ధురంధర్‌ 2 పేరుతో పలు రికార్డులు!

ABN , Publish Date - Apr 03 , 2026 | 06:16 PM

'ధురంధర్‌' రెండు భాగాలతో ఊపిరి పీల్చుకున్న బాలీవుడ్‌... రికార్డుల విషయంలోనూ ఆ సినిమాను ఉన్నత స్థానంలో నిలబెట్టింది. కేవలం రెండు వారాలలో వరల్డ్ వైడ్ ధురంధర్‌ 2 సినిమా 1500 కోట్ల గ్రాస్‌ను వసులూ చేసిందని మేకర్స్ చెబుతున్నారు.

Dhurandhar The Revenge

'ధురంధర్‌' మొదటి, రెండు భాగాలతో హిందీ చిత్ర పరిశ్రమ కాస్తంత ఊపిరి పీల్చుకుంది. హిందీలోనే విడుదలైన మొదటి భాగాన్ని మించి ఇతర భాషల్లోనూ డబ్‌ అయ్యి విడుదలైన రెండో భాగం మరింత భారీ కలెక్షన్స్‌ను సాధించింది. గత కొద్ది రోజులుగా ఈ సినిమా కలెక్షన్స్ సన్నగిల్లాయనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా రెండు వేల కోట్ల మైలురాయిని చేరుతుందా? అనే సందేహం వ్యక్తం అయ్యింది. అయితే తాజాగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రెండు వారాల్లో రూ. 1501 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసిందని మేకర్స్ తెలిపారు. ఇండియాలో ఇంతవరకూ ఈ సినిమా రూ. 1134 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసిందని, రూ. 367 కోట్ల గ్రాస్‌ విదేశాలలో వసూలు అయ్యిందని అంటున్నారు. మొత్తం మీద రూ. 1500 కోట్ల గ్రాస్‌ను రెండు వారాల్లో అందుకున్న ఈ సినిమా అతి త్వరలోనే రెండు వేల కోట్ల క్లబ్‌లో చేరుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


'ధురంధర్‌' సినిమా కంటెంట్‌ కారణంగా అరబ్ కంట్రీస్‌లో ప్రదర్శనకు నోచుకోలేదు. ఒకవేళ అదే జరిగి ఉంటే... ఖచ్చితంగా ఇప్పటికీ ఈ సినిమా కనీసం రూ. 1800 కోట్ల మైలురాయిని దాటి ఉండేదని వారి అంచనా. అయితే భారత్‌లో గ్రాస్‌ కాకుండా నెట్ కలెక్షన్స్‌ను పరిగణనలోకి తీసుకున్నా, రెండు వారాల్లో ఈ సినిమా రూ. 961 కోట్లను వసూలు చేసిందట. సో.. వెయ్యి కోట్ల నెట్‌ వసూలుకి అతి కొద్ది దూరంలోనే ఉంది! ఈ రికార్డ్‌ 'ధురంధర్‌ 2' సొంతమని, భారత్‌లో రెండు వారాల్లో ఏ సినిమా కూడా ఈ స్థాయి వసూళ్ళను పొందలేదని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమా సాధించిన ఇతర రికార్డులను ఏకరువు పెడుతూ, హిందీ చిత్రాలలో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా, అత్యధిక ప్రివ్యూలను ప్రదర్శితమైన సినిమాగా, బిగ్గెస్ట్‌ ఓపెనింగ్‌ వీకెండ్ కలెక్షన్స్ సాధించిన మూవీగా, హైయ్యెస్ట్ సెకండ్ వీక్‌ కలెక్షన్స్ సాధించిన సినిమాగా ఇలా పలు రికార్డులను 'ధురంధర్‌ 2' క్రియేట్ చేసిందంటున్నారు. అలానే 'ధురంధర్‌' సినిమా పార్ట్ 1 ఓవర్సీస్‌ లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ను ఈ ద్వితీయ భాగం పదిరోజుల్లో క్రాస్ చేసేసిందట. మొత్తం మీద ఆదిత్య ధర్‌ బృందం బాలీవుడ్ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో రాసే సినిమాను రూపొందించారు!

Updated Date - Apr 03 , 2026 | 06:16 PM