అప్పుడు ‘షోలే’.. ఇప్పుడు ‘ధురంధర్’
ABN , Publish Date - Feb 10 , 2026 | 09:15 AM
కొత్త చిత్రాలు వస్తున్నా.. బాక్సాఫీసు దగ్గర పోటీ పెరుగుతున్నా ‘ధురంధర్’ చిత్రం హవా ఇంకా కొనసాగుతూనే ఉంది.
కొత్త చిత్రాలు వస్తున్నా.. బాక్సాఫీసు దగ్గర పోటీ పెరుగుతున్నా ‘ధురంధర్’ (Dhurandhar) చిత్రం హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh), అక్షయ్ ఖన్నా (Akshaye Khanna), సంజయదత్ తదితరులు నటించిన ఈ చిత్రం జోరు తగ్గకుండా రెండు నెలలుగా బాక్సాఫీసు దగ్గర సందడి చేస్తూనే ఉంది. ఓటీటీలో వచ్చిన తర్వాత వసూళ్లు కొంత మేరకు తగ్గాయి కానీ బాక్సాఫీసు దగ్గర ఆ ప్రభావం అలాగే ఉంది. రూ. 280 కోట్లు బడ్జెట్‌తో తయారైన ‘ధురంధర్’ చిత్రం ఇప్పటికే రూ. 1304.5 కోట్లు వసూలు చేసి టాప్ ఫోర్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచింది.
ఆరు గల్ఫ్ దేశాల్లో ఈ సినిమాను నిషేధించారు కానీ లేకపోతే మరో రూ. వంద కోట్లు అదనంగా వసూలు చేసి ఉండేదేమో. చిత్ర నిర్మాత జ్యోతి దేశ్‌పాండే తమ సినిమా సక్సెస్ పై ఆనందం వ్యక్తం చేస్తూ ‘యాభై ఏళ్ల క్రితం వచ్చిన ‘షోలే’ సినిమాను జనం పదేపదే చూశారు. అందులో నటుల గురించి, డైలాగుల గురించి ఎంతో చెప్పుకున్నారు. మళ్లీ ఇంతకాలానికి ‘ధురంధర్’ చిత్రానికి అటువంటి ఘనత దక్కింది. రెండు నెలలుగా మా సినిమాను చూసిన వాళ్లే మళ్లీ మళ్లీ చూశారు. ఇటువంటి రికార్డు మరే చిత్రానికీ లేదని చెప్పగలను. ఈ విజయం మాది కాదు.. ప్రేక్షకులది. డబ్బుతో కొనలేని విజయం ఇది’ అని అన్నారు.
మార్చి 19న విడుదలయ్యే ‘ధురంధర్ 2’ చిత్రం మీద జ్యోతి పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఆదిత్య ధర్ (Aditya Dhar) దర్శకత్వంలో ‘ధురంధర్’ చిత్రం రెండు భాగాలను ఒకేసారి షూట్ చేశాం. అయితే మొదటి భాగం విజయం సాధించి ఉండకపోతే రెండో భాగం విషయం మరచిపోయే వాళ్లం. కానీ మా సినిమా హిట్ అవుతుందనే నమ్మకం ముందు నుంచీ ఉంది. రెండో భాగం మరింత ఆకట్టుకుంటుందని నా నమ్మకం. అందుకే ఐదు భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నాం’ అని చెప్పారు జ్యోతి పాండే. మార్చి 19న ‘ధురంధర్ 2’ తెలుగులోనూ విడుదల కానుంది.