Kareena Kapoor: సైఫ్ పై కత్తి దాడి.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Nov 05 , 2026 | 05:46 PM

బాలీవుడ్ నటి  కరీనా కపూర్‌ ఖాన్‌  భావోద్వేగానికి గురయ్యారు. తన భర్త  సైఫ్ అలీఖాన్‌ కత్తి దాడికి గురైనప్పుడు సహాయం కోసం రోడ్డుపై పిచ్చిదానిలా పరిగెత్తినట్లు ఆమె చెప్పారు.

బాలీవుడ్ నటి  కరీనా కపూర్‌ ఖాన్‌  భావోద్వేగానికి గురయ్యారు. తన భర్త  సైఫ్ అలీఖాన్‌ (Saif Ali Khan) కత్తి దాడికి గురైనప్పుడు సహాయం కోసం రోడ్డుపై పిచ్చిదానిలా పరిగెత్తినట్లు (Kareena Kapoor) ఆమె చెప్పారు. ఆ టైం లో అంత అగమ్యగోచరంగా ఉందని చెప్పుకొచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి చేసిన దాడిలో గాయపడి రక్తంలో తడిసి ముద్దైన సైఫ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సాయం అందించాలంటూ గట్టిగా కేకలు వేసినట్లు ఆమె చెప్పారు.  గతేడాది జనవరిలో అర్థ రాత్రి  2 గంటల సమయంలో ఓ దుండగుడు ముంబయిలోని సైఫ్‌ అలీఖాన్‌ నివాసంలోకి చొరబడి దాడికి దిగిన  సంగతి తెలిసిందే. ఈ ఘటనతో బాలీవుడ్‌ ఉలిక్కి పడింది. ఆ భయంకరమైన రాత్రి జరిగిన పరిణామాల గురించి  తాజాగా ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో ఈ జంట  పంచుకుంది. ‘ఇలాంటి ఘటనలు సినిమాల్లో చూస్తుంటాం. మాకు కూడా అదే అనిపించింది. దాడి జరిగిన సమయంలో నేను నైట్‌ టీషర్ట్‌లోనే ఉన్నా. పైజామా వేసుకునే టైం కూడా దొరకలేదు. అదే డ్రెస్ తో రోడ్డు మీదకి  పరిగెత్తుకొచ్చాను. గట్టిగా అరుస్తూ రోడ్డుపై వెళ్లే ప్రతి వెహికల్ ను ఆపాను. దీనిని ఎవరు గమనించలేదు. అదృష్టవశాత్తూ ఎవరూ ఆరోజు వీడియోలు  తీయలేదు. సైఫ్‌ రక్తం మడుగులో ఉంటే  పిచ్చిదానిలా రోడ్డుపై పరిగెత్తా. దాడి జరిగిన సమయంలో సైఫ్‌ ఎంతో ధైర్యంగా ఉన్నారు. ఆస్పత్రి నుంచి బయటకు వచ్చేప్పుడు కూడా ఆయన్ను చూసి చాలామంది కామెంట్స్ చేశారు.  ఆ ఘటన మా  కుటుంబంపై తీవ్ర ప్రభావం చూపింది. దాదాపు ఆరు నెలల పాటు సరిగ్గా నిద్రపోలేదు' అని కారం అడిగిన ప్రశ్నలకు  కరీనా సమాధానమిచ్చారు. 

సైఫ్ మాట్లాడుతూ 'ఆ సమయంలో నా పరిస్థితి చూసిన తైమూర్‌ భయపడిపోయాడు. కత్తి గాయాలతో ఉన్న నన్ను చూసి వణికిపోయాడు. నాన్నా.. నువ్వు చనిపోతావా? అని అడిగాడు. కత్తి  షార్ప్ గా  ఉంటే బతికేవాడిని కాదేమో.  కత్తుల చరిత్రలోనే అదొక నాసిరకం కత్తి. అందుకే విరిగిపోయింది. తైమూర్ పై దాడి జరగకుండా అడ్డుకునే సమయంలో దుండగుడు నాపై  దాదాపు పది సార్లు కత్తితో దాడి చేసాడు' అని తెలిపారు.

Updated Date - Nov 05 , 2026 | 05:50 PM