Riteish Deshmukh: మూడు గంటల సినిమాల జాబితాలో 'రాజా శివాజీ'
ABN , Publish Date - Apr 25 , 2026 | 08:26 PM
రితేష్ దేశ్‌ముఖ్ చారిత్రక చిత్రం 'రాజా శివాజీ' సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాను మే 1న విడుదల చేయబోతున్నారు.
ప్రముఖ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ (Riteish Deshmukh) టైటిల్ రోల్ ప్లే చేసిన చారిత్రక చిత్రం 'రాజా శివాజీ' (Raja Shivaji) సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. మే 1న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమా మరాఠీ వర్షన్ 195.05 నిమిషాలు ఉండబోతోంది. అంటే మూడు గంటల పదిహేను నిమిషాల నిడివితో 'రాజా శివాజీ' జనం ముందుకు రానుంది. ఇటీవల సినిమాను సెన్సార్ చేసిన సీబీఎఫ్‌సి బృందం ఇందులో ఉన్న హింసాత్మక సంఘటనలను దృష్టిలో పెట్టుకుని యు/ఎ 16 ప్లస్ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. అలానే కొన్ని సవరణలను చేయడంతో పాటు పిల్లలపై చిత్రీకరించిన హింసాత్మక సన్నివేశాలను మార్చమని కోరింది. సినిమా ప్రారంభంలో వచ్చే డిస్‌క్లైమర్‌ను మరింత విపులంగా, వాయిస్ ఓవర్‌తో ఇవ్వమని సూచన చేసింది. అలానే చారిత్రక సంఘటనలు తెలియచేసే సన్నివేశాలలో స్క్రీన్‌పై టెస్ట్ వేయాల్సిందిగా కోరింది. ఓ బాలుడి గొంతుకోసే సన్నివేశాన్ని వేరే విజువల్స్‌తో మార్చమని సూచించింది.
ఇదిలా ఉంటే... 195 నిమిషాల రన్ టైమ్‌తో 'రాజా శివాజీ' సినిమా మూడు గంటలపైనున్న సినిమాల జాబితాలో చేరనుంది. ఈ మధ్య కాలంలో 'యానిమల్' (203 నిమిషాలు), 'పుష్ప 2' (Pushpa 2) (200 నిమిషాలు), 'ధురంధర్ (Dhurandhar) (214 నిమిషాలు), 'ధురంధర్: ద రివేంజ్ (229 నిమిషాలు), బోర్డర్ 2 (199 నిమిషాలు) చిత్రాలు మూడు గంటల పైగా నిడివితో విడుదలయ్యాయి. విశేషం ఏమంటే ఇవన్నీ విజయాన్ని అందుకున్న చిత్రాలే! 'రాజా శివాజీ' చిత్రంలో రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా దేశ్‌ముఖ్, సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, విద్యాబాలన్, ఫర్దీన్ ఖాన్, భాగ్యశ్రీ, సచిన్ ఖేడేకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరి శివాజీ తనయుడు 'ఛావా' ఘన విజయాన్ని అందుకున్న నేపథ్యంలో 'రాజా శివాజీ' ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.