'దృశ్యం 3'లో.. ప్రకాశ్ రాజ్

ABN , Publish Date - Feb 11 , 2026 | 12:25 PM

అజయ్ దేవ్ గన్, టబు కీలక పాత్రలు పోషిస్తున్న 'దృశ్యం 3' షూటింగ్ మొదలైంది. ఈ సినిమా నుంచి అక్షయ్ ఖన్నా వైదొలగగా, ప్రకాశ్‌ రాజ్ వచ్చి చేరారు.

Prakash Raj

జాతీయ ఉత్తమ నటుడు ప్రకాశ్‌ రాజ్ (Prakash Raj) హిందీ సినిమా 'దృశ్యం 3' (Drishyam 3) కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అజయ్ దేవ్‌గన్‌, టబు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొదలైన కొద్దిరోజులకే ప్రకాశ్‌ రాజ్ ఎంట్రీ ఇవ్వడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే డిసెంబర్ లో 'దృశ్యం 3' నుంచి అక్షయ్ ఖన్నా (Akshaye Khanna) వైదొలగారు. 'ధురంధర్' (Dhurandhar) సినిమా విడుదలకు ఒక్క రోజు ముందు ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు. దీనికి ముందు పలుమార్లు అక్షయ్ ఖన్నాతో 'దృశ్యం 3' లోని పాత్రకు సంబంధించి చర్చలు జరిపామని, అక్షయ్ ఖన్నా విగ్గు లేకుండా నటించడానికి అంగీకరించలేదని, దర్శకుడు ఆయన్ని ఒప్పించే ప్రయత్నం చేసినా, పక్కనున్న వారు పడనివ్వలేదని నిర్మాత వాపోయారు. 'దృశ్యం 2' సినిమాలో బట్టతలతోనే అక్షయ్ ఖన్నా నటించారు. అయితే 'దృశ్యం 3' విషయానికి వచ్చే సరికి ఆయన తన పాత్ర రూపురేఖల విషయంలో పట్టుబట్టినట్టు తెలుస్తోంది. దర్శకుడు అభిషేక్ పాఠక్ 'విగ్గు పెట్టుకుంటే పాత్ర కంటిన్యుటీ దెబ్బతింటుందని, విగ్గు లేకుండానే నటించాల'ని ఒత్తిడి చేశారని, అందుకే అక్షయ్ ఖన్నా సినిమా నుంచి తప్పుకున్నారని అంటున్నారు. ఇప్పుడీ సినిమాలోకి ప్రకాశ్‌ రాజ్ ఎంట్రీ ఇవ్వడంతో అక్షయ్ ఖన్నా పాత్రనే ఆయన చేస్తున్నారనే ప్రచారం జరిగింది. అయితే దానికి కూడా ప్రకాశ్‌ రాజ్ వివరణ ఇచ్చారు. 'దృశ్యం 3'లో తాను నటిస్తున్నానని, అయితే ఎవరి స్థానాన్నో తాను భర్తీ చేయడం లేదని స్పష్టం చేశారు.


మలయాళంలో మోహన్ లాల్ నటించిన 'దృశ్యం', 'దృశ్యం 2' చిత్రాలు వివిధ భాషల్లో రీమేక్ అయ్యాయి. 'దృశ్యం 3' విషయానికి వచ్చే సరికి  మలయాళ మాతృకతో సంబంధం లేకుండా అజయ్ దేవ్‌గన్‌ తన టీమ్‌తో సొంతంగా దీన్ని మొదలు పెట్టారు. మోహన్ లాల్ నటిస్తున్న మలయాళ 'దృశ్యం 3' ఏప్రిల్ 2న విడుదల కాబోతుండగా, అజయ్ దేవ్‌గన్‌ హిందీ 'దృశ్యం 3' అక్టోబర్ 2న విడుదల కానుంది. మరి ఈ రెండు సినిమాలకు ఎలాంటి విజయం లభిస్తుందో వేచి చూడాలి.

Updated Date - Feb 11 , 2026 | 08:21 PM