Eros: రూ.84 కోట్లు.. ఇప్పించండి! నిన్న అఖండ‌2.. నేడు తేరే ఇష్క్ మే!

ABN , Publish Date - Jan 19 , 2026 | 06:07 AM

గ‌త నెల‌లో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి మంచి విజ‌యం సాధించిన హిందీ చిత్రం తేరే ఇష్క్ ఇప్పుడు ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది.

Eros

గ‌త నెల‌లో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి మంచి విజ‌యం సాధించిన హిందీ చిత్రం తేరే ఇష్క్ మే. తెలుగులో అమ‌ర కావ్యం గా రిలీజ్ అయింది. అయితే ఇప్పుడు ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. హీరో ధనుష్ (Dhanush), దర్శకుడు ఆనంద్‌ ఎల్‌ రాయ్ (Aanand L. Rai) కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ ‘తేరే ఇష్క్‌ మే’ (Tere Ishk Mein) సినిమాపై ప్రముఖ నిర్మాణసంస్థ ఈరోస్‌ ఇంటర్నేషనల్ (Eros International) ఆనంద్‌ ఎల్‌.రాయ్ (Aanand L. Rai)కి చెందిన కలర్‌ ఎల్లో ప్రొడక్షన్స్ (Colour Yellow Productions)పై బాంబే హైకోర్టు (Bombay High Court) లో పిటిషన్‌ దాఖలు చేసింది.

తమ అనుమతిలేకుండా, తమకు చెందిన ‘రాంఝానా’ (Raanjhanaa) చిత్రంలోని పాత్రలు, కథా నేపథ్యాన్ని ‘తేరే ఇష్క్‌ మే’ చిత్రంలో ఉపయోగించడం ద్వారా ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ కాపీరైట్‌ చట్టాన్ని ఉల్లంఘించారని ఈరోస్‌ ఆరోపించింది. కాపీరైట్‌ ఒప్పందాల ఉల్లంఘన కింద తమకు రూ. 84 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని న్యాయస్థానాన్ని కోరింది.

dhanush Eros

ధనుష్‌, ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘తేరే ఇష్క్‌ మే’ చిత్రం ‘రాంఝానా’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కించినట్లు ప్రచార కార్యక్రమాల్లో ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ చెప్పారు. దీంతో ‘రాంఝానా’ చిత్రాన్ని నిర్మించిన ఈరోస్‌ ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే గ‌త నెల‌లో ఇలాగే ఈరోస్ సంస్థ బాల‌కృష్ణ అఖండ 2 తాండ‌వం సినిమా రిలీజ్ విష‌యంలో ఇలానే అడ్డ‌ప‌డ‌గా అఖండ సినిమా వాయిదా ప‌డ‌డం ప్ర‌తికూల ఫ‌లితాలు రావ‌డం జ‌రిగింది.

Updated Date - Jan 19 , 2026 | 06:43 AM