Shaque Review: కూతురు కోసం తల్లి పోరాటం.. ఆఖరి ట్విస్ట్ ఊహించలేరు
ABN , Publish Date - Sep 27 , 2026 | 05:56 PM
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా పెళ్లి తరువాత వెబ్ సిరీస్ తో ఎంట్రీ ఇచ్చింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ క్రైమ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ షక్: ట్రస్ట్ నో వన్ (Shaque: Trust No One).
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా పెళ్లి తరువాత వెబ్ సిరీస్ తో ఎంట్రీ ఇచ్చింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ క్రైమ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ షక్: ట్రస్ట్ నో వన్ (Shaque: Trust No One). రెన్సిల్ డిసిల్వా దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను అల్కెమీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సిద్ధార్థ్ పి. మల్హోత్రా, సప్నా మల్హోత్రా సంయుక్తంగా నిర్మించారు.ఈ సిరీస్‌లో పరిణీతి చోప్రాతో పాటు జెన్నిఫర్ వింగెట్, తాహిర్ రాజ్ భాసిన్, సోని రజ్దాన్, అనూప్ సోని, సుమీత్ వ్యాస్, హర్లీన్ సేథి మరియు ధృవ్ చౌదరి కీలక పాత్రల్లో నటించారు. ఈ శుక్రవారం నుంచి షక్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. పరిణీతి చోప్రా మొదటి వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం.
అన్విత దత్ (పరిణీతి చోప్రా), అలోక్ దత్ (తాహిర్ రాజ్ భాసిన్) కి ఆపేక్ష అనే బిడ్డ జన్మిస్తుంది. పుట్టిన వెంటనే ఆపేక్షను ఎవరో ఒక నర్స్ ఎత్తుకెళ్లిపోతుంది. ఆపేక్ష ప్రతి పుట్టినరోజున ఆ చిన్నారి ఎలా ఉంది అని తెలిసేవిధంగా అన్విత ఇంటికి ఫోటోలు వస్తూ ఉంటాయి. సుదీర్ఘ కాలం క్రితం మిస్సయిన తన తొమ్మిదేళ్ల కూతురు బతికే ఉందనే గట్టి నమ్మకంతో అన్విత.. పోలీస్ ఆఫీసర్ ఖురానాతో కలిసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అయితే ఆ విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ, బయటి శత్రువుల కంటే సొంత కుటుంబంలోనే ముసుగు వేసుకున్న క్రిమినల్స్ ఉన్నారని ఆమెకు బోధపడుతుంది. అత్తగారు (సోని రజ్దాన్), భర్త, బంధువుల (జెన్నిఫర్ వింగెట్, సుమీత్ వ్యాస్) రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. ఎవరినీ నమ్మలేని ఈ పరిస్థితుల్లో ఆ తల్లి తన కూతురిని ఎలా కాపాడుకుందనేదే మిగతా కథ.
తొమ్మిదేళ్ల నుంచి తన కూతురు బతికే ఉందనే గట్టి నమ్మకంతో ఒక తల్లి చేసే నిరంతర పోరాటమే ఈ సిరీస్ యొక్క ప్రధాన ఇతివృత్తం. బిడ్డ అన్వేషణలో భాగంగా సొంత కుటుంబ సభ్యులు, అత్తగారు, ఆత్మీయులపైనే ఆమెకు అనుమానాలు వ్యక్తమవ్వడం, ఆ రహస్యాలను ఛేదించే క్రమంలో ఎదురయ్యే ఉత్కంఠభరిత పరిణామాలు కథను ముందుకు నడిపిస్తాయి. పాప ఆచూకీ కోసం వెతుకుతున్న కొద్దీ, బయటి వ్యక్తుల కంటే సొంత కుటుంబంలోనే ముసుగు వేసుకున్న నల్ల త్రాచులు ఉన్నట్లు చూపించే విధానం ఆకట్టుకుంటుంది. కొడుకు జీవితంలోకి మొదటి బిడ్డ వస్తే అపశకునం అని నమ్మి సొంత తల్లి కోడలిపై చేతబడి చేయించడం, డ్రగ్స్ కలిపి ఇవ్వడం ఇంకా మూఢ నమ్మకాలు ఉన్నాయని చూపించినట్లు అనిపిస్తుంది.
ఓటీటీ డిజిటల్ స్పేస్‌లోకి అడుగుపెట్టిన పరిణీతి చోప్రా, బిడ్డ కోసం అలమటించే వేదనను, ఆక్రోశాన్ని తన నటనతో ఎంతో ప్రతిభావంతంగా పండించారు. భావోద్వేగపూరిత సన్నివేశాల్లో ఆమె ప్రదర్శించిన పరిపక్వత ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాహిర్ రాజ్ భాసిన్, సోని రజ్దాన్, హర్లీన్ సేథి తదితర నటీనటులు కూడా తమ పాత్రలకు తగిన రీతిలో న్యాయం చేస్తూ కథనంలో కీలక పాత్ర పోషించారు. దర్శకుడు రెన్సిల్ డిసిల్వా 7 ఎపిసోడ్‌ల పాటు సాగే ఈ సిరీస్‌ను వేగవంతమైన పేసింగ్‌తో నడిపించేందుకు ప్రయత్నించాడు.
అయితే, ఒక పక్కా థ్రిల్లర్‌కు ఉండాల్సిన అతిపెద్ద బలం దాని సస్పెన్స్. ఈ విషయంలో సిరీస్ కొంత నిరాశపరుస్తుంది. కథ ప్రారంభంలోనే అసలు నేరస్థుడు ఎవరనేది ప్రేక్షకులు సులభంగా ఊహించేలా ట్విస్టులు అమర్చడం థ్రిల్ ఎలిమెంట్‌ను తగ్గించేసింది. దీనికితోడు ప్రధాన కిడ్నాప్ డ్రామాతో పాటు సరోగేసి, చేతబడులు, టారో కార్డ్స్, సైకో ఎలిమెంట్స్ వంటి అనేక సబ్‌ప్లాట్లను ఒకేసారి కథలోకి తీసుకురావడంతో, స్క్రీన్‌ప్లే కొంత గందరగోళంగా మారిన భావన కలుగుతుంది. మొత్తానికి, కథనంలో అక్కడక్కడా ప్రెడిక్టబిలిటీ, లాజిక్ లోపాలు ఉన్నప్పటికీ, పరిణీతి చోప్రా అద్భుత నటన సిరీస్‌ను నిలబెట్టింది. సంక్లిష్టమైన ఎమోషన్స్, థ్రిల్లర్ అంశాలతో నడిచే కథలనుష్టపడేవారికి ఇది ఒక మంచి వీకెండ్ వాచ్‌గా నిలుస్తుంది. రొటీన్ థ్రిల్లర్స్ నుంచి కాస్త భిన్నమైన ఎమోషనల్ టచ్ ఉన్న సిరీస్‌లను చూడాలనుకునే ఓటీటీ ప్రియులు నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్‌ను ఒకసారి వీక్షించవచ్చు.