'ధురంధర్‌ 2'... సౌత్‌లో సరికొత్త వేవ్!

ABN , Publish Date - Mar 18 , 2026 | 11:32 AM

రణవీర్ సింగ్ తాజా చిత్రం 'ధురంధర్ 2'కు దక్షిణాదిన పాజిటివ్ వేవ్స్ ఉన్నాయి. తమిళనాడు, కేరళ, కర్నాటకలో ఈ సినిమాకు ఎదురు లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాలలో మాత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' నుండి ఓ మేరకు పోటీ ఏర్పడే ఆస్కారం కనిపిస్తోంది.

Dhurandhar 2 Movie

రణవీర్ సింగ్‌ (Ranveer Singh) - ఆదిత్య ధర్ (Aditya Dhar) కాంబినేషన్‌లో గురువారం జనం ముందుకు రాబోతున్న 'ధురంధర్‌ 2' (Dhurandhar 2) గురించే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ సినిమా కంటెంట్ అనుకున్న సమయానికి డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్‌కు అందిస్తారా లేదా అనే సందేహాలు ఒకవైపు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఈ రోజు సాయంత్రం నుండే పలు పట్టణాలలో 'ధురంధర్ 2' ప్రీమియర్ షోస్‌కు ప్లాన్ చేశారు. అయితే... ఇవేవీ పట్టించుకోని జనాలు వీలైనంత త్వరగా మూవీని చూడాలని ఆన్ లైన్ బుకింగ్స్‌లో బిజీ బిజీగా ఉన్నారు.


'ధురంధర్‌' (Dhurandhar) చిత్రం మొదటి భాగం కేవలం హిందీ భాషలోనే విడుదలైంది. దాంతో దక్షిణాదిలో అతి తక్కువ థియేటర్లలో ఇది స్క్రీనింగ్ జరిగింది. ఆ సినిమాకు లభించిన ఆదరణను దృష్టిలో పెట్టుకుని మేకర్స్ ఇప్పుడు దక్షిణాది భాషలన్నింటిలోకీ దీనిని డబ్ చేయడంతో అత్యధిక థియేటర్లలో 'ధురంధర్ 2' ప్రదర్శితం కానుంది. విశేషం ఏమంటే... దీనితో పాటే విడుదల కావాల్సిన పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్‌' (Toxic) వాయిదా పడటంతో దక్షిణాదిన 'ధురంధర్‌ 2'కు అనుకూల పవనాలు వీస్తున్నాయి. తమిళనాడులోనూ, కన్నడలోనూ 'ధురంధర్‌ 2'కు ఎలాంటి పోటీ కనిపించడం లేదు. కేరళలో మాత్రం ఈ సినిమాతో పాటే 'ఆడు 3' మూవీ రిలీజ్ అవుతోంది. ఆ రకంగా కొంతమేర కలెక్షన్స్‌ను ఈ రెండు సినిమాలు పంచుకునే ఆస్కారం ఉండొచ్చు. అలానే తెలుగు రాష్ట్రాలలో 'ధురంధర్‌ 2' వేవ్‌ను... ఊహించని విధంగా బరిలోకి దిగిన 'ఉస్తాద్ భగత్ సింగ్‌' కాస్తంత నిలువరించబోతోంది. నగరాల్లోని మల్టిప్లెక్స్ థియేటర్స్ 'ధురంధర్‌ 2'కు ప్రాధాన్యం ఇస్తున్నా... సింగిల్ స్క్రీన్స్ మాత్రం 'ఉస్తాద్...' వైపే మొగ్గు చూపుతున్నాయి.


ఇదిలా ఉంటే... ట్రేడ్ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం 'ధురంధర్ 2' మూవీ కేరళలో మొదటి రోజున ఆరు కోట్లు, తమిళనాడులో ప్రీమియర్స్ షోస్ కలుపుకుని పది కోట్లు వసూలు చేస్తుందని అంటున్నారు. కర్నాటకలో ప్రీ సేల్స్ ఇప్పటికే ఏడు కోట్ల రూపాయల మేరకు జరిగాయని, ఆ ప్రకారం మొదటి రోజు అక్కడ కూడా పది కోట్లకు పైగానే గ్రాస్ వసూలు అవుతుందని చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే ఈ సినిమా లక్ష టిక్కెట్స్ అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ఏది ఏమైనా... 'ధురంధర్ 2'కు దక్షిణాదిలో అనుకూల పవనాలు వీస్తున్నట్టే చెప్పుకోవచ్చు.

'కేడీ' ఐటమ్ సాంగ్ 'పుష్ప2', 'ఖల్ నాయక్' పాటల కంటే దారుణంగా ఉందా? మీ అభిప్రాయం చెప్పడానికి క్లిక్ చేయండి.

Updated Date - Mar 18 , 2026 | 12:33 PM