పరువు తీసేసిన పాట.. పార్ల‌మెంట్‌లో ర‌చ్చ ర‌చ్చ‌! సినిమా నుంచి త‌ప్పుకున్న‌.. హీరోయిన్‌

ABN , Publish Date - Mar 19 , 2026 | 07:53 AM

సినిమా పాట అంటే మనసుకు హత్తుకొనే విధంగా ఉండాలి. శ్రుతిమించని రీతిలో పద ప్రయోగం ఉంటూ గిలిగింతలు పెట్టే రీతిలో పాట ఉండాలి కానీ ఓ హద్దు దాటితే తీవ్ర పరిణామాలు ఉంటాయి.

KD The Devil,

సినిమా పాట అంటే మనసుకు హత్తుకొనే విధంగా ఉండాలి. శ్రుతిమించని రీతిలో పద ప్రయోగం ఉంటూ గిలిగింతలు పెట్టే రీతిలో పాట ఉండాలి కానీ ఓ హద్దు దాటితే తీవ్ర పరిణామాలు ఉంటాయి. అందుకే తాజా ఉదాహరణ కన్నడ సినిమా ‘కేడీ: ద డెవిల్‌’(KD movie) లోని హిందీ వెర్షన్‌ పాటే. బాలీవుడ్‌ నటి నోరా ఫతేహి పాల్గొన్న పాట ఇది. ఒక్కోసారి డబుల్‌ మీనింగ్‌ పదాలతో పాట ఉంటే దుంప తెంచుతుందని ఈ పాట రుజువు చేసింది.

‘సర్కే చునార్‌ తేరీ సర్కే (జరిపెయ్‌ నాతో పండగ జరిపెయ్‌) (Sarke Chunar Teri Sarke) అంటూ సాగే ఈ పాట వివాదాస్పదం అయింది. చివరికి ఈ పాట గురించి పార్లమెంట్‌లో చర్చ కూడా జరిగిందంటే దాని తీవ్రత ఎంతుందో అర్థం చేసుకోవచ్చు.. సమాజ్‌వాద్‌ పార్టీ ఎంపీ ఆనంద్‌ భదౌరియా ఈ పాట విషయాన్ని లోక్‌సభలో ప్రస్తావించారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) భావ వ్యక్తీకరణ హద్దుల్లో ఉండాలని సూచించారు. హద్దు మీరినందువల్లే ఈ పాటను బ్యాన్‌ చేసినట్లు తెలిపారు.

తాజాగా ఈ వివాదంపై నటి నోరా ఫతేహి (Nora Fatehi) స్పందించారు. ఈ సినిమా నుంచి వైదోలుగుతున్నట్లు తెలిపారు. ‘ఈ సినిమా కన్నడ వెర్షన్‌ షూటింగ్‌ మూడేళ్ల క్రితం జరిగింది. అప్పుడు నాకు కన్నడ అర్థం కాదు కాబట్టి వారు చెప్పిన దానిపైనే ఆధార పడాల్సి వచ్చింది. ఆ సమయంలో అనువాదం చేసినప్పుడు అసభ్యకరంగా ఉన్నట్లు అనిపించలేదు.

ఈ పాట హిందీ వెర్షన్‌లో జరిగిన మార్పుల గురించి నాకు తెలియదు. ఈ విషయంలో మేకర్స్‌ నా అనుమతి తీసుకోలేదు. ఈ పాట హిందీ వెర్షన్‌ చూసిన తర్వాతే అందులోని సాహిత్యం ఇంత దారుణంగా ఉందని తెలిసింది. ఈ పాటలోని సాహిత్యం మహిళల గౌరవానికి భంగం కలిగించేలా, డబుల్‌ మీనింగ్‌తో ఉండడం చూసి ఎంతో కలత చెందా. అందుకే ఈ చిత్రం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా’ అని పేర్కొన్నారు.

దర్శకుడిని సమర్ధించిన రక్షిత

మరోవైపు ఈ సినిమా దర్శకుడు ప్రేమ్ (Prem) సతీమణి, నటి రక్షిత (Rakshita) కూడా ఈ వివాదంపై స్పందించారు. ‘నేను అన్నీ చూస్తున్నాను. చాలామంది నన్ను రకరకాల పోస్టుల్లో ట్యాగ్‌ చేస్తున్నారు. ఈ పాట విషయంలో నా వ్యక్తిగత అభిప్రాయం పక్కనపెడితే.. గతంలో ‘పీలింగ్స్‌’, డ్రీమమ్‌ వేకపమ్‌’, చోళీ కే పీచే’ వంటి వందలాది పాటలు వచ్చినా అందరికీ అవి సాధారణంగా అనిపించాయి. శృంగారమే ప్రధానాంశంగా వచ్చిన సినిమాలతోనూ ఎవ్వరికీ ఏ ఇబ్బందీ కలగలేదు. కానీ ఈ ఒక్క పాటపై ఇంత గందరగోళం ఎందుకు జరుగుతోందో అర్థం కావడం లేదు. నేను దీన్ని సమర్థించడం లేదు కానీ ఈ వివక్షను అర్థం చేసుకోవాలని కోరుతున్నాను.

నా భర్తను ఈ పాట విషయంలో ప్రశ్నించే హక్కు మీకు ఉంది. కానీ దూషించడం సరైనది కాదు. ఒక్క పాట వల్ల ఆయన చెడ్డవారు అయిపోరు. రాబోయే రోజుల్లో అంతా సద్దుమణుగుతుందని ఆశిస్తున్నాను. మాకు కొంచెం సమయం ఇవ్వండి. ఈ సినిమా మాకు బిడ్డలాంటిది. చివరకు ఏది సరైనదో మేము అదే చేస్తాం.. మమ్మల్ని నమ్మండి.. ప్రేమతో ప్రతీది సాధ్యమే’ అని అన్నారు. ధ్రువ్‌ సర్జా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 30న విడుదలవుతోంది. ఇందులో కీలక పాత్రలు పోషించిన సంజయ్‌దత్‌, నోరా ఫతేహిపై చిత్రీకరించిన గీతమే ‘సర్కే చునర్‌’. ఇటీవలే ఈ పాట లిరికల్‌ వీడియో విడుదలైనప్పటినుంచి వివాదం మొదలైంది.

క్షమాపణలు చెప్పిన మంగ్లీ

ఈ పాట పాడిన గాయని మంగ్లీ (Mangli) పై కూడా విమర్శలు వచ్చాయి. దీనిపై ఆమె స్పందించారు. ఈ మేరకు సోషల్‌మీడియలో పోస్టు పెట్టారు. ‘ఈ పాట విషయంలో జరిగిన దానికి చింతిస్తున్నాం. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలన్న ఉద్దేశం మాకు లేదు. అనుకోకుండా జరిగిన ఈ పొరపాటుకు అందరికీ క్షమాపణలు తెలియజేస్తున్నాను. ప్రజల మనోభావాలను గౌరవించి అన్ని వేదికల నుంచి ఈ పాటను తొలిగించాము. లిరిక్స్‌లో మార్పు చేశాము. త్వరలోనే ఈ పాట కొత్త వెర్షన్‌ వస్తుంది. మరోసారి ఇలా జరగదని హామీ ఇస్తున్నా’ అని అన్నారు.

Updated Date - Mar 19 , 2026 | 08:05 AM