Dhurandhar: నాగ్ చేజార్చుకున్న గొప్ప అవకాశం
ABN , Publish Date - Jan 19 , 2026 | 04:09 PM
కింగ్ నాగార్జున ఇటీవల ఓ గొప్ప ఛాన్స్ ను మిస్ చేసుకున్నాడు. 'కూలీ, కుబేర' సినిమాల్లో నటిస్తున్న సమయంలో నాగార్జున కు 'దురంధర్'లోనూ అవకాశం వచ్చిందట. కాకపోతే డేట్స్ అడ్జెస్ట్ చేయలేక నాగార్జున ఆ సినిమాను వదులుకున్నారట.
'దానే దానే పే లిఖా హై ఖానే వాలే కా నామ్' అంటారు. మనం తినే ప్రతి గింజపైనా మన పేరు రాసి ఉంటుందట. అలానే ఏ నటుడు ఏ పాత్ర చేయాలో కూడా బహుశా ముందే రాసిపెట్టి ఉంటుందేమో! కొన్ని పాత్రలు చేజారిపోయినప్పుడు 'మనకు రాసి పెట్టి లేదు' అని అనుకోవడంలో తెలియని ఓదార్పు లభిస్తుంది. ఎందుకంటే... చాలామంది నటులు ఏదో కారణంగా వదిలేసుకున్న పాత్రలు ఆ తర్వాత అద్భుతంగా చరిత్రలో నిలిచిపోవడం, ఆ సినిమాలు ఘన విజయం సాధించడం జరుగుతుంటుంది. అలాంటి సమయంలో కలిగే వేదన నుండి ఓదార్పును కలిగిచేవి ఇలాంటి మాటలే.
ఇంతకూ విషయం ఏమిటంటే... సీనియర్ హీరో నాగార్జున (Nagarjuna) విషయంలో ఇటీవల అలాంటిదే ఒకటి జరిగింది. నాగార్జున ఇటు 'కుబేర' (Kubera), అటు 'కూలీ' (Coolie) సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్న సమయంలో బాలీవుడ్ నుండి ఆయనకో ఆఫర్ వచ్చిందట. కానీ డేట్స్ ఖాళీ లేక నాగ్ దానిని వదులుకున్నాడట. ఇప్పుడు గొప్ప ఛాన్స్ మిస్ అయ్యానని ఆయన బయటకు అనుకోకపోయినా... లోలోపల బాధపడుతూ ఉండొచ్చు. అసలు సంగతి కొస్తే... గత యేడాది బాలీవుడ్ లో పాత రికార్డులను చెరిపేసి సరికొత్త రికార్డులను సృష్టించిన సినిమా 'దురంధర్'. పాకిస్థాన్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న భారత్ సీక్రెట్ ఏజెంట్స్ కు సంబంధించిన ఈ చిత్రం అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. రణవీర్ సింగ్ (Ranveer Singh) హీరోగా గొప్ప పేరు తెచ్చుకున్నా, అందులో ప్రతినాయకుడి పాత్ర చేసిన అక్షయ్ ఖన్నా (Akshaye Khanna) కు అంతకంటే మంచి పేరు వచ్చింది. పాకిస్థాన్ లోని తీవ్రవాది రహమాన్ డకాయిత్ పాత్రను అక్షయ్ ఖన్నా పోషించాడు. కొన్ని సన్నివేశాల్లో అక్షయ్ ఖన్నాను చూస్తే ఒళ్ళు గగుర్పొడిచిందని అన్నవాళ్ళూ లేకపోలేదు! అయితే దర్శకుడు ఆదిత్య ధర్ తొలుత ఈ పాత్రను అక్కినేని నాగార్జునతో చేయించాలని అనుకున్నాడట. కానీ ముందు చెప్పినట్టు నాగార్జున రెండు పాన్ ఇండియా సినిమాల షూటింగ్స్ తో బిజీ ఉన్న కారణంగా దర్శకుడికి తన నిస్సహాయతను తెలియచేశాడట. దాంతో ఆదిత్య ధర్... అక్షయ్ ఖన్నాను తీసుకున్నారని ఆ చిత్ర బృందం ఇటీవల తెలిపింది.
చాలామంది చెబుతున్న మాట ఏమిటంటే... ఆ పాత్రను అక్షయ్ ఖన్నా చేయడం వల్ల మూవీ మరో స్థాయి విజయాన్ని నమోదు చేసుకుందని, నాగార్జున అయితే అంతలా దానికి న్యాయం చేసేవారు కాదని కొందరు అంటున్నారు. నాగార్జున సైతం ఇలాంటి పాత్రను తనదైన ఫ్లేవర్ తో చేసి మెప్పించేవాడని భావిస్తున్న వారూ లేకపోలేదు. నిజంగా నాగ్ ఆ పాత్రను చేసి ఉంటే... ఇవాళ మరోసారి నాగార్జున సత్తా హిందీ వాళ్ళకు తెలిసి ఉండేది. ఎందుకంటే ఇప్పటికే నాగార్జున హిందీలో పలు చిత్రాలలో నటించాడు. అయితే ఈ మధ్య కాలంలో నాగార్జున హిందీలో చేసిన సినిమాలేవీ పెద్దంతగా ఆడలేదు. ఆ లోటు 'దురంధర్'తో తీరిపోయి ఉండేది.