంతో సైఫ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం కోలుకున్నారు. ఈ పాత ఘటనను ప్రస్తావిస్తూనే తాజా బెదిరింపు వచ్చినట్లు కొన్ని వార్తా కథనాలు పేర్కొన్నాయి. అయితే, ప్రస్తుతం వచ్చిన బెదిరింపుల వెనుక అసలు వ్యక్తి ఎవరు? జీషన్ అఖ్తర్‌కు దీనితో సంబంధం ఉందా? లేక ఎవరో అతడి పేరును ఉపయోగించుకుంటున్నారా? అనే అంశాలపై ముంబై పోలీసులు దృష్టి సారించారు.