ప్రియాంక చోప్రా కంబ్యాక్.. ఈసారి నిర్మాతగా

ABN , Publish Date - Nov 08 , 2026 | 03:29 PM

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బాలీవుడ్ బ్యూటీ పెళ్లి తరువాత అమెరికా చెక్కేసి గ్లోబల్ బ్యూటీగా పేరుతెచ్చుకుంది.

Priyanka Chopra

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బాలీవుడ్ బ్యూటీ పెళ్లి తరువాత అమెరికా చెక్కేసి గ్లోబల్ బ్యూటీగా పేరుతెచ్చుకుంది. అక్కడే హాలీవుడ్ మూవీస్ చేస్తూ బిజీగా మారింది. ఇక బాలీవుడ్‌లో పరిమిత ఆఫర్ల కారణంగా హాలీవుడ్ ప్రాజెక్టులపైనే దృష్టి సారించిన ఆమె, 2019లో వచ్చిన ది స్కై ఈజ్ పింక్ తర్వాత మరే భారతీయ సినిమాలోనూ నటించలేదు. అయితే దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పాన్-వరల్డ్ అడ్వెంచర్ డ్రామా ‘వారణాసి’ (Varanasi) తనకు మంచి కమ్ బ్యాక్ అవుతోందని నమ్మి గట్టి రీఎంట్రీ ప్లాన్ చేసింది. సూపర్‌స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో ఆమె మందాకిని అనే శక్తివంతమైన పాత్రలో కనిపిస్తున్నారు. నటిగా ఆమె సంతకం చేసిన ఏకైక భారతీయ చిత్రం ఇదే కావడంతో అభిమానుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.


మరొకవైపు, ప్రియాంక చోప్రా కేవలం నటిగానే కాకుండా తన సొంత నిర్మాణ సంస్థ పర్పుల్ పెబుల్ పిక్చర్స్ ద్వారా చిత్ర నిర్మాణంలోనూ బిజీగా మారిన విషయం తెల్సిందే. 2016లో జాతీయ అవార్డుతో పాటు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన మరాఠీ చిత్రం వెంటిలేటర్ కి సీక్వెల్‌గా వెంటిలేటర్ 2ను ఆమె అధికారికంగా ప్రకటించింది. మొదటి భాగానికి దర్శకత్వం వహించిన రాజేష్ మాపుస్కర్ ఈ సీక్వెల్‌ను కూడా తెరకెక్కించనున్నాడు. ప్రియాంక చోప్రా, ఆమె తల్లి డాక్టర్ మధు చోప్రా, రాజేష్ కలసి జాయింట్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


అయితే ఈ వెంటిలేటర్ 2 విషయంలో ఒక ముఖ్యమైన స్పష్టత వచ్చింది. ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో కేవలం నిర్మాతగా మాత్రమే బాధ్యతలు నిర్వహిస్తున్నారని, సినిమాలో ఆమె ఎలాంటి పాత్రలోనూ నటించడం లేదని నిర్మాణ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రొడక్షన్ విలువలకు, కంటెంట్ డ్రివెన్ సినిమాలకు ప్రాధాన్యతనిస్తూ నిర్మిస్తున్న ఈ సీక్వెల్ 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజమౌళి వారణాసి విజ్యూవల్ వండర్‌లో నటించడంతో పాటు, ఇలాంటి అవార్డ్ విన్నింగ్ ప్రాంచైజీని నిర్మించడం ద్వారా ప్రియాంక ఇటు నటిగా, అటు నిర్మాతగా భారతీయ సినిమాపై తన ముద్రను మళ్లీ బలపరుస్తుంది.


మొత్తానికి ఎస్.ఎస్. రాజమౌళి - మహేష్ బాబు కలయికలో రాబోతున్న వారణాసి సినిమా ప్రియాంక చోప్రా కేరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌గా నిలవనుంది. ప్రపంచవ్యాప్తంగా విభిన్న ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ గ్లోబ్‌ట్రోటింగ్ అడ్వెంచర్ ఫిలింలో ఆమె హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్, స్లో-మోషన్ జంప్స్‌తో అదరగొట్టనుందని టాక్. ఒకవైపు గ్లోబల్ ప్రాజెక్ట్‌లు, మరోవైపు ఇండియన్ మైలురాయి చిత్రాలతో ప్రియాంక రీ-ఎంట్రీ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. మరి అటు నటిగా.. ఇటు నిర్మాతగా ఈ గ్లోబల్ బ్యూటీ రీఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి.

Updated Date - Nov 08 , 2026 | 03:29 PM