ఆలియా భట్‌కు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు.. రాజమౌళి ప్రశంసలు!
ABN , Publish Date - Nov 20 , 2026 | 06:18 AM
టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన తొలి ‘TIME100 Next India 2026’ జాబితాలో ఆలియా భట్‌కు చోటు దక్కింది.
అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సినీ పరిశ్రమకు మరోసారి గుర్తింపు లభించింది. ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ‘టైమ్’ తొలిసారిగా విడుదల చేసిన ‘టైమ్ 100 నెక్స్ట్ ఇండియా 2026’ జాబితాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ (Alia Bhatt) కు చోటు దక్కింది. భారత భవిష్యత్తును ప్రభావితం చేస్తున్న ప్రతిభావంతులు, కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతున్న నాయకులు, వివిధ రంగాల్లో తమదైన ముద్ర వేస్తున్న వ్యక్తులను గుర్తిస్తూ ఈ జాబితాను రూపొందించారు. వినోదం, వ్యాపారం, క్రీడలు, సైన్స్, సంస్కృతి, సామాజిక రంగాలకు చెందిన మొత్తం 100 మందికి ఇందులో స్థానం కల్పించారు.
ఈ జాబితాలో ఆలియా భట్‌కు చోటు దక్కడం మరింత ప్రత్యేకంగా నిలిచింది. ఆమె ‘టైమ్ 100 నెక్స్ట్ ఇండియా’ (TIME Magazine) ప్రత్యేక సంచిక కవర్పైనా కనిపించారు. ఈ సందర్భంగా ఆలియా ప్రతిభ, నటనపై ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) రాసిన ప్రత్యేక అభినందన వ్యాసాన్ని ‘టైమ్’ ప్రచురించింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఆలియాతో కలిసి పనిచేసిన అనుభవాలను ఆయన ఇందులో గుర్తు చేసుకున్నారు.
‘ఆర్ఆర్ఆర్’లో సీత పాత్రకు పరిమిత సన్నివేశాలే ఉన్నప్పటికీ, ఆలియా ఆ పాత్రను ఎంతో బాధ్యతతో పోషించారని రాజమౌళి ప్రశంసించారు. హిందీ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన ఆమె తెలుగు సంభాషణలను ఎంతో శ్రద్ధగా నేర్చుకుని, ప్రతి మాట సహజంగా పలికేందుకు కృషి చేశారని పేర్కొన్నారు. పాత్ర నిడివి ఎంత అన్నది కాకుండా, తనకు అప్పగించిన పాత్రకు పూర్తి న్యాయం చేయాలనే తపన ఆలియాలో కనిపించిందని కొనియాడారు. సీత పాత్రలో ఆమె చూపిన అంకితభావం తనను ఆకట్టుకుందని వివరించారు.
నటిగా సవాళ్లను స్వీకరించే ధైర్యం, ప్రతి పాత్ర కోసం చేసే కృషి, భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికలపై పరిచయం చేయడంలో ఆలియా చూపుతున్న ఆసక్తి ప్రత్యేకమని రాజమౌళి అభిప్రాయపడ్డారు. ఆమె కేవలం ఒక స్టార్‌గా మాత్రమే కాకుండా, భారతీయ సినిమా ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పే వ్యక్తిగా ఎదుగుతున్నారని ప్రశంసించారు.
ఇదిలాఉంటే.. ఇక ఈ జాబితాలో ఇప్పటికే ఆలియా భట్‌తో పాటు పలువురు భారతీయ సినీ ప్రముఖులు కూడా చోటు దక్కించుకున్నారు. ఆర్యన్ ఖాన్, దర్శకురాలు పాయల్ కపాడియా, థేజా రియో, దుల్కర్ సల్మాన్, నయనతార, సాయి పల్లవి, సమంత రూత్ ప్రభు, తాప్సీ పన్ను, త్రిప్తి దిమ్రి, వేదాంగ్ రైనా, విక్కీ కౌశల్, అనిరుధ్ రవిచందర్, దిల్జిత్ దోసాంజ్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. నటీనటులతో పాటు దర్శకులు, సంగీత కళాకారులు, ఇతర రంగాలకు చెందిన ప్రతిభావంతులకు కూడా ఈ జాబితా గుర్తింపు లభించింది.