Tere Ishq Mein: ధనుష్, ఆనంద్ రాయ్ మరో సినిమా...
ABN , Publish Date - Jan 07 , 2026 | 01:02 PM
ఇప్పటికే ధనుష్, ఆనంద్ ఎల్ రాయ్ కాంబినేషన్ లో మూడు సినిమాలు వచ్చాయి. తాజా చిత్రం 'తేరే ఇష్క్ మే' మంచి విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు వీరి కాంబోలో నాలుగో సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి.
తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) కు ఉత్తరభారతంలోనూ మంచి గుర్తింపే ఉంది. అతను చేసిన హిందీ చిత్రాలు చక్కని విజయాన్ని అందించడమే కాదు... నటుడిగా ధనుష్ కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. గత యేడాది ధనుష్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మూడు సినిమాల్లో నటించాడు. అయితే తెలుగు సినిమా 'కుబేర' (Kubera), తమిళ చిత్రం 'ఇడ్లీ కడై' (Idli Kadai) ఆశించిన స్థాయిలో ఆడకపోయినా... హిందీ సినిమా 'తేరే ఇష్క్ మే' (Tere Ishq Mein) మాత్రం మంచి విజయాన్ని అందుకుని ధనుష్ కు ఊరటను కలిగించింది. దాంతో మరోసారి ఆనంద్ ఎల్ రాయ్ (Anand L Rai) తో ధనుష్ మూవీ చేయబోతున్నాడనే వార్త బాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది.
'తేరే ఇష్క్ మే' మూవీ ధనుష్, ఆనంద్ రాయ్ కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా. దీనికి ముందు ఆనంద్ రాయ్ దర్శకత్వంలో ధనుష్ 'రాంఝానా' (Raanjhanaa), 'అత్రంగి రే' (Atrangi Re) చిత్రాలు చూశాడు. మొదటి సినిమా ఘన విజయం సాధించినా... 'అత్రంగి రే' పెద్దంతగా ఆడలేదు. కానీ ఇప్పుడీ మూడో సినిమా హిట్ కావడంతో ధనుష్ కోసం ఆనంద్ రాయ్ పీరియడ్ యాక్షన్ రొమాంటిక్ కథను రెడీ చేశాడట. ధనుష్ నటించబోయే ఈ 55వ సినిమాను సంజయ్ లీలా బన్సాలీ నిర్మిస్తున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ధనుష్ నటించిన 54వ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అది ఈ యేడాది ఫిబ్రవరి లేదా మార్చిలో వస్తుంది. ఆ తర్వాత సెట్స్ పైకి ఆనంద్ ఎల్ రాయ్ మూవీనే వెళుతుందని అంటున్నారు.