Jay Bhanushali-Mahhi Vij: విడాకులు తీసుకోబోతున్న మహి...
ABN , Publish Date - Jan 04 , 2026 | 04:34 PM
తెలుగు, కన్నడ, మలయళ చిత్రాల్లో నటించిన మహి విజ్ తన భర్త జయ్ భానుశాలికి విడాకులు ఇవ్వబోతోంది. 'బాలికా వధు'తో పాటు పలు సీరియల్స్ లో మహి నటించింది.
'తపన' సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టిన మహి విజ్ (Mahi Vij) ఆ తర్వాత మలయాళ, కన్నడ సినిమాల్లోనూ నటించింది. అయితే దానికి ముందు, తర్వాత కూడా టీవీ సీరియల్స్ లో నటించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఆమె వివాహం పద్నాలుగేళ్ళ క్రితం నటుడు జయ్ భానుశాలి (Jay Bhanushali) తో జరిగింది. ఇప్పుడు వీరిద్దరూ విడిపోతున్నట్టుగా ప్రకటించారు. అయితే గత కొంతకాలంగా వీరు విడిపోతున్నట్టుగా మీడియా ప్రచారం జరుగుతోంది. ఆ వార్తలలో నిజం ముందనేది ఇప్పుడు నిరూపణ అయ్యింది. అయితే ఒకరిపై మరొకరు ప్రత్యారోపణలు చేసుకోకుండా హుందాగా తాము పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్టు వీరు ప్రకటించారు. తమ పిల్లల ప్రైవసీని దృష్టిలో పెట్టుకుని మీడియాకెక్కి అల్లరి చేసుకోకుండా హుందాగా తమ విడాకుల విషయాన్ని తెలియచేశారు. టీవీ సీరియల్స్ లో నటిస్తున్నప్పుడు ఒకరిపై ఒకరు ఆకర్షితులై, ఆ తర్వాత పెళ్ళి పీటలు ఎక్కారు. పద్నాలుగేళ్ళ వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా ముందుకు సాగారు. కానీ ఇప్పుడు తమ రిలేషన్ కు బ్రేక్ చెప్పాల్సిన పరిస్థితి వచ్చినట్టు వారు భావించారు.
జై భానుషాలి టీవీ షోస్ తో ఎక్కువ పేరు సంపాదించుకున్నాడు. అలానే డాన్స్ ఇండియా డాన్స్, డాన్స్ ఇండియా డాన్స్ లిటిల్ మాస్టర్స్ కార్యక్రమాలతో పాటు అవార్డ్స్ షోస్ కు అతను హోస్ట్ గా చేశాడు. ఇక 2014లో హేట్ స్టోరీ 2తో నటుడిగా వెండితెరకు పరిచయం అయ్యాడు. ఆ సమయంలోనే 'దేశీ కట్టే, ఏక్ పెహలీ లీలా' చిత్రాలలోనూ నటించాడు. 2025లో 'బీ హ్యాపీ'లో కనిపించాడు. ఇక మహి విజ్ 'లాగీ తుఝే లగాన్, బాలికా వధు' వంటి సీరియల్స్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 'దుష్మనీ' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మహి మలయాళంలోన 'అపరిచితన్' (Aparichithan) సినిమాలో నటించింది. తెలుగులో 'తపన' (Thapana) సినిమా, కన్నడలో 'గంగా కావేరీ' (Ganga Kaveri) చిత్రాల్లో యాక్ట్ చేసింది. 2025లో 'కౌసర్' (Kausar) సీరిస్ లో యాక్ట్ చేసింది. పలు రియాల్టీషోస్ లో పాల్గొనడమే కాకుండా బ్రాండ్ అంబాసిడర్ గానూ వర్క్ చేసింది. మోడల్ గానూ మహికి మంచి గుర్తింపే ఉంది.