Dhurandhar 2: నాగపూర్ ఆర్.ఎస్.ఎస్. ఆఫీస్‌లో రణవీర్ సింగ్...
ABN , Publish Date - Apr 11 , 2026 | 06:05 PM
'ధురంధర్' చిత్ర కథానాయకుడు రణవీర్ సింగ్ శుక్రవారం నాగపూర్‌లో ఆర్.ఎస్.ఎస్. సర్ సంఘచాలక్ మోహన్ భగవత్‌ను కలిశారు. ఆర్.ఎస్.ఎస్. వ్యవస్థాపకులు డా. కేశవ్ బలిరాం హెడ్గేవార్‌కు రణవీర్ సింగ్ నివాళులు అర్పించారు.
ఆదిత్య ధర్ తెరకెక్కించిన 'ధురంధర్: ది రివేంజ్' సినిమా ఓ పక్క థియేటర్లలో సందడి చేస్తుంటే... మరోపక్క ఆ చిత్ర కథానాయకుడు రణవీర్ సింగ్ రహస్య పర్యటనలు చేస్తున్నారు. శుక్రవారం మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే రణవీర్ సింగ్ ముంబై నుండి నేరుగా విమానంలో నాగపూర్ వెళ్ళి అక్కడి ఆర్.ఎస్.ఎస్. ప్రధాన కార్యాలయంలో సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్‌ను కలిశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో సాయంత్రం 4 గంటలకు దిగిన రణవీర్ సింగ్ డైరెక్ట్‌గా రేషమ్‌బాగ్ లోని ఆర్.ఎస్.ఎస్. ఆఫీస్‌కు చేరుకున్నారు. ఆర్.ఎస్.ఎస్. వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ్ బలీరాం హెడ్గేవార్, ద్వితీయ సర్ సంఘచాలక్ గురుజీ స్మృతివనాన్ని సందర్శించి, నివాళులు అర్పించారు. అనంతరం ప్రస్తుతం ఆర్.ఎస్.ఎస్. సర్ సంఘ్‌చాలక్ మోహన్ భగవత్‌తో రణవీర్ సింగ్ దాదాపు గంటన్నర పాటు చర్చలు జరిపినట్టు తెలిసింది. ఆర్.ఎస్.ఎస్. చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి, దానికి అనుబంధంగా ఉన్న చిత్రభారతి గురించి రణవీర్ సింగ్ తెలుసుకున్నట్టు సమాచారం. ఆర్.ఎస్.ఎస్. సంస్థ ప్రారంభమై వందేళ్ళు పూర్తి అయిన సందర్భంగానూ దసరా రోజున రణవీర్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు.
తన నాగపూర్ పర్యటనను పూర్తిగా రహస్యంగా ఉంచిన రణవీర్ సింగ్ శుక్రవారం రాత్రి 8.15 నిమిషాలకు తిరిగి ఎయిర్ పోర్ట్‌కు చేరి ముంబై ప్రయాణమయ్యారు. మార్చి 19న విడుదలైన 'ధురంధర్ 2' మూవీ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 1600 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీన్ని ప్రాపగాండ మూవీ అని కొందరు విమర్శిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రణవీర్ సింగ్ ఆర్.ఎస్.ఎస్. అధినేతను కలవడం మరింత చర్చనీయాశమైంది. ఇటీవల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సైతం 'ధురంధర్ 2' చిత్రాన్ని విమర్శించిన వారికి గట్టిగా బదులిచ్చాడు. ఇంతకాలంగా చిత్రసీమలో పిల్లులుగా వ్యవహరించిన వారే ఇప్పుడీ విమర్శలు చేస్తున్నారని సందీప్ రెడ్డి వంగా పేర్కొన్నాడు.