తెరపై కొత్త జంటల జాతర.. స్టార్ హీరోలతో స్టార్ హీరోయిన్లు!

ABN , Publish Date - Nov 23 , 2026 | 10:41 AM

వెండితెరపై కొత్త జంటలు సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఒకే భాషకు పరిమితం కాకుండా వివిధ సినీ పరిశ్రమలకు చెందిన స్టార్ హీరోలు, హీరోయిన్లు జోడీ కడుతున్నారు.

bollywood

తెరపై కొత్త కాంబినేషన్లు ఆవిష్కృతమవుతున్నాయి. దేశంలోని వివిధ భాషలకు చెందిన సూపర్‌ స్టార్స్‌ కలయికలు ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాయి..

సల్మాన్‌ ఖాన్‌ - నయనతార

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్ (Salman Khan) - దక్షిణాది అందాల భామ నయనతార (Nayanthara) తొలిసారిగా కలిసి నటిస్తున్న చిత్రం ‘మాన్‌స్టర్‌’. దిల్‌రాజు బ్యానర్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు. సల్మాన్‌ఖాన్‌, నయనతారకు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ దృష్ట్యా ఈ ప్రాజెక్టు ప్రత్యేకత సంతరించుకుంది. ఈ సినిమాలో సల్మాన్‌ ఖాన్‌కు సమానమైన స్క్రీన్‌ ప్రెజెన్స్‌తో కథను మలుపు తిప్పే పాత్రలో నయనతార కనిపించబోతున్నారని సమాచారం.

ప్రభాస్‌ - త్రిప్తి దిమ్రి

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పాన్‌ ఇండియా యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘స్పిరిట్‌’ చిత్రంలో రెబల్‌స్టార్‌ ప్రభాస్ (Prabhas), త్రిప్తి దిమ్రి (Triptii Dimri) కలిసి నటిస్తున్నారు. వేర్వేరు ఫిల్మ్‌ ఇండస్ట్రీలలో తమ కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటులను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా ఈ చిత్రం ఆసక్తికరమైన కాంబినేషన్‌కు తెర లేపింది. దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న ప్రభాస్‌, ఇటీవలి కాలంలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న త్రిప్తి దిమ్రితో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నారు.

bollywood

అల్లు అర్జున్‌ - దీపిక పదుకొణె

అట్లీ రూపొందిస్తున్న సైంటిఫిక్‌ ఫిక్షన్‌ పాన్‌ ఇండియా చిత్రం ‘రాకా’లో అల్లు అర్జున్ (Allu Arjun), దీపిక పదుకొణె (Deepika Padukone) వెండితెరపై మెరవబోతున్నారు. ‘పుష్ప’ చిత్రంతో పాన్‌ ఇండియా స్థాయికి ఎదిగిన అల్లు అర్జున్‌, ‘కల్కి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన దీపిక ‘రాకా’ కోసం కలిశారు. భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కార్తీక్‌ ఆర్యన్‌ - శ్రీలీల

భూషణ్‌ కుమార్‌ నిర్మాణంలో అనురాగ్‌ బసు తెరకెక్కిస్తోన్న రొమాంటిక్‌ మ్యూజికల్‌ డ్రామా ‘తు మేరీ జిందగీ హై’. కార్తీక్‌ ఆర్యన్ (Kartik Aaryan), శ్రీలీల (Sreeleela) ఈ చిత్రంలో తొలిసారి కలిసి నటిస్తున్నారు. కార్తీక్‌ ఆర్యన్‌ రొమాంటిక్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్‌, శ్రీలీల యూత్‌ఫుల్‌ ఎనర్జీ కలిసి తెరపై ఓ అద్భుత దృశ్య కావ్యం ఆవిష్కృతం అవుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. కనువిందైన ఈ జంట రొమాన్స్‌కు తోడు వినసొంపైన సంగీతం ఈ చిత్రానికి మెయిన్‌ అస్సెట్‌ కానుంది. ఇప్పటికే ఈ చిత్రంపై బాలీవుడ్‌లో అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి.

Updated Date - Nov 23 , 2026 | 10:56 AM