రణ్‌వీర్‌పై.. నిషేధం ఎత్తివేత‌! రాంగోపాల్ వ‌ర్మ‌.. క్ష‌మాప‌ణ చెప్పాలి

ABN , Publish Date - Jun 04 , 2026 | 07:09 AM

‘డాన్‌ 3’ (don 3) సినిమా నుంచి వైదొలగడంతో హీరో రణ్‌వీర్‌ సింగ్ పై ఎఫ్‌డబ్లూఐసీఈ (ఫెడరేషన్‌ ఆఫ్‌ వెస్ట్రన్‌ ఇండియా సినీ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌) నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

Ranveer Singh

‘డాన్‌ 3’ (don 3) సినిమా నుంచి వైదొలగడంతో హీరో రణ్‌వీర్‌ సింగ్ (ranveer singh)పై ఎఫ్‌డబ్లూఐసీఈ (ఫెడరేషన్‌ ఆఫ్‌ వెస్ట్రన్‌ ఇండియా సినీ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌) (FWICE) నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయనపై విధించిన నాన్ కో ఆపరేటివ్‌ డైరెక్టివ్‌ను ఉపసంహరించుకున్నట్లు బుధవారం ఎఫ్‌డబ్లూఐసీఈ అధ్యక్షుడు బీఎన్‌ తివారీ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఎఫ్‌డబ్లూఐసీఈ’కు రణ్‌వీర్‌ లీగల్‌ నోటీసులు పంపిన అనంతరం ప్రెస్‌మీట్‌ నిర్వహించి ఈ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ విషయంలో ఎవరికీ విజయం దక్కలేదని, అలాగని హాని కూడా కలగలేదని చెప్పారు. నటుడిగా రణ్‌వీర్‌ విజయాలను సెలబ్రేట్‌ చేసుకున్నామని, ఆయన మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. భారతీయ నిర్మాతల సంఘం ఈ విషయంలో జోక్యం చేసుకోవడం మంచి పరిణామమని పేర్కొన్నారు. రణ్‌వీర్‌, ‘డాన్‌ 3’ మేకర్స్‌ కలసి ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ విషయంలో రణ్‌వీర్‌ నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు ఎఫ్‌డబ్లూఐసీఈ ఛీఫ్‌ అడ్వైజర్‌ అశోక్‌ పండిట్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

తనపై ఉన్న నిషేధాన్ని ఉపసంహరించుకోవాలని రణ్‌వీర్‌ కోరినట్లు ఆయన తెలిపారు. మరోవైపు, ఇండియన్‌ మోషన్‌ పిక్చర్స్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌ కూడా ఈ విషయంపై పరోక్షంగా స్పందించింది. అంగీకరించిన సినిమాల నుంచి నటీనటులు ఆఖరి నిమిషంలో వైదొలగడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి నిర్ణయాలు తీసుకునేవారు తీవ్రమైన పర్యావసానాలు ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది.

కాగా, రణ్‌వీర్‌కు మద్దతు తెలుపుతూ ‘ఎఫ్‌డబ్లూఐసీఈ’ను బ్యాన్‌ చేయాలని ఆ సంస్థపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసిన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తీరును అశోక్‌ పండిట్‌ తప్పుబట్టారు. తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘ఆఫీసర్‌’ సినిమా విడుదలైన సమయంలో ఆయన కార్మికులకు, టెక్నిషియన్లకు రూ.1.25 కోట్లు బాకీ ఉన్నారని.. ఇప్పటికీ దానిని తీర్చలేదని గుర్తు చేశారు.

Updated Date - Jun 04 , 2026 | 07:34 AM