రశ్మిక 'కాక్ టైల్ 2' ఎప్పుడంటే...
ABN , Publish Date - Mar 14 , 2026 | 10:33 AM
రశ్మిక మందన్న తాజా హిందీ చిత్రం 'కాక్ టైల్ 2' జూన్ 19న విడుదల కాబోతోంది. ఈ సినిమా టీజర్‌ను 'ధురంధర్ 2' సినిమాతో పాటు థియేటర్లలో ప్రదర్శించబోతున్నారు.
ఫిల్మ్ స్టార్స్‌కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఒక్కోసారి వారి ప్రతిభతో సంబంధం లేకుండా హల్చల్ చేస్తుంటాయి. మొన్నటి వరకూ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), రశ్మిక మందన్న (Rashmika Mandanna) వివాహ వార్తలు వారి అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేశాయి. పెళ్ళైన పది రోజులకు ఆ సందడి కాస్తంత సద్దుమణిగిందని అనుకుంటే, ఈ లోగా రశ్మిక పోస్ట్ చేసిన ట్వీట్ సంచలనం సృష్టించింది. తన గత జీవితానికి సంబంధించిన విషయాలను అసంబద్ధంగా ట్రోల్ చేస్తే క్షమించేది లేదని రశ్మిక వార్నింగ్ ఇచ్చింది. దాంతో రెండు రోజులుగా ఆ వార్తలు మీడియాలో ప్రాధాన్యం సంతరించు కున్నాయి. ఈ మధ్యలో ఆమె తాజా హిందీ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ప్రకటన పక్కకు వెళ్ళిపోయింది.
'గుడ్ బై' మూవీతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన రశ్మిక 'మిషన్ మజ్ను, యానిమల్, ఛావా, సికిందర్, థమా' చిత్రాలలో నటించింది. హిందీలో విడుదలైన 'పుష్ప, పుష్ప 2'తో పాటు 'యానిమల్' మూవీతో రశ్మిక నేషనల్ క్రష్‌గా మారిపోయింది. ఇదిలా ఉంటే ఆమె ప్రస్తుతం నటిస్తున్న 'కాక్ టైల్ 2' మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ తాజాగా ప్రకటించారు. జూన్ 19న ఈ సినిమా విడుదల కాబోతోంది. అలానే టీజర్‌ను ఈ నెల 18న విడుదల చేస్తున్నారు. విశేషం ఏమంటే... 19న విడుదల అవుతున్న 'ధురంధర్ 2' మూవీతో పాటే 'కాక్ టైట్ 2' టీజర్‌ను ప్రదర్శించబోతున్నారు. సైఫ్ అలీఖాన్, దీపికా పదుకొణే జంటగా నటించిన 'కాక్ టైల్'కు ఇది సీక్వెల్. ఇందులో షాహిద్ హీరోగా నటించగా, కృతీసనన్, రశ్మిక, అర్జున్ రాంపాల్, డింపుల్ కపాడియా కీలక పాత్రలు పోషించారు. హోమి అడాజానియా దర్శకత్వంలో ఈ సినిమాను దినేశ్ విజన్ నిర్మించారు. విజయ్ దేవరకొండతో వివాహం జరిగిన తర్వాత విడుదలౌతున్న రశ్మిక మందన్న చిత్రం ఇదే కావడంతో ఈ సినిమా ఫలితంపై ఆసక్తి నెలకొంది.